బీజేపీ జనసేనలకు పుచ్చుకున్న వాయనమా ?
అసలే శ్రావణమాసం. పైగా మంగళవారం. ప్రతీ తెలుగింటి లోగిలిలో వాయనాలు సందడి ఉంటుంది.;
అసలే శ్రావణమాసం. పైగా మంగళవారం. ప్రతీ తెలుగింటి లోగిలిలో వాయనాలు సందడి ఉంటుంది. అలా ఇచ్చుకున్న వాయనం పుచ్చుకున్న వాయినం అని సుమంగళులు వాయనాలు అందుకుంటారు. సరిగ్గా ఇదే మంచి సమయం సందర్భం అనుకున్నారేమో టీడీపీ కూటమి పెద్ద అయిన చంద్రబాబు ఏపీలో మిగిలిన 31 కార్పోరేషన్ల చైర్మన్ పదవులు మంగళవారం ప్రకటించారు. ఈ పందేరాన్ని శుభ ముహూర్తంగా ఎంచి పంచాల్సిన వారికి పంచేశారు. అయితే ఇందులో సింహ భాగం టీడీపీది అయితే కూటమిలో మిత్రులుగా ఉన్న బీజేపీ జనసేనలకు దక్కింది జింక భాగమా అని సెటైర్లు పడుతున్నాయి.
పెద్దన్న వాటాతో :
మొత్తం 31 నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తే అందులో పాతిక దాకా తెలుగుదేశం పార్టీ తీసుకుంది. తమ వారికి ఆ పదవులు కట్టబెట్టింది. ఇక మిగిలిన ఆరులో బీజేపీకి రెండంటే రెండు పోస్టులు ఇస్తే జనసేనకు మూడు దక్కాయి. ఆ ఒక్కటీ బహుజన జేఏసీకి ఇచ్చింది. ఇలా సమ న్యాయం చేసినట్లుగా టీడీపీ కూటమి పెద్దన్నగా ఆ పార్టీ భావిస్తోంది. కానీ మిత్రులకు అది సరిపోయిందా అన్నదే చర్చగా ఉంది.
వందలాది పోస్టులు అంటూ :
ఎన్నికల వేళ టీడీపీతో పొత్తు పెట్టుకున్నపుడు జనసేన బీజేపీలు తమ క్యాడర్ కి చెప్పింది ఏంటి అంటే వందలాది నామినేటెడ్ పదవులు ఉంటాయి వాటిలో ఎన్నో అవకాశాలు తమ వారికి ఇస్తామని. తీరా చూస్తే పలు దఫాలుగా నామినేటెడ్ పందేరం జరిగింది కానీ జనసేనకు టోటల్ గా పాతిక పదవులు అయినా దక్కాయా అన్నది ఒక చర్చ. ఇక బీజేపీకి మొత్తంగా పది పోస్టులు అయినా చిక్కాయా అన్నది మరో చర్చ. మొత్తానికి మిత్రులకు చిన్న భాగమే దక్కింది అన్నది క్యాడర్ చెబుతున్న అసలైన మాటగా ఉంది.
స్థానిక ఎన్నికలు అంటున్నారు :
అయితే ఇపుడు క్యాడర్ కి నచ్చచెప్పడానికి స్థానిక ఎన్నికలు ముందు ఉన్నయని అక్కడ ఎక్కువ స్థానాలు పొత్తులో తీసుకుని పోటీ చేద్దామని మిత్రులు చెబుతున్నారు. కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ప్రతీ చోటా టీడీపీ బలంగా ఉంది. బూత్ లెవెల్ వరకూ ఆ పార్టీ క్యాడర్ పాతుకుని పోయారు. వారిని కాదని పెద్ద ఎత్తున మిత్రులకు సీట్లు ఇచ్చే చాన్స్ ఉంటుందా అన్నదే ప్రధానమైన ప్రశ్న. పైగా తమ్ముళ్ళు కూడా భారీ స్థాయిలో ఈ ఎన్నికల మీద ఆశలు పెట్టుకున్నారు అని అంటున్నారు దాంతో నామినేటెడ్ పదవులు ఏ విధంగా ఏ ప్రాతిపదికన మిత్రులకు ఇచ్చారో వాటికి కాస్తా అటూ ఇటుగానే స్థానిక ఎన్నికల్లో కూడా సీట్లు దక్కవచ్చు అని అంటున్నారు.
కూటమి కోసం తప్పదా :
జనసేన అయితే మరిన్ని ఏళ్ళు ఏపీ కోసం అభివృద్ధి కోసం కూటమి కొనసాగాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇక బీజేపీకి కేంద్రంలో అధికారం ముఖ్యం. పైగా బలమైన మిత్రుడిగా టీడీపీ ఉంది. అందువల్ల టీడీపీ విషయంలో వేరేగా ఆలోచించే సీన్ కలలో కూడా ఉండదని అంటున్నారు. ఈ నామినేటెడ్ పదవులు లోకల్ బాడీ ఎన్నికల పదవులు అన్నవి బీజేపీ జాతీయ స్థాయి ఆలోచనల ముందు చాలా చిన్నవి అందువల్ల ఎన్ని ఇస్తే అన్ని తీసుకోవడమే కమలానికి ఏపీ వరకూ అనివార్యంగా ఉంటుంది. సో ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం మాదిరిగా మిత్రులు తీసుకోవాల్సినవి తీసుకోవడమే అని అంటున్నారు. సో క్యాడర్ కి ఎలా నచ్చచెప్పుకుంటారు అన్నదే ఆయా పార్టీల అధినాయకత్వాల మీద ఉన్న బాధ్యత. అదే అసలైన సవాల్ కూడా. చూడాలి మరి ఏమి జరుగుతుందో.