టీడీపీ కొత్త నేత: పల్లె.. పల్లెలో.. సింధూరం..!
ఈ పరిణామాలతోపార్టీకి డ్యామేజీ జరుగుతోందన్న చర్చ జోరుగా సాగింది. దీనిని గమనించిన.. స్థానిక నాయకత్వం.. పార్టీ అధినేత సహా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు.;
కొత్త నేతల తీరు ఏమో ఎలా ఉంటుందో.. అన్న భయం నుంచి టీడీపీ ఇప్పుడిఇప్పుడే బయటకు వస్తోంది. పార్టీలో ఉన్న సీనియర్లను పక్కన పెట్టి.. అనేక మంది యువ నాయకులకు, కొత్తవారికి వారసులకు గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్లు ఇచ్చారు. అయితే.. ఏడాది కాలంలో కొందరు మాత్రమే ఇ లా.. చంద్రబాబు ఆశలకు ఆశయాలకు అనుగుణంగా వ్యవహరించారు. మిగిలిన వారు మాత్రం మౌనంగా ఉన్నారు. ఇక, ఇటీవల కాలంలో చంద్రబాబు బలంగా హెచ్చరికలు జారీ చేయడంతో మార్పు కనిపిస్తోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని.. స్థానిక టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సందూర రెడ్డి విజయం దక్కించుకున్నారు. అయితే.. స్థానికంగా ఆమె ప్రజలకు చేరువ కాలేక పోయారు. కోడలు ఎమ్మెల్యే.. మామ పెత్తనం అనే టాక్ జోరుగా వినిపించింది. సహజంగానే పల్లె కుటుంబంలో రఘునాథరెడ్డి ప్రజలకు చేరువ అయ్యారు కాబట్టి.. ఆయన వద్దకే ఇప్పటికే ప్రజలు వస్తున్నారు.
ఈ పరిణామాలతో పార్టీకి డ్యామేజీ జరుగుతోందన్న చర్చ జోరుగా సాగింది. దీనిని గమనించిన.. స్థానిక నాయకత్వం.. పార్టీ అధినేత సహా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే యాక్టివ్ కావాలని.. బిడియం అవసరం లేదని.. చెప్పుకొచ్చారు. ఫలితంగా గత రెండు వారాలుగా పల్లె సిందూర రెడ్డి గ్రామీణ రాజకీయంపై దృష్టి పెట్టారు. ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు టీడీపీ సొంతం. 2019లో వైసీపీ విజయం దక్కించుకున్నా.. ఆ పార్టీ అనుకున్నంతగా పుంజుకోలేదు.
ఈ క్రమంలో ఇప్పుడు పల్లె సిందూర.. పల్లె బాట పట్టారు. గ్రామాలను చుట్టేస్తున్నారు. తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నా రు. కూటమి సర్కారు చేస్తున్న మేలును వివరిస్తున్నారు. అంతేకాదు.. తాను కూడా వ్యక్తిగతంగా ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే నిధులను సేకరించి.. పనులు చేయిస్తామని హామీ ఇస్తున్నారు. ఇలా.. కొంత ఆలస్యంగా అయినా.. ప్రజలకు చేరువ అవుతుండడంతో సిందూర పేరు ప్రజల మధ్య ఇప్పుడు చర్చకు వస్తోంది.