మహాఘట్ బంధన్ లెక్కతప్పుతోందా..? తేజస్వీ నిర్ణయం ఎవరికి లాభం..?

బిహార్ రాష్ట్రంలో ఈ నెల చివరి వరకు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్ధం అవుతున్నాయి.;

Update: 2025-09-16 20:30 GMT

బిహార్ రాష్ట్రంలో ఈ నెల చివరి వరకు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్ధం అవుతున్నాయి. ‘ఓట్ చోరీ’ అంటూ ప్రచారం మొదలుపెట్టిన రాహుల్ గాంధీ ఇప్పుడు నెమ్మదించారు. ఎలక్షన్ కమిషన్, సుప్రీం కోర్టు మొట్టికాయలతో కాస్త నెమ్మదించారు. తేజస్వీ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) ఈ సారి అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మహాఘట్ బంధన్ స్థాపించి అందులో కాంగ్రెస్ లో కలిసి పోటీకి దిగుతుంది. నితీశ్ కుమార్ కు కొంత ఆదరణ తగ్గుతుండడంతో ఈ సారి ఎలాగైనా కుర్చీని సొంతం చేసుకోవాలని ఆర్ జేడీ భావిస్తోంది. కానీ రాహుల్ తో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తేనే సాధ్యం అవుతుందని అనుకుంటుంది. అందుకే రెండు రోజుల క్రితం తేజస్వీ యాదవ్ అన్ని అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు. తేజస్వీ యాదవ్ నిర్ణయం కాంగ్రెస్ ను కలవరపెడుతోంది.

బిహార్ లో ఆర్‌జేడీ బలమైన పార్టీ..

బిహార్ రాజకీయాల్లో ఆర్‌జేడీ బలమైన పార్టీ. లాలూ ప్రసాద్ యాదవ్ వారసత్వాన్ని తేజస్వీ యాదవ్ కొనసాగిస్తున్నారు. మైనారిటీలు, పేదలు, వెనుకబడిన వర్గాల మద్దతు ఆర్‌జేడీకి ఉంది. కాంగ్రెస్‌తో గతంలో పొత్తులు పెట్టుకున్నప్పటికీ, ప్రతి ఎన్నికలో సీట్ల కేటాయింపు విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ వచ్చాయి. ఈసారి ఆర్‌జేడీ అన్ని సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించడం.. కూటమి రాజకీయాల్లో పెను మార్పు సూచిస్తోంది.

కాంగ్రెస్‌పై ప్రభావం..

రెండు దశాబ్దాలను పరిశీలిస్తే బిహార్‌లో కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతూ వస్తోంది. ఆర్‌జేడీ వంటి బలమైన మిత్ర పార్టీ సహకారం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయడం కాంగ్రెస్‌కు కష్ట సాధ్యం. ఆర్‌జేడీ నిర్ణయం వల్ల కాంగ్రెస్ ఓటు చీలే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే, కూటమి లేకపోవడం వలన బీజేపీ లేదంటే జేడీయూ వంటి పార్టీలకు లాభం కలుగవచ్చు.

సందిగ్ధంలో మహాఘట్ బందన్ భవిష్యత్తు..

ఐఎన్‌డీఐఏ (INDIA) కూటమి ఒకే వేదికపై కూర్చోడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. బిహార్‌లో ఈ విభేదాలు కూటమి భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారింది. తేజస్వీ ప్రకటన కూటమి ఐక్యతపై సందేహాలు రేకెత్తిస్తోంది. మరో వైపు ప్రజల్లో ప్రతిపక్షం విడిపోయిందనే భావన కలిగిస్తోంది. ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం లేకపోలేదు.

ఆర్‌జేడీ లెక్కలు..

సుధీర్ఘ కాలం ఆర్ జేడీ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచింది. ఇప్పుడు కూడా కలిసే ఉంది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం సీట్ల పంపకాల్లో పట్టువీడేది లేదని స్పష్టం చేసింది. తేజస్వీ నిర్ణయాన్ని పరిశీలిస్తే పార్టీ స్వతంత్రంగా ఎదగాలని అనుకుంటుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీ క్షీణ దశలో ఉంది. ఏ పార్టీ కూడా దానితో పొత్తుకు సిద్ధంగా లేవు. ఈ నేపథ్యంలో తాము కూడా అంటీ ముట్టనట్లు ఉంటే పార్టీ భవిష్యత్తు మారుతుందని అనుకుంటున్నారు. ఇక తేజ్ ప్రతాప్, తేజస్వీ యాదవ్ నేతృత్వంలో యువ ఓటర్లను ఎక్కువగా ఆకర్షించాలని అనుకుంటుంది. గతంలో పొత్తు పెట్టకున్న సమయంలో సీట్ల విషయంలో తగువులు వచ్చేవి. ఎప్పుడూ కాంగ్రెస్ తక్కువ సీట్లు కేటాయించేది. కానీ ఈ సారి అది జరగదని తేజస్వీ ప్రకటన స్పష్టం చేస్తుంది.

కాంగ్రెస్ కంటే ఆర్‌జేడీకి లాభం ఎక్కువ..

మహా ఘట్ బంధన్ నుంచి ఇద్దరు నాయకులు పోటీ చేస్తే సాధారణంగానే ఓట్లు చీలుతాయి. ఫలితంగా బీజేపీకే లాభం చేకూరే అవకాశం లేకపోలేదు. ఈ విషయం తేజస్వీ యాదవ్ కు తెలుసు కానీ, ఆర్ జేడీకి సొంత ఓటు బ్యాంకు ఉంది. దీనితో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ లాభం పొందుతామని ఆయన భావిస్తున్నారు.

Tags:    

Similar News