భారీ ఓటమి తరువాత ఆర్జేడీ తొలి రియాక్షన్

రాజకీయ నాయకులు ఆశల పల్లకిలో ఊరేగుతారు. వాస్తవాలు వారి కళ్ళు తెరిపించేలోగానే అంతా జరిగిపోతుంది. లాలూ ఫ్యామిలీ దానికి అతీతం కానే కాదు.;

Update: 2025-11-15 14:26 GMT

రాజకీయ నాయకులు ఆశల పల్లకిలో ఊరేగుతారు. వాస్తవాలు వారి కళ్ళు తెరిపించేలోగానే అంతా జరిగిపోతుంది. లాలూ ఫ్యామిలీ దానికి అతీతం కానే కాదు. అక్టోబర్ 20న దేశమంతా దీపావళి జరుగుపుంటూంటే లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం మాకు ఈ రోజు దీపావళి కాదు నవంబర్ 14న జరుపుకుంటామని చెప్పి ఒక విధంగా ఓవర్ కాన్ఫిడెన్స్ నే ప్రదర్శించారు. ఇక ఆయన కుమారుడు ఆర్జేడీ అగ్రే నేత తేజస్వి యాదవ్ మరో అడుగు ముందుకేసి నవంబర్ 18న సీఎం గా ప్రమాణ స్వీకారం అని ప్రకటించేశారు. తీరా ఎన్నికల ఫలితాలు వెలువడిన నవంబర్ 14న ఆర్జేడీకి దీపావళి కాదు కదా గొడ్డు అమావాస్యను కళ్ళ ముందు నిలిపింది.

ఓటమి సాధారణం :

రాజకీయ ప్రయాణంలో ఓటమి ఒక భాగం. అంతే కాదు ప్రజలకు సేవ చేయడం ఒక నిరంతరం జరిగే ప్రక్రియ. గెలుపునకు పొంగి పోవడం ఓటమికి కృంగిపోవడం అన్నది విధానం కాదని ఆర్జేడీ సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పెట్టిన తొలి రియాక్షన్ పోస్టులో పేర్కొంది. ఆర్జేడీ అంటేనే పేదల పార్టీగా అభివర్ణించింది. తాము పేదల కోసం ఇంకా ఎక్కువగా పనిచేస్తామని వారి కోసం గొంతు బలంగా విప్పుతామని కూడా స్పష్టం చేసింది. ఆర్జేడీ అగ్ర నేతలు లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ పేర్ల మీద ఈ ట్వీట్ ని రిలీజ్ చేశారు.

కష్టమైనా ముందుకే :

ఒక విధంగా ఆర్జేడీకి నోట మాట రాని విధంగా ఫలితలౌ వచ్చాయి. గతసారి ఆర్జేడీకే సొంతంగా 75 సీట్లు వస్తే ఇపుడు కేవలం పాతిక మాత్రమే దక్కాయి అంటే యాభై సీట్లు ఆర్జేడీ కోల్పోయింది. అంతే కాదు మిత్రులు అంతా కూడా వెనకబడిపోయారు. అంతా కలసి కూటమికి దక్కినవి 34 సీట్లు మాత్రమే శాసనసభలో బలమైన కూటమిగా ఎన్డీయే ఉంది. మొత్తం అసెంబ్లీని నిండుగా పరచుకుని ఉంది. ఈ నేపధ్యంలో ఆర్జేడీ నాయకత్వంలో మహా ఘట్ బంధన్ విపక్ష పాత్ర అసెంబ్లీ లోపలా బయటా ఏ విధంగా పోషించనుంది అన్నదే చర్చగా ఉంది.

డీఎంకే అనుభవమే :

తమిళనాడులో డీఎంకే దశాబ్దాల పాటు అధికారానికి దూరం అయి ఎన్నో ఇబ్బందులు పడింది. ఎం జీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి మూడు సార్లు గెలిచారు. ఆయన హయాంలో డీఎంకే పూర్తిగా ప్రతిపక్షమే అయింది. ఎన్ని సార్లు పోటీ చేసినా గెలుపు అన్నది లేకుండా పోయింది. తిరిగి 1989లో డీఎంకే గెలిచేంతవరకూ ఒక పదమూడేళ్ళ పాటు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవరోధాలు తట్టుకుంది. దాని వెనక కరుణానిధి వ్యూహాలు ఆయన నాయకత్వం గ్లామర్ స్టాలిన్ తోడ్పాటు, అంకిత భావంతో పనిచేసే క్యాడర్ అన్నీ దోహదపడ్డాయి.

అతి పెద్ద సవాల్ గా :

ఇక బీహార్ లో లాలూ చూస్తే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. తేజస్వి యాదవ్ తండ్రి మాదిరిగా వ్యూహకర్త కాదని అంటారు. పైగా దూకుడు స్వభావంతో ముందుకు సాగుతారని చెబుతారు. ఇక సొంతంగా ఆయన ఒక్కరే పార్టీని ముందుకు నడిపించాల్సి ఉంది.ఆర్జేడీకి మంచి ఓటు బ్యాంక్ ఉంది అదే శ్రీరామ రక్ష. అయితే రాజకీయాల్లో ఏదీ శాశ్వతం అయితే కాదు, పైగా ఎన్ డీయే మంచి దూకుడు మీద ఉంది. దాంతో బీహార్ లో రాజకీయాలను ఏ విధంగా మార్చుక్తుందో తనకు అనుకూలంగా చేసుకుంటుందో చూడాల్సి ఉంది. మొత్తానికి తేజస్వికి 2020 నుంచి 2025 వరకూ నిర్వహించిన రాజకీయం ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి మరో అయిదేళ్ళ పాటు పార్టీని నడపడం అతి పెద్ద సవాల్ గానే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News