తెలంగాణ అసెంబ్లీ.. `ఫస్ట్ డే` ఏం చేశారంటే!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు సహజంగానే ఏ సభ అయినా.. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమవుతుంది.;
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు సహజంగానే ఏ సభ అయినా.. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమవుతుంది. అలానే తెలంగాణ అసెంబ్లీ కూడా ప్రశాంతంగా ప్రారంభమైంది. కానీ, సభలో ప్రధానప్రతిపక్షం బీఆర్ఎస్ పక్షం ఆలస్యంగా వచ్చింది. వచ్చిన తర్వాత.. రైతుల సమస్యలపై చర్చకు తీర్మానం ఇచ్చారు. కానీ, తొలిరోజు పలు విషయాలు ఉన్నాయని.. ముందు వాటిని తీసుకుంటామని స్పీకర్ ప్రసాదరావు స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు తమ తమ స్థానాల్లో నిలబడి నిరసన వ్యక్తం చేశారు.
మరోవైపు.. తొలిరోజు అసెంబ్లీలో మూడు మాసాల కిందట అనారోగ్యంతో మృతి చెందిన జూబ్లీహిల్స్ బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సంతాపం ప్రకటించారు. దీనిపై మంత్రులు సంతాప తీర్మానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ఈ తీర్మానం ప్రవేశ పెట్టామని.. మంచి నేత విషయంలో చర్చించేందుకు తమకు భేషజాలు లేవన్నారు. తనకు మాగంటితో అనేక విషయాల్లో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెప్పారు. ఆయన మంచి నాయకుడిగా ప్రజల గుర్తింపు సాధించారని తెలిపారు.
టీడీపీలో ఉన్నప్పుడు ఇరువురు.. చేసిన పనులను ఈ సందర్భంగా సీఎం చెప్పారు. విద్యార్థి స్థాయిలోనే మాగంటి రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన అనేక రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నారని తెలిపారు. విద్యార్థి నేతగా , ప్రజాప్రతినిధిగా, సినీ నిర్మాతగా రాణించారన్నారు. అనంతరం... పలువురు మంత్రులు కూడా సంతాప తీర్మానంపై ప్రసంగించారు.
మండలిలో..
శాసన మండలి సమావేశాలు కూడా శనివారమే ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొత్తగా మండలిలో ప్రవేశించిన వారికి రాజ్యాంగ ప్రతులు అందించారు. అనంతరం వారిని సభకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమం తర్వాత.. మండలిలోనూ.. సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టారు. మాజీ ఎమ్మెల్సీలు రత్నాకర్, రంగారెడ్డి మృతిపట్ల సభ్యులు తమతమ భావాలను వ్యక్తం చేశారు.
సోమవారానికి వాయిదా..
ఈ సంతాప తీర్మానాల అనంతరం.. ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడనున్నాయి. అయితే.. శనివారం మధ్యాహ్నం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ(బీఏసీ) భేటీ అయి సభలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై చర్చించనున్నాయి. దాని ప్రకారమే.. సోమవారం నుంచి సభలు జరగనున్నాయి.