టీడీపీ-జనసేన: మచ్చలు - మరకలు.. !
కూటమిలోని టిడిపి- జనసేన పార్టీలకు మచ్చలు మరకలు పడుతూనే ఉన్నాయి.;
కూటమిలోని టిడిపి- జనసేన పార్టీలకు మచ్చలు మరకలు పడుతూనే ఉన్నాయి. పైస్థాయిలో రెండు పార్టీల నాయకులు కలిసి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వివాదాలు విమర్శలు వస్తూనే ఉన్నాయి. నాయకుల మధ్య కీచులాటలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక భాగం అయితే.. అదే సమయంలో ముఖ్య నాయకులుగా భావిస్తున్న వారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కొందరు వ్యవహరిస్తున్న తీరు వారిపై వస్తున్న ఆరోపణలు రెండు పార్టీలను తీవ్రస్థాయిలో కుదిపేస్తున్నాయి.
ఇటీవల వెలుగు చూసిన జయచంద్రారెడ్డి రెడ్డి వ్యవహారం టిడిపిని తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేసింది. నకిలీ మద్యం కుంభకోణంలో జయ చంద్రారెడ్డి పాత్ర ఉందన్నది ఎక్సైజ్ అధికారులు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు హుటాహుటిన చర్యలు తీసుకుని ఆయన పై వేటు వేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇది రాజకీయంగా టిడిపిని ఇబ్బంది పెట్టింది. ఇక గతంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా వివాదానికి కారణమయ్యారు. సొంత పార్టీకి చెందిన ఒక మహిళా నాయకురాలిపై లైంగిక వేధింపుల కేసు ఆయనపై నమోదయింది.
ఇది కూడా తీవ్రస్థాయిలో పార్టీని గత ఏడాది కుదిపేయగా ఇప్పుడు జయ చంద్రారెడ్డి వ్యవహారం ఇబ్బందికరంగా మారింది. వీటితో పాటుగా చిన్న చిన్న విమర్శలు, వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఇంకా పార్టీలో రచ్చగానే ఉంది. ఇటీవల కూడా ఆయన అధికారులపై దూషణలకు దిగారని చంద్రబాబు వరకు వచ్చిన ఫిర్యాదు. ఇక, రాజానగరం తో పాటు ఇతర నియోజకవర్గాల్లోనూ పార్టీ అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక జనసేన విషయానికి వస్తే శ్రీకాళహస్తి వ్యవహారం మరింత తీవ్రస్థాయిలో పార్టీలో చర్చగా మారింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలోని జనసేనపై మరోసారి ఆమె విరుచుకుపడ్డారు. శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వాహక బోర్డు చైర్మన్ పదవిని తాను ఆశించానని, కానీ ముందు ఇస్తానని చెప్పి తర్వాత తనకు కాకుండా వేరే వారికి ఇచ్చారని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేతకు మహిళలు అంటే గౌరవం లేదన్నారు.
మరోవైపు, తిరుపతి జనసేన ముఖ్య నాయకుడు కిరణ్ రాయల్ పై కూడా ఇదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పార్టీలో పదవులు ఇప్పిస్తానని చెప్పి ఒక మహిళను మోసం చేశారు అన్నది ఆయనపై ఉన్న ప్రధాన అభియోగం. ఈ క్రమంలోనే కొన్నాళ్లపాటు ఆయన పార్టీకి దూరంగా పెట్టారు. మళ్ళీ తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. కానీ, ఇప్పుడు తాజాగా ఆయనపై మరిన్ని కేసులు నమోదైనట్టు తెలిసింది. కానీ, పార్టీ మాత్రం సైలెంట్ గా ఉంది. కిరణ్ రాయల్ ప్రస్తుతం హైదరాబాదుకు షిఫ్ట్ అయ్యారని సమాచారం.
ఎమ్మెల్యే లోకం మాధవి భర్త చేసిన వ్యాఖ్యలు మీడియా వర్గాలకు తీవ్రసెగను పంచాయి. మీడియా తాటతీస్తానంటు ఆయన చేసిన విమర్శలు జనసేన పార్టీ అధినేతకు ఫిర్యాదుల రూపంలోనూ వెళ్లాయి. ఇలా రెండు పార్టీల్లోనూ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఒకరోజుతో పోతుంది ఒక వారంతో పోతుంది అనుకుంటే ఫర్వాలేదు. కానీ, ఇవి నిరంతరం కొనసాగుతూ.. సీరియల్ రూపంలో పార్టీలను వివాదాలకు గురి చేయటం, పార్టీలను ఇబ్బందులు పెట్టడం గమనార్హం. మరి ఇలాంటి వాటికి ఎప్పుడు చెక్ పెడతారో చూడాలి.