మరోసారి జగన్ కి ఇచ్చిపడేసిన చంద్రబాబు.. కసి, పట్టుదలతో పనిచేస్తున్నానని ట్వీట్

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద గతంలో కూల్చేసిన ప్రజావేదిక మరోమారు వార్తల్లోకి ఎక్కింది.;

Update: 2025-06-26 10:18 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద గతంలో కూల్చేసిన ప్రజావేదిక మరోమారు వార్తల్లోకి ఎక్కింది. గత ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ప్రజా వేదిక కూల్చివేయడం అప్పట్లో పెను సంచలనమైంది. అదే నాటి జగన్ ప్రభుత్వ ఓటమికి తొలి అడుగుగా మారిందని, జగన్ విధ్వంస పాలనకు నిదర్శనమని టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. ఇక ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీ మట్టి కరిచినా టీడీపీ మాత్రం వదలడం లేదు. జగన్ పాలనలో విధ్వంసానికి ఉదాహరణ అంటూ గతంలో కూల్చేసిన ప్రజావేదిక ఫొటోలను వైరల్ చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

అధికారం కోల్పోయి ఏడాది అయినా మాజీ సీఎం జగన్ ఆరేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ చర్చనీయాంశమవుతోందని అంటున్నారు. ప్రజావేదిక కూల్చివేత జగన్ ప్రభుత్వానికి ఎంతో నష్టం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ ఇప్పటికీ అదే అంశాన్ని హైలెట్ చేస్తూ వైసీపీని కార్నర్ చేస్తోంది. అయితే అధికారంలో ఉండగా, ఏదో కారణం చెప్పి తప్పించుకున్న వైసీపీ.. ఇప్పుడు టీడీపీ విమర్శలను సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నంలో ఏం కౌంటర్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

2019లో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఇంటిపక్కన నిర్మించిన ప్రజా వేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించారు. రెండు రోజుల సమావేశం అనంతరం కరకట్టపై అక్రమంగా అనుమతి లేకుండా నిర్మించిన ప్రజా వేదికలో ఇదే చివరి సమావేశమని, ఆక్రమణలపై తన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తేల్చిచెప్పారు. ప్రజావేదిక కూల్చివేతపై అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. సుమారు 9 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక చంద్రబాబు ఇంటి వద్ద ఉందన్న కారణంగానే కూల్చివేశారని టీడీపీ అప్పట్లో ధ్వజమెత్తింది. ఆ ఘటనే జగన్ లో విధ్వంసానికి ప్రతీకగా అభివర్ణించింది. ఎన్నికల్లోనూ ఇదే అంశాన్ని ప్రచారం చేసింది.

అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా టీడీపీ అప్పట్లో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వదలడం లేదు. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజావేదిక శిథిలాలను సందర్శించారు. జగన్ పాలనలో విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో భవిష్యత్ తరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ శిథిలాలను అలా వదిలేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఆరేళ్ల క్రితం చోటుచేసుకున్న ఘటనను మరోమారు తెరపైకి తెచ్చారు సీఎం చంద్రబాబు.

దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమాన్నినిర్వహించడాన్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్రంలో 6 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రజావేదిక కూల్చి గత ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంస పాలనకు తొలి అడుగు వేసింది. ఎమర్జెన్సీని మించిన నియంతృత్వ పాలనకు తెరలేపింది. ప్రజాస్వామ్యంలో నియంతలకు, విధ్వంసకారులకు చోటు లేదని.. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ప్రజలు నిరూపించారు. కూల్చివేతల పాలకులను కూల్చిన ప్రజలు...పునర్మిర్మాణ బాధ్యతను కూటమికి అప్పగించారు.’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రజలిచ్చిన అవకాశంతో కసి, పట్టుదలతో రాష్ట్ర పునః నిర్మాణానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరింత గట్టి సంకల్పంతో వికాసం వైపు ప్రయాణం చేద్దాం అంటూ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News