అయ్యన్న కుమారుడి పార్లమెంట్ మోజు ...మరి అక్కడ ఎవరు ?

టీడీపీ పుట్టిన దగ్గర నుంచి ఆ పార్టీలోనే ఉంటూ అధికారంలో ఉన్నపుడే కాదు ప్రతిపక్షంలోనూ వెన్ను చూపని నేతగా ఉన్న వారు నమ్మిన వారిగా విశ్వసాం చూపించిన వారు చింతకాయల అయ్యన్నపాత్రుడు.

Update: 2026-05-25 04:12 GMT

టీడీపీ పుట్టిన దగ్గర నుంచి ఆ పార్టీలోనే ఉంటూ అధికారంలో ఉన్నపుడే కాదు ప్రతిపక్షంలోనూ వెన్ను చూపని నేతగా ఉన్న వారు నమ్మిన వారిగా విశ్వసాం చూపించిన వారు చింతకాయల అయ్యన్నపాత్రుడు. అయ్యన్న 1983 నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. దాదాపుగా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం ఆయనది. పార్టీలో ఎన్టీఆర్ జమానా నుంచి కూడా చంద్రబాబుతోనే ఉంటూ ఆయనకు ఎంతో విధేయుడిగా అయ్యన్న రాజకీయ జీవితం సాగుతూ వచ్చింది. అయ్యన్న 2024 ఎన్నికల్లో పోటీ చేస్తూ ఇవే చివరి ఎన్నికలు అని చెప్పేశారు. 2029 లో తాను పోటీలో ఉండను అని కూడా తరచూ ఆయన పబ్లిక్ మీటింగ్స్ లోనూ జనాలకు చెప్పేస్తున్నారు. మరి ఆయన వారసుడు ఎవరూ అంటే పెద్ద కుమారుడు విజయ్ అని అంతా అంటున్నారు. టీడీపీలో ఐ టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న విజయ్ 2029 లో నర్శీపట్నం నుంచి పోటీ చేస్తారు అన్నది దాదాపుగా ప్రచారంలో ఉన్న మాటే.

రాజ్యసభ రేసులోకి :

అయితే విజయ్ పేరు ఇపుడు రాజ్యసభ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని 24 రాజ్యసభ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ని జారీ చేస్తూ షెడ్యూల్ ని కూడా ప్రకటించింది. ఏపీలో జూన్ 20 నాటికి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ సీట్లు అన్నీ టీడీపీ కూటమికే దక్కుతాయి. ఇక ఈ నాలుగులో మూడు టీడీపీయే తీసుకుంటుంది అన్నది లేటెస్ట్ టాక్. ఒక్కటి జనసేనకు ఇస్తుందని మిగిలిన వాటిలో ప్రాంతాల వారీగా ఒకటి ఉత్తరాంధ్ర ఒకటి కోస్తా ఒకటి రాయలసీమకు ఇస్తారని ప్రచారం సాగుతోంది. అందులో ఉత్తరాంధ్ర కు సంబంధించి చింతకాయల విజయ్ పేరు గట్టిగా వినిపిస్తోంది యువ నేత బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయ్ కి ఈ సీటు ఇవ్వడం ద్వారా పార్లమెంట్ కి పంపిస్తారు అని అంటున్నారు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించిన విజయ్ కి పార్లమెంట్ లో అవకాశమిస్తే పార్టీ పరంగానూ న్యాయం జరిగినట్టు ఉంటుందని ఆయన కూడా పెద్దల సభలో బలమైన వాణిని వినిపిస్తారని అంటున్నారు.

అక్కడే ఆసక్తి అంటూ :

ఇదిలా ఉంటే విజయ్ గతంలో కూడా ఒక టీవీ చానల్ డిబేట్ లో తండ్రితో కలసి పాలు పంచుకున్నారు. ఆ సందర్భంగా ఆయన తనకు పార్లమెంట్ కి వెళ్ళాలని ఆసక్తి ఉందని చెప్పారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ నుంచి పోటీ చేయాలని విజయ్ గట్టిగానే ప్రయత్నం చేశారు. కానీ చివరి నిముషంలో పొత్తుల కారణంగా సీటు అయితే పోయింది. అయితే మరో మూడేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో నర్సీపట్నం నుంచి విజయ్ పోటీ చేస్తే అసెంబ్లీ నుంచి నెగ్గి మంత్రి కావచ్చు అన్నది కూడా ఉంది. కానీ విజయ్ పేరు రాజ్యసభకు వినిపిస్తోంది. మరి ఆయన పార్లమెంట్ కి వెళ్తే నర్శీపట్నంలో పోటీ ఎవరు చేస్తారు అన్నదే చర్చగా ఉంది.

అలాంటి చాన్స్ ఉందా :

మరో మూడేళ్ళలో విజయ్ కి నర్సీపట్నం నుంచి పోటీకి టికెట్ కూడా ఇస్తారనుకుంటే మూడేళ్ళ కాలం కోసం రాజ్యసభకు వెళ్ళడం ఎందుకు అన్నది కూడా ఉంది. ఒకవేళ అలా కాకుండా ఉంటే రాజ్యసభ మెంబర్ గానే విజయ్ ఉండాల్సి వస్తుందని అంటున్నారు. అయితే విజయ్ ఎంపీగా వెళ్తే అయ్యన్న రెండవ కుమారుడు రాజేష్ నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్నది కూడా ఉంది. ఆయన ఇప్పటికే కౌన్సిలర్ గా పనిచేసిన అనుభవం తో ఉన్నారు. నర్శీపట్నం మున్సిపాలిటీలో పట్టు సాధించి ఉన్నారు. మరి అయ్యన్న కుమారులు ఇద్దరూ ఇలా సర్దుబాటు చేసుకుంటారా అలా ఒక కుటుంబానికే అవకాశాలు అన్నీ టీడీపీ ఇస్తుందా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా విజయ్ రాజ్యసభకు వెళ్ళడం కంటే నర్సీపట్నం నుంచే పోటీ చేయాలని ఆయన అభిమానులు అనుచరులు కోరుతున్నారు. మరి అనూహ్యంగా విజయ్ ని రాజ్యసభకు ఎంపిక చేస్తారా ఏమిటి అన్నదే చూడాల్సి ఉంది.

Tags:    

Similar News