అంగ‌ట్లో అన్నీ ఉన్నా.. 'సీమ నేత‌ల‌కు' శాపం.. !

రాయ‌ల‌సీమ‌లో కూట‌మి పార్టీలకు జోష్ క‌నిపిస్తోంది. నాయ‌కుల మ‌ధ్య చిన్న పాటి తేడాల‌ను స‌రిచేసు కుంటే.. ఇక తిరుగులేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

Update: 2026-06-07 17:30 GMT

రాయ‌ల‌సీమ‌లో కూట‌మి పార్టీలకు జోష్ క‌నిపిస్తోంది. నాయ‌కుల మ‌ధ్య చిన్న పాటి తేడాల‌ను స‌రిచేసు కుంటే.. ఇక తిరుగులేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. కానీ, ఈ చిన్న తేడానే పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. ప్ర‌స్తుత బ‌లాబ‌లాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ పెద్ద‌గా దూకుడు చూపించ‌డం లేదు. దీనికితోడు నాయ‌కులు కూడా ఆత్మ‌న్యూన‌తా భావంలోనే ఉన్నారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో పెద్ద ఎత్తున కూట‌మి పార్టీలు ఇక్క‌డ పుంజుకున్నాయి.

రైల్వే కోడూరు, తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన విజ‌యం ద‌క్కించుకుంది. మిగిలిన ప్రాంతాల్లో టీడీపీ విజృంభించింది. అలాగే.. బీజేపీ కూడా ధ‌ర్మవరం, జ‌మ్మ‌ల‌మ‌డుగు వంటి కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌త్తాచాటింది. సో.. మొత్తంగా సీమ‌లో క‌డప నుంచి చిత్తూరు వ‌ర‌కు కూడా కూట‌మి నాయ‌కులు పుంజుకు నేందుకు భారీ అవ‌కాశం ఉంది. దీనికితోడు ప్ర‌భుత్వం కూడా.. సీమ‌పై పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. ఇప్ప‌టికే ఎంవోయూ చేసుకున్న ప్రతి కంపెనీతో సమీక్ష నిర్వహించి, పెట్టుబడులు గ్రౌండింగ్‌ అయ్యే వరకు నిరంతరం కృషి చేస్తున్నారు.

కడపలోని కొప్పర్తి పారిశ్రామికవాడకు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. జిల్లాలో పదివేల కోట్లతో ఏర్పాటుకు పరిశ్రమలతో ఒప్పందాలు జరిగాయి. రాబోయే రోజుల్లో 20 వేల కోట్ల‌ నుంచి 30 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌తో పరిశ్రమలు వస్తున్నాయి. ఇక‌, నీటి పారుద‌ల విష‌యంలోనూ దశాబ్దాలుగా కరువు, వలసలతో వెనుకబడిన రాయలసీమను మార్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. సీమను దేశ హరిత రాజధానిగా తీర్చిదిద్దుతున్నారు. అంటే రాజ‌కీయంగా.. పెట్టుబ‌డుల ప‌రంగా సీమ‌కు మంచి ప్రాధాన్యం ఏర్ప‌డింది.

మ‌రి లోటేంటి.. ?

అయితే.. అంగ‌ట్లో అన్నీ ఉన్నా.. సీమ జిల్లాల్లోని కూట‌మి నాయ‌కుల మ‌ధ్య క‌లివిడి లేక‌పోవ‌డం పెద్ద శాపంగా మారింది. ఒక్క‌రంటే ఒక్క‌రికి ప‌డ‌డం లేదు. పార్టీల్లో నాయ‌కుల ఆధిప‌త్యాలు.. పంతాలు పౌరుషాలు వంటివి నాయ‌కుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌తో సీమ‌లో ప‌ట్టు బిగించేందుకు.. చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా ఫ‌లించ‌డంలేద‌ని చెబుతున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా నాయ‌కులు క‌లివిడిని పెంచుకుంటారా? క‌ల‌సి ప‌నిచేయ‌డం ప్రారంభిస్తారా? అనేది చూడాలి. ఇదే జ‌రిగితే.. వైసీపీకి ఇక‌, దాదాపు నూక‌లుచెల్లిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News