తంబళ్లపల్లిలో తమ్ముళ్ల కొట్లాట.. ఏం జరుగుతోంది ..!
మరోవైపు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తన ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.;
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గంలో టిడిపి నాయకుల మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికలకు ముందు తర్వాత కూడా ఈ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయని సీనియర్ నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతానికి తంబళ్లపల్లి నియోజకవర్గంలో వైసిపి విజయం దక్కించుకుంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికైనా టిడిపిని బలోపేతం చేయాలని వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ విజయం సాధించాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. గత రెండు నెలల కిందట జరిపిన చిత్తూరు పర్యటనలో నాయకులకు నిర్దేశం చేశారు.
అప్పట్లో అందరూ సరైనని తలలు ఊపారు. కానీ, ఆ తర్వాత పరిణామాలు గమనిస్తే నాయకుల్లో మార్పు అయితే కనిపించలేదని స్పష్టంగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, ప్రస్తుతం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి జయ చంద్రారెడ్డి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పాటు పార్టీకి నష్టం కలిగించే విధంగా వీరు వ్యవహరిస్తుండడంతో సీనియర్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఏదైనా చెప్పినా పార్టీ అధినేత తో మేము మాట్లాడుతామంటూ జయ చంద్రా రెడ్డి వర్గీయులు చెబుతున్నారు.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తన ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. గత రెండు నెలల కిందట కూడా ఇరుపాక్షాల మధ్య తీవ్ర వివాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో సీఎం చంద్రబాబు పరోక్షంగా వారిని హెచ్చరించారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తున్నారా తన్నుకుంటున్నారా అంటూ తీవ్రంగానే ప్రశ్నించారు. అయినా వారిలో మార్పు రాకపోగా మరింత వివాదాల దిశగా తమ్ముళ్లు పరుగులు పెడుతున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీలపై జయ చంద్రారెడ్డి వర్గీయులు దాడి చేశారు.
దీంతో నియోజకవర్గంలో టిడిపి రాజకీయాలు చాలా వేడెక్కాయి. ఒకరికి- ఒకరికి పడకపోవడం, ఒకరిపై ఒకరు వివాదాలు వచ్చేలా వ్యవహరించడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం అధినేత ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడంతో సీనియర్ నాయకులు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అన్ని సర్దుకుంటాయని త్వరలోనే చిత్తూరులో పర్యటిస్తానని ఇటీవల చంద్రబాబు సీనియర్ నాయకులకు సమాచారం అందించారు. కానీ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు మరింత చేజారే అవకాశం ఉందన్నది సీనియర్ నాయకులు చెబుతున్న మాట.
మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు చెబుతున్నప్పటికీ అటు శంకర్ యాదవ్ వర్గం కానీ ఇటు జయ చంద్రా రెడ్డి వర్గం కానీ కనీసం పట్టించుకోకుండా వ్యవహరించడం మరింత వివాదంగా మారుతోంది. విభేదాలు ఉండొచ్చు లేదా వ్యక్తిగత రాజకీయ కక్షలు ఉండొచ్చు కానీ పార్టీ పరంగా వారు ఈ విధంగా వ్యవహరించడంతో ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్టు అవుతోందన్నది సీనియర్ నాయకులు చెబుతున్న మాట. ఇప్పటికైనా నాయకుల పనితీరు మారాలని పార్టీకి ప్రయోజనం కరంగా ఉండే విధంగా వ్యవహరించాలని సీనియర్లు సూచిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.