హిస్టరీ రిపీట్ అంటున్న లోకేష్

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చాక వరసగా రెండు సార్లు గెలిచిన సందర్భం ఒక్కటే ఉంది. అది 1999లోనే అని చెప్పాలి.;

Update: 2026-01-20 07:17 GMT

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చాక వరసగా రెండు సార్లు గెలిచిన సందర్భం ఒక్కటే ఉంది. అది 1999లోనే అని చెప్పాలి. 1995లో ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు అయిన చంద్రబాబు తమ తొలి టెర్మ్ పూర్తి చేసుకున్నాక 1999 ఏడాది చివరిలో ఎన్నికలకు వెళ్ళారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుదని ఆనాటి పీసీసీ చీఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ జనాలు మాత్రం చంద్రబాబు నాయకత్వానికే పట్టం కట్టారు. అలా సీఎం గా ఉంటూ ఎన్నికలకు వెళ్ళి వరసగా మరోసారి పవర్ ని అందుకోవడం బాబు టైం లో ఫస్ట్ అండ్ లాస్ట్ అపుడే జరిగింది.

ఒకసారి గెలిస్తే మరోసారి :

ఇక ఆ తరువాత 2004లో ఉమ్మడి ఏపీలో టీడీపీ అధికారం పోగొట్టుకుంది. పదేళ్ళ పాటు ప్రతిపక్ష పాత్రలోకి వెళ్ళింది. విభజన ఏపీలో 2014లో అధికారం అందుకున్న టీడీపీ 2019లో ఓటమిని చూసింది. కచ్చితంగా రెండోసారి గెలుస్తామని ఆనాడు చంద్రబాబు సహా అంతా బలంగా నమ్మారు. కానీ సీన్ రివర్స్ అయి వైసీపీకి అధికారం అప్పగించాల్సి వచ్చింది. అయితే అయిదేళ్ళు తిరగకుండానే బంపర్ మెజారిటీతో 2024 ఎన్నికల్లో కూటమి కట్టి మరీ టీడీపీ అధికారం దక్కించుకుంది. అయితే ఈసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అటు ప్రభుత్వాన్నే కాదు పార్టీని సైతం మరో కంట కనిపెడుతూ అవసరమైన చర్యలు తీసుకుంటూ అధినాయకత్వం చాలా చాకచక్యంగా వ్యవహరిస్తోంది.

లోకేష్ వ్యాఖ్యలతో :

ఈ నేపధ్యంలో ఇటీవల జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ 1999లోనే వరసగా రెండోసారి టీడీపీ గెలిచిందని ఆ చరిత్రను తిరిగి రాయాలని కోరారు. పార్టీలో తప్పులు జరిగితే ఉపేక్షించబోమని చెప్పారు అప్పగించిన బాధ్యతలను నాయకులు సక్రమంగా చేస్తున్నారా లేదా అన్నది చూస్తామని ఆయన చెప్పారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తూ ముందుకు సాగుతామని చెప్పారు. పార్టీ ఇచ్చిన ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తే కచ్చితంగా అధికారంలోకి వస్తామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.

ఎంతో కీలకం :

తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారంలోకి రావడం ఎంతో కీలకం అని అంటున్నారు. 2029లో కనుక మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీలో విపక్షం ఇంకా వీక్ అవుతుంది. అపుడు టీడీపీ రాజకీయ దూకుడు ఇంకా స్పీడ్ అందుకుంటుంది. అంతే కాదు ప్రభుత్వం అనేక దీర్ఘకాలిక ప్రాజెక్టులను చేపడుతోంది. వీటి పూర్తికి అయిదేళ్ళ కాలం సరిపోదు, ఫలితాలు రావాలీ అంటే పదేళ్ళు పదిహేనేళ్ల పాటు పడుతుంది. అందుకే 2029లో గెలిస్తే చాలు ఆటోమేటిక్ గా 2034లోనూ టీడీపీ జెండా ఎగురుతుందని టీడీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు.

బీజేపీ గెలుపు స్పూర్తిగా :

గుజరాత్ లో మూడు దశాబ్దాలుగా బీజేపీ వరసగా గెలుస్తూ వస్తోంది. బీజేపీ ఒకసారి అధికారం చేపడితే మరుసటి ఎన్నికల్లో గెలుపు కోసం డే వన్ నుంచి తన యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేస్తుంది. పార్టీని అందుకోసం పూర్తిగా వినియోగిస్తుంది. టీడీపీ కూడా బీజేపీని చూసి అదే విధానం అమలు చేయాలని చూస్తోంది. ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు రాజకీయ వాతావరణం అభివృద్ధి అజెండా ఇవన్నీ చూసినపుడు కచ్చితంగా వరసబెట్టి ఒకే పార్టీ అధికారంలోకి రావాలని టీడీపీ పెద్దలు కోరుకుంటున్నారు. అందుకే చంద్రబాబు పదే పదే జనాలకు కూడా వినతి చేస్తున్నారు. వైకుంఠపాళి ఆడవద్దని పక్క చూపులు వద్దని ఏపీ అభివృద్ధి కోసం అంతా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. మరి లోకేష్ చెబుతున్నట్లుగా 1999 నాటి చరిత్రను 2029లో టీడీపీ రిపీట్ చేస్తుందా అంటే చూడాల్సిందే.

Tags:    

Similar News