బీజేపీ అధ్యక్ష పదవి పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు: తెలంగాణ బీజేపీలో కోల్డ్‌వార్?
ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యే టీ. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.;
తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పుపై చర్చలు, అంతర్గత కలహాలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యే టీ. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావును నియమించిన నేపథ్యంలో రాజాసింగ్ మాట్లాడుతూ "ఒక నాయకుడిని అధిష్ఠానం అలా నియమించడమే కరెక్ట్ కాదు, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర నేత వరకు ఓటు వేసి అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అలా చేస్తేనే కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే మావాడు, మీవాడు అనే దృష్టితో వ్యవహరిస్తే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది" అని హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే నాయకత్వ ఎంపిక పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ క్రమంలో రాజాసింగ్ విడుదల చేసిన ఓ వీడియో మరింత ఆసక్తిని రేపుతోంది. "నన్ను అధ్యక్షుడిగా చూడాలని పలువురు కార్యకర్తలు కోరుతున్నారు. గోరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయడమే కాదు, హిందుత్వం కోసం పనిచేసే కార్యకర్తలకు రక్షణ కల్పిస్తాను. నాకు అవకాశం ఇస్తే ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించగలను. కానీ నా నియామకానికి వ్యతిరేకంగా ఓ బృందం పావులు కదుపుతోంది" అని ఆయన ఆరోపించారు. రాజాసింగ్ అభిప్రాయం ప్రకారం.. "బీజేపీ అధ్యక్ష పదవిని వీఐపీలా ఉండే వారికంటే హిందుత్వం కోసం నిజంగా పోరాడే వ్యక్తికే ఇవ్వాలి. అదే పార్టీ బలోపేతానికి దోహదపడుతుంది" అన్నారు.
- పార్టీకి తలెత్తిన అంతర్గత విభేదాలు
రాజాసింగ్ వ్యాఖ్యలు చూస్తే, బీజేపీ రాష్ట్ర స్థాయిలో విభేదాలు తారాస్థాయికి చేరాయని స్పష్టమవుతోంది. హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలపై సూటిగా ప్రశ్నలు వేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వర్గ పోరును బహిరంగం చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
ఈ పరిణామాల మధ్య రాష్ట్ర బీజేపీ భవిష్యత్ దిశ ఏంటి? పార్టీకి అవసరమైన ఏకత్వం ఎలా సాధ్యం? అనే ప్రశ్నలు కార్యకర్తల మదిలో తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా రాజాసింగ్ వ్యాఖ్యలతో బీజేపీ తెలంగాణలో నాయకత్వ సమీకరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది.