సీఎం కావాలనుకున్న తేజస్వి వైరాగ్యం..లాలూ ఏం చెప్పారంటే ?

ఎంత ధీమా లేకపోతే ఏకంగా సీఎం గా ముహూర్తం డేట్ ని ప్రకటిస్తారు, ఈ నెల 18న సీఎం గా ప్రమాణం అని అన్నీ ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్న తేజస్వి యాదవ్ కి జనాలు ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు;

Update: 2025-11-19 02:30 GMT

రాజకీయాలు ఎపుడూ నేతల చేతులలో ఉండవు, అవి ప్రజలతో ముడి పడి ఉన్న అంశాలు నేను ఇన్నేళ్ళు పదవిలో ఉంటాను అని నాయకులు అనుకోవచ్చు, కానీ ప్రజలు ప్రతీ అయిదేళ్ళకు తీర్పు ఇస్తారు, వారు ఇచ్చే తీర్పు మాత్రం చాలా విలక్షణంగా ఉంటుంది. దానికి ఎవరైనా తలవొగ్గాల్సిందే. అలాంటి పరిస్థితి ఇపుడు లాలూ కుమారుడు ఆర్జేడీ అగ్ర నేత తేజస్వి యాదవ్ కి వచ్చింది. ఆయన సీఎం కచ్చితంగా అవుతాను అని బీహార్ లాంటి పెద్ద స్టేట్ ని చిన్న వయసులోనే పాలిస్తాను అని ఎన్నో కలలు కన్నారు. ఎంత ధీమా లేకపోతే ఏకంగా సీఎం గా ముహూర్తం డేట్ ని ప్రకటిస్తారు, ఈ నెల 18న సీఎం గా ప్రమాణం అని అన్నీ ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్న తేజస్వి యాదవ్ కి జనాలు ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు. దాంతో ఈ యువ నేత పూర్తి వైరాగ్యంలో పడిపోయారు.

నాకొద్దీ పదవి అంటూ :

గడచిన అయిదేళ్ళ కాలంలో బీహార్ అసెంబ్లీలో తేజస్వి యాదవ్ విపక్ష నేతగా ఉన్నారు. ఆయన అక్కడ నుంచి ప్రమోషన్ అందుకుని సీఎం కావాలని చూస్తే అదే సీటు అదే ఫైట్ అంటే బోర్ కొట్టినట్లుంది. లేదా రాజకీయ వైరాగ్యం ఆవహించినట్లుంది. అందుకే తనకు వద్దు ఆ పదవి అని తండ్రి ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కి చెప్పారని అంటున్నారు. తాను ఓటమికి బాధ్యత వహిస్తాను అని కూడా చెప్పారుట. ఎంతో కష్టపడ్డామని అయినా ఓటమి వరించింది అని ఆయన వాపోయారుట. తనకు జస్ట్ ఎమ్మెల్యేగా ఉంటే చాలు విపక్ష హోదా అవసరం లేదని కూడా పేర్కొన్నారుట. అయితే పెద్దాయన ఎంతో అనుభవం కలిగిన లాలూ ప్రసాద్ అయితే కుమారుడికి నచ్చచెప్పారని పార్టీ వర్గాల భోగట్టా.

నడిపించాల్సిందే :

లాలూ అయితే రాజకీయంగా ఎంతో ఢక్కామెక్కీలు తిన్నారు ఆయన ఎత్తు పల్లాలు ఎన్నో చూశారు. అందుకే కుమారుడికి నచ్చ చెప్పారు అని అంటున్నారు. పార్టీని నడిపించాలని అదే సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ బాధ్యతగా వ్యవహరించారని పార్టీ వర్గాలు చెప్పాయి దాంతో ఎట్టకేలకు తేజస్వి యాదవ్ విపక్ష నేతగా ఉండేందుకు అంగీకరించారు. ఇక చూస్తే తాజా ఎన్నికల్లో ఆర్జేడీకి కేవలం పాతిక సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఈ నంబర్ విపక్ష నేత హోదా దక్కేందుకు ఉపయోగపడుతుంది. కేబినెట్ ర్యాంక్ ఉంటుంది.

సన్నివేశం పాతదే అయినా :

మొత్తానికి గట్టిగా నాలుగు పదులు లేని తేజస్వి యాదవ్ కి ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉందని ముందే ఊహించిన లాలూ ఈ పదవిలో ఉండడం అతి ముఖ్యమని దిశా నిర్దేశం చేశారు అని అంటున్నారు. అదే సమయంలో కొత్తగా ఎన్నికైన 25 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా తేజస్వి యాదవ్‌ను ఎన్నుకున్నారని ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తి సింగ్ తెలిపారు. మొత్తానికి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఉంటే విపక్ష నేతగా తేజస్వి యాదవ్ ఆయనకు ఎదురు నిలుస్తారు అన్న మాట. సన్నివేశం పాతదే అయినా ఈసారి అసెంబ్లీ రాజకీయం కొత్తగా ఉండొచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News