టీడీపీలో విచిత్ర పరిస్థితి... సైలెంటుగా ఫైర్ బ్రాండ్స్.. కొత్తవారితోనే టెన్షన్!

నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఎరుగని రీతిలో పార్టీని సొంత నేతలు ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారన్న ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది.;

Update: 2025-10-25 13:30 GMT

ఏపీలో అధికార టీడీపీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఎరుగని రీతిలో పార్టీని సొంత నేతలు ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారన్న ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పే టీడీపీలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని అంటున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన వారితోనే చిక్కులు వస్తున్నాయని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు తాజా వివాదాలు ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.

డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు చాలాకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయనకు ఉన్న పత్యక్ష రాజకీయ అనుభవం చాలా తక్కువ. అదేవిధంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి కూడా రాజధాని అమరావతి ఉద్యమ నేపథ్యం రాజకీయాల్లోకి వచ్చిన వారు. అయితే ఈ ఇద్దరూ టీడీపీ నుంచి తొలిసారిగా గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ ఇద్దరినీ ఒకే గాటన కట్టాల్సిన పరిస్థితి లేకపోయినప్పటికీ తరచూ వివాదాలతో అధిష్టానానికి తలనొప్పి తేవడంలో ఇద్దరూ ఇద్దరే అంటున్నారు. ఈ విషయంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడికి వందకు రెండొందలు శాతం సమస్యగా మారారని టాక్ వినిపిస్తోంది.

నాలుగు దశాబ్దాల టీడీపీ చరిత్రలో వివాదాలు, విమర్శలు కొత్తకాకపోయినప్పటికీ, ప్రస్తుతం కొలికపూడితోపాటు మరికొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు కొత్తగా ఉందంటున్నారు. పార్టీలో అంతర్గత సమస్యలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం, అధిష్టానానికి మాటమాత్రం చెప్పకుండా చికాకులు తేవడం టీడీపీలో పెను దుమారంగానే చెబుతున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు చేతుల్లోకి టీడీపీ వెళ్లిన తర్వాత ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావడం బహు అరుదుగా వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి టీడీపీలో కొందరు ఫైర్ బ్రాండ్ లీడర్స్ ఉన్నారు. వారు ఎప్పుడు ఏ సమస్య తెస్తారా? అంటూ చంద్రబాబు భయపడే వారు. అయితే వారు పార్టీ నేతలకన్నా, ఇతరులతోనే వివాదాలు పెట్టుకునేవారు. కానీ, ఇప్పుడు కొలికపూడి పార్టీ నేతలతో తగాదాలకు దిగుతుండగా, డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రఘురామరాజు కూటమికి వెన్నుదన్నుగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై పరోక్ష విమర్శలు చేయడం రాజకీయ రచ్చగా మారే ప్రమాదంగా మారుతుందని టీడీపీ సీనియర్లు భయపడుతున్నారు.

వాస్తవానికి టీడీపీలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను ఫైర్ బ్రాండ్స్ గా చెబుతుంటారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరితో ఎలాంటి సమస్య రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నియంత్రిస్తున్నారు. ఆ ఇద్దరు సైతం తమ సహజ సిద్ధ వ్యవహారశైలిని పక్కన పెట్టి వివాదాలకు దూరంగా ఉంటున్నారు. తమ వల్ల కూటమికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా నడుచుకుంటున్నారని అంటున్నారు. ఇదే సమయంలో పార్టీలో తొలి నుంచి కొనసాగుతూ వస్తున్న నేతలు కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కానీ, రఘురామ, కొలికపూడి వంటి నేతలు కొత్తగా వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు. ఇలాంటి వారితో ఊహించని వివాదాలు తలెత్తడమే పార్టీకి ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. అయితే రఘురామ తన వ్యవహారంతో ఇబ్బంది తలెత్తుతుందని గమనిస్తే వెంటనే సర్దుకుంటూ నష్ట నివారణకు ప్రయత్నిస్తుండగా, కొలికపూడి మాత్రం మరింత కెలుకుతూ రచ్చరచ్చ చేయడమే పార్టీ అగ్రనాయకత్వానికి ఇరకాటంలోకి నెడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితులను అధినేత చంద్రబాబు ఎలా చక్కదిద్దుతారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.

Tags:    

Similar News