జగన్ ఈవెంట్ పాలిటిక్స్.. టీడీపీ ట్వీట్ల వార్

ఇక బంగారుపాళ్యం పర్యటనపై మరో ట్వీట్ లో ‘‘మామిడి రైతుల పరామర్శ పేరిట చేపట్టిన ఈవెంట్ పాలిటిక్స్ లో వైసీపీ నేతల వికృత చర్యలు’’ అంటూ మామిడికాయలను రోడ్డుపై పారబోసిన వీడియోను షేర్ చేసింది.;

Update: 2025-07-09 11:57 GMT

మాజీ ముఖ్యమంత్రి జగన్ బంగారుపాళ్యం పర్యటనపై టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం చూపారని, మామిడి కాయలను నేలపై పారబోసి ట్రాక్టర్లతో తొక్కి వికృత చేష్టలకు పాల్పడ్డారని ధ్వజమెత్తింది. టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో వైసీపీ కార్యకర్తల వీడియోలు మామిడికాయలను రోడ్డుపై పారబోసి ట్రాక్టర్లతో తొక్కంచిన వీడియోలు, ఫొటోలను షేర్ చేసింది. ఈ సంఘటనపై వరుస ట్వీట్లతో టీడీపీ హోరెత్తించింది.

అంతేకాకుండా మాజీ సీఎం జగన్ పర్యటనను ఈవెంట్ పాలిటిక్స్ గా అభివర్ణించింది. మిర్చి రైతుల పరామర్శ పేరిట గుంటూరు మిర్చియార్డులో మిర్చి బస్తాలను మాయం చేశారని, పొగాకు రైతుల పరామర్శ పేరుతో పొగాకు బేళ్ల ధ్వంసం చేశారని, మామిడి రైతుల పరామర్శ పేరుతో మామిడి పంట నాశనం చేశారని మరో ట్వీట్ చేసింది. ఇక దొంగతనం.. ధ్వంసం.. నాశనం... ఇదే జగన్ మార్క్ పరామర్శ అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించింది.

ఇక బంగారుపాళ్యం పర్యటనపై మరో ట్వీట్ లో ‘‘మామిడి రైతుల పరామర్శ పేరిట చేపట్టిన ఈవెంట్ పాలిటిక్స్ లో వైసీపీ నేతల వికృత చర్యలు’’ అంటూ మామిడికాయలను రోడ్డుపై పారబోసిన వీడియోను షేర్ చేసింది. మార్కెట్ లో అమ్మాల్సిన మామిడి కాయలను తెచ్చి రోడ్డుపై కాన్వాయ్ ముందు పోసి డ్రామా అడుతున్నారని మండిపడింది. ‘‘జగన్ వచ్చిన సమయంలో రోడ్డుపై పంటను పారబోసి ఆ దృశ్యాల ద్వారా తప్పుడు ప్రచారం చేసేందుకు ఈవెంట్ ప్లానింగ్. తమను ఎవరూ పట్టించుకోలేదని అని జగన్ కు రైతులు చెప్పినట్లుగా చిత్రీకరించడానికి స్క్రిప్ట్ ప్రకారం రోడ్డుపై మామిడి పంట.’’ అంటూ ఆ ట్వీట్ లో విమర్శలు గుప్పించింది.

ఇక మరో ఫొటోను షేర్ చేస్తూ కాన్వాయ్ కింద పడి చావడం ఎందుకు అనుకున్నారో ఏమో దరిదాపుల్లోకి ఎవరూ రావడం లేదంటూ జగన్ వాహనం వద్ద జనం లేని ఫొటోను షేర్ చేసింది టీడీపీ. అదేవిధంగా ముందుగా అనుకున్న స్క్రిప్టు ప్రకారం మామిడి కాయలను రోడ్డుపై పారబోశారంటూ మరో ట్వీట్ వదిలింది. ‘‘జగన్ మెప్పు కోసం మామిడి పంటను రోడ్డు మీద పారబోయాలని ఒక్కరోజు ముందే ప్లాన్ చేసిన వైసీపీ బ్యాచ్....అనుకున్న డ్రామా ప్రకారం పైశాచికంగా మామిడి పంట రోడ్డుమీద పారబోసిన పిల్ల సైకోలు’’ అంటూ ఆ ట్వీట్ లో ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఈ ట్వీట్ వార్ లోనే మరోసారి ‘‘రైతులు కష్టపడి పండించిన పంటని, ట్రాక్టర్ కి వైసీపీ జెండాలు కట్టుకుని, రోడ్డు పై పారబోస్తూ, వాటిని టైర్లతో తోక్కిస్తూ, కాళ్ళతో తొక్కుతూ, డ్యాన్సులు వేస్తున్నారు ఉన్మాదులు. ఈ ఉన్మాదుల వికృత చేష్టలు చూసి, జగన్ నవ్వుకుంటూ ఆనంద పడుతున్నాడు’’ అంటూ వ్యాఖ్యానించింది. టీడీపీ అధికారిక ఖాతాలో సుమారు పది ట్వీట్లు వేయడంతో జగన్ పర్యటనను ఆ పార్టీ ఎంతో సీరియస్ గా తీసుకుందని అర్థమవుతోందని అంటున్నారు విశ్లేషకులు. అయితే టీడీపీ వరుస ట్వీట్లతో విరుచుకుపడితే విపక్షం నుంచి కేవలం ఒక ట్వీట్ పై మాత్రమే స్పందన కనిపించింది. జగన్ పర్యటనలో జనం లేరన్న టీడీపీ ఫొటో ట్వీట్ ను జత చేస్తూ భారీ జనసమూహంతో జగన్ ఉన్న ఫొటోను పోస్టు చేసింది. టీడీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని వైసీపీ కౌంటర్ ఇచ్చింది.

Tags:    

Similar News