40 వర్సెస్ 50 పర్సెంట్ పాలిటిక్స్: ఎవరి స్ట్రాటజీ వారిదే.. !
రాజకీయాల్లో ఎవరికి వ్యూహాలు వారికి వుంటాయి. అలానే.. ఎవరి ఎత్తులు వారివి. ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతోంది.;
రాజకీయాల్లో ఎవరికి వ్యూహాలు వారికి వుంటాయి. అలానే.. ఎవరి ఎత్తులు వారివి. ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతోంది. గత ఎన్నికల్లో 40 శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకున్న వైసీపీని ఆ 40 శాతానికి దూరం చేయాలన్నది కూటమి పార్టీలైన టీడీపీ-జనసేన వ్యూహం. కానీ.. 50 శాతం తెచ్చుకున్న కూటమి నుంచి కనీసంలో కనీసం 20 శాతం అయినా.. దూరం చేస్తే చాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పోరాటంలో ఎవరిది పైచేయి.. ఎవరిది కింది చేయి .. అనేది ఇప్పుడే చెప్పలేం.
కానీ, ఎవరికి వారికి వ్యూహాలు అయితే ఉన్నాయి. దీనిలో ప్రధానంగా రెండు వ్యూహాలతో కూటమి ముందుకు సాగుతుంటే.. ఏకపక్షంగా వైసీపీ అడుగులు వేస్తోంది. పెట్టుబడులు.. సంక్షేమంతో కూటమి నేతలు ముందుకు వెళ్తున్నారు. దీంతో కూటమి నాయకులు పెట్టుబడులపైనేకాకుండా.. ప్రజలకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలపైనా దృష్టి పెట్టారు. దీనిని ప్రచారం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగమే.. తాజాగా జనసేన కూడా ప్రజల మధ్యకు వచ్చేందుకు రెడీ అయింది.
ఇక, పెట్టుబడుల కల్పన విషయంలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా.. ఎవరికి వారు పెట్టుబడులను హైలెట్ చేస్తున్నారు. తద్వారా.. వైసీపీకి పడిన 40 శాతంలో 10 శాతం అయినా.. తమవైపు తిప్పుకోవాలన్నది వారి ఆలోచన. ఇదే జరిగితే.. వచ్చే ఎన్నికల నాటికి జగన్‌ను మరింత డైల్యూట్ చేసి.. వరుసగా విజయం దక్కించుకునేందుకు అడుగులు వేయచ్చని భావిస్తున్నారు.
మరోవైపు, వైసీపీమాత్రం.. కూటమి వ్యతిరేకతను నమ్ముకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందన్నది పార్టీ చేసే ప్రచారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి జరుగుతున్న పరిణామాలను అనుకూలంగా మార్చుకోవడంలో వైసీపీ విఫలమైందన్న వాదన ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రజల మధ్యకు రాకపోతే.. పరిణామాలు మారే అవకాశం లేదని కూడా అంటున్నారు. అయితే.. ఎన్నికలకు ముందు వరకు వెయిటింగేనని జగన్ సంకేతాలు ఇస్తున్నారు. మొత్తంగా 10-20 శాతం ఓటు బ్యాంకు చుట్టూనే కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయాలు సాగనున్నాయన్నది స్పష్టంగా తెలుస్తోంది.