లాలూ ఫ్యామిలీకి దీపావళి ఆ రోజేనట..పక్కా కాన్ఫిడెన్స్ !
బీహార్ లో అధికారంలోకి వచ్చేది మేమే అని చాలా ధీమాగా ఆర్జేడీ నేత బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అయిన తేజస్వి యాదవ్ ప్రకటించారు.;
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరం ఇపుడు దేశంలో హాట్ టాపిక్ గా ఉంది. బీహార్ రాజకీయాలు దేశ రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేస్తాయని అపుడే జాతీయ మీడియా కథనాలు పుంఖానుపుంఖాలుగా ప్రసారం అవుతున్నాయి. అదే సమయంలో కేంద్రంలో రెండు ఊత కర్రల లాంటి పార్టీలతో మనుగడ సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల ఫలితాలు అత్యంత కీలకం అని చెబుతున్నారు. ఇక బీహార్ లో ఈసారి ఓటర్లు మార్పు కోరుకుంటున్నారు. అని చాలా సర్వేలు చెబుతున్న విషయం. ఈ నేపథ్యంలో కాబోయే సీఎం నేనే అంటున్నారు లాలూ కుమారుడు తేజస్వి యాదవ్.
వచ్చేది మేమే :
బీహార్ లో అధికారంలోకి వచ్చేది మేమే అని చాలా ధీమాగా ఆర్జేడీ నేత బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అయిన తేజస్వి యాదవ్ ప్రకటించారు. ప్రజలలో తిరుగుతున్న తమకు వారి నాడి పక్కాగా తెలుసు అన్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిచి నిలుస్తామని ఆయన చెప్పారు. దీపావళి తమకు అక్టోబర్ 20 కానే కాదని ఆయన చెబుతూ నవంబర్ 14న దీపావళి తాము అంతా జరుపుకుంటామని ఆయన చెబుతున్నారు. ఆ రోజున బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఈసారి పూర్తి మెజారిటీతో ఆర్జేడీ నాయకత్వంలోని మహా ఘట్ బంధం గెలుస్తుందని ఆయన చెబుతున్నారు.
యూత్ లీడర్ గా :
బీహార్ లో ఏడున్నర పదుల వయసు కలిగిన నితీష్ కుమార్ ని జనాలు గత రెండు దశాబ్దాలుగా చూస్తున్నారు. ఆయనకు ఆల్టర్నేషన్ గా తేజస్వి యాదవ్ ని చూస్తున్నారు. పైగా నాలుగు పదుల లోపు వయసు కలిగిన ఈ యువ నేత బీహార్ లో అత్యధిక శాతం ఉన్న యూత్ ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. దాంతో ఆయనకు జెన్ జెడ్ ఓటర్లతో పాటు బిలో ఫార్టీ ఓటర్లు అంతా ఫుల్ సపోర్ట్ గా నిలుస్తున్నారు. దానికి తగినట్లుగా ఆయన కూడా యూత్ ఓటర్లను ఆకట్టుకునేలా అద్భుతమైన హామీని ఒక దానిని ఇచ్చారు.
అది బ్రహ్మాస్త్రంగా :
ప్రతీ ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం అని ఆర్జేడీ తన ఎన్నికల హామీగా ప్రకటించింది. దాంతో ఇది యూత్ లో బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందని ఆర్జేడీ ఊహిస్తోంది. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ఆ హామీని నిలబెట్టుకుంటామని తేజస్వి యాదవ్ చెబుతున్నారు. తండ్రి మాజీ సీఎం లాలూ మాదిరిగానే తేజస్వి యాదవ్ డైనమిక్ లీడర్ గా జనాలకు కనిపిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాకుండా ఆయన ప్రసంగాలలో వేడి వాడి కూడా ఎట్రాక్ట్ చేస్తోంది అంటున్నారు. మరో వైపు చూస్తే సామాజిక సమీకరణలు కూడా ఈసారి మహా ఘట్ బంధన్ కి అనుకూలంగా మారబోతున్నాయని అంటున్నారు. మరి దీపావళి అక్టోబర్ 20 కాదు నవంబర్ 14న చేసుకుంటామని అంటున్న లాలూ ఫ్యామిలీ ధీమాను ఓటర్లు ఎంత వరకూ నిలబెడతారు అన్నది చూడాల్సి ఉంది.