కేశినేని కొలికపూడి మ్యాటర్...బాబు సీరియస్
అరబ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు బుధవారం అక్కడికి వెళ్ళారు.;
అరబ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు బుధవారం అక్కడికి వెళ్ళారు. చంద్రబాబు ఆయా దేశాలలో పర్యటిస్తూ ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ ఏపీ కోసం కష్టపడుతున్నారు. ఇటువంటి కీలక వేళ అధినాయకుడు ప్రయత్నాలను మద్దతుగా నిలవాల్సిన పార్టీ నేతలే బజారున పడుతున్నారు అని అంటున్నారు. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నది గురువారం హాట్ టాపిక్ గా మారింది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పార్టీని ఇబ్బందుల పాలు చేసింది.
దుబాయ్ నుంచే బాబు :
ఈ నేపథ్యంలో చంద్రబాబు దుబాయ్ నుంచే నేరుగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఫోన్ ద్వారా మాట్లాడారు. కొందరు నాయకుల వైఖరి మీద ఆయన మండిపడినట్లుగా సమాచారంగా ఉంది. సమస్యలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాను వేదికగా చేసుకోవడం మీద ఫైర్ అయినట్లుగా చెబుతున్నారు. నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు రచ్చగా మారుతున్న వైనాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ తరహా చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు అని అంటున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, అలాగే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విషయంలో ఆయన సీరియస్ అయినట్లుగా చెబుతున్నారు.
వారితో మాట్లాడొద్దు :
ఇదిలా ఉంటే ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఆ ఇద్దరు నేతలతో తాను మాట్లాడుతాను అని పల్లా చెప్పగా వద్దు మాట్లాడాల్సిన అవసరం ఏదీ లేదని బాబు చెప్పినట్లుగా తెలిసింది. తానే యూఏఈ నుంచి వచ్చిన తరువాత వారిని పిలిచి మాట్లాడుతాను అని బాబు చెప్పారని అంటున్నారు. దాంతో శుక్రవారం ఈ ఇద్దరు నేతలతో పాటు ఉమ్మడి క్రిష్ణా జిల్లా టీడీపీ నేతలతో పల్లా ఏర్పాటు చేసిన సమావేశాన్ని రద్దు చేసినట్లుగా చెబుతున్నారు.
ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే :
ఇక చూస్తే కనుక తిరువూరు పర్యటనకు ఎంపీ హోదాలో కేశినేని చిన్ని వచ్చారు. అయితే ఆయన మీద ఫేస్ బుక్ వేదికగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తనకు ఎమ్మెల్యే టికెట్ కోసం అయిదు కోట్ల రూపాయలను కేశినేని చిన్ని డిమాండ్ చేశారని తాను మూడు విడతలుగా తన బ్యాంక్ ఖాతా నుంచి అరవై లక్షలు పంపించాను అని తన మిత్రుల ద్వారా మరో మూడున్నర కోట్లు ఇచ్చాను అని చెప్పారు. ఎంపీ మీద ఈ విధంగా తీవ్ర స్థాయిలోనే కొలికపూడి విమర్శలు చేయడం చర్చనీయాంశం అయింది. అంతే కాదు జగన్ మీద పోరాటం చేసి తాను రాజకీయంగా ఎదిగాను అని చెప్పుకున్నారు.
చిన్ని కౌంటర్ :
ఇక ఎంపీ హోదాలో చిన్ని కూడా ఎమ్మెల్యే కొలికపూడి కామెంట్స్ ని ఖండించారు. తనను ఒకనాడు మంచిగా చెప్పిన ఎమ్మెల్యే ఈ విమర్శలు చేయడమేంటి అన్నారు. ఆయనే వాటికి జవాబు చెప్పాలని అన్నారు. తాను ఎవరికైనా తన సొంత నిధుల నుంచి సాయం చేస్తాను తప్ప ఒకరి నుంచి రూపాయి తీసుకునేది లేదని అన్నారు. అయితే అన్ని ఆధారాలతో శుక్రవారం మరోసారి ఫేస్ బుక్ వేదికగా తాను చెప్పాల్సిన విషయాలు చెబుతాను కొలికపూడి ట్విస్ట్ ఇవ్వడం విశేషం. దీంతో ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. దాంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు అని అంటున్నారు. ఆయన వచ్చాక ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో వారితో చర్చించిన మీదట ఏ రకమైన ఆదేశాలు ఇస్తారో అన్నది చర్చగా ఉంది.