ఫ్రీ బ‌స్సు ఎఫెక్ట్‌: ఫ‌స్ట్ కేసు న‌మోదు!

ఏపీలో మ‌హిళ‌ల‌కు ప్ర‌భుత్వం `స్త్రీ శ‌క్తి` పేరుతో ఉచిత బ‌స్సు సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2025-08-22 05:58 GMT

ఏపీలో మ‌హిళ‌ల‌కు ప్ర‌భుత్వం 'స్త్రీ శ‌క్తి' పేరుతో ఉచిత బ‌స్సు సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 15 సాయంత్రం ఈ సేవ‌ల‌ను సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా ప్రారంభించారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి వివాదాలు, ఘ‌ర్ష‌ణ‌లు లేకుండానే సాగిపోయిన ఈ వ్య‌వ‌హారంలో ఫ‌స్ట్ టైమ్ ఏకంగా పోలీసుల కేసు వ‌ర‌కు వివాదం వెళ్లింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసిన ఎఫ్ ఐఆర్ కూడా క‌ట్టారు. ఈ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం చ‌ర్చ‌కు దారితీసింది.

ఏం జ‌రిగింది?

ఉచిత బ‌స్సు ద్వారా విజ‌య‌వాడ నుంచి జ‌గ్గ‌య్యపేట‌కు వెళ్లే బ‌స్సులో మ‌హిళ‌లు కిక్కిరిసిపోయారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు మ‌హిళ‌ల మ‌ధ్య సీటు కోసం వివాదం రేగింది. ఈ వివాదం ఏకంగా ఒక‌రిపై ఒక‌రు భౌతికం గా దాడులు చేసుకునే వ‌ర‌కు చేరింది. ఒక మ‌హిళ‌పై మ‌రో మ‌హిళ చెల‌రేగి మ‌రీ బ‌స్సులోనే త‌న్నుకున్నా రు. ఈ విష‌యంలో కండెక్ట‌ర్ జోక్యం చేసుకుని స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేసినా, తోటి ప్ర‌యాణికులు జోక్యం చేసుకుని స‌ర్దిచెప్పే ప్ర‌యత్నం చేసినా.. ఫ‌లించ‌లేదు.

దీంతో డ్రైవ‌ర్ బ‌స్సును నేరుగా పోలీసు స్టేష‌న్‌కు తీసుకువెళ్లారు. దీంతో జ‌గ్గ‌య్య పేట పోలీసులు.. ఇరువు రు మ‌హిళ‌ల‌పై కేసు న‌మోదు చేశారు. అయితే.. ఈ ఘ‌ట‌న ఈ నెల 20న జ‌రిగ్గా తాజాగా దీనిని పోలీసులు మీడియాకు విడుద‌ల చేశారు. విజ‌య‌వాడ నుంచి జ‌గ్గ‌య్య పేట‌కు ప్ర‌యాణిస్తున్న మేఘావ‌తు ఉషారాణి, బండారు ఆదిల‌క్ష్మిలు.. సీటు కోసం గొడ‌వ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో ఒక‌రిపై ఒక‌రు భౌతిక దాడికి దిగారు. ఉషారాణి తీవ్రంగా గాయ‌ప‌డ‌డంతో స్థానిక ఆసుప‌త్రిలో చికిత్స చేయించారు.

అయితే.. ఇద్ద‌రిపైనా పోలీసులు కేసు పెట్టారు. బీఎన్ ఎస్ సెక్ష‌న్ 3, 126(2)- బ‌హిరంగ ప్ర‌దేశాల్లో అనుచితంగా ప్ర‌వ‌ర్తించ‌డం, 115(2) ప్ర‌భుత్వ ఆస్తుల‌కు న‌ష్టం క‌లిగించ‌డం, 351(2) ప‌బ్లిక్ న్యూసెన్స్ సెక్ష‌న్ల కింద కేసులు పెట్టారు. ఈ కేసుల్లో 5 వేల నుంచి 10 వేల వ‌ర‌కు జ‌రిమానా.. లేదా, 3 నెల‌ల జైలు, లేదా.. రెండు క‌లిపి విధించే అవ‌కాశం ఉంటుంద‌ని పోలీసులు చెబుతున్నారు. కాగా.. తెలంగాణ‌లోనూ ఉచిత బ‌స్సు ఉన్నా.. గొడ‌వ‌లు జ‌రిగినా.. పోలీసుల వ‌ర‌కు ఏదీ వెళ్ల‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News