కారుమూరిని తిట్టేందుకు ఇన్ని బూతులు వాడాలా వర్మగారు?

ఒకరు తప్పు చేశారని వేలెత్తి చూపే వేళ.. మాటలు అనే వారు అదే తప్పు చేయకుండా ఉండాలి.;

Update: 2025-04-14 05:42 GMT

ఒకరు తప్పు చేశారని వేలెత్తి చూపే వేళ.. మాటలు అనే వారు అదే తప్పు చేయకుండా ఉండాలి. నువ్వు ఒకటంటే నేను రెండు అంటా? అంటూ విరుచుకుపడటంలో అర్థం లేదు. నేతల మాటల మీద విమర్శలు పెరుగుతూ.. గౌరవప్రద రాజకీయాల దిశగా ఏపీలో అడుగులు పడాలని ఆశించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వేళ.. కొందరు నేతలు ఇష్టారాజ్యంగా విర్రవీగుతున్న వేళ.. వారిని సంస్కారవంతమైన భాషలో కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా నోటికి వచ్చినట్లుగా తిట్టే నేతను.. అంతకు రెట్టింపు స్థాయిలో తిట్టేయటంలో అర్థం లేదు.

తాజాగా అలాంటి పనే చేసి అందరిని విస్మయానికి గురి చేస్తున్నారు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ. పెద్ద మనిషిగా ఉన్న ఆయన నోటి నుంచి తాజాగా వచ్చిన మాటల్ని తప్పు పడుతున్నారు. మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుపై మాటల దాడి చేశారు. మాజీ మంత్రి కారుమూరి మాటలు ఎలా ఉంటాయో తెలిసిందే. ఆయన్ను తప్పు పట్టే క్రమంలో.. వర్మ సైతం అలాంటి భాషను ఎంచుకోవటంలో అర్థం లేదు.

తాజాగా పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలో ఆదివారం పలు డెవలప్ మెంట్ పనుల్లో పాల్గొన్న ఆయన కారుమూరి నాగేశ్వరరావుపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘‘ఎర్రిపప్ప కారుమూరి తణుకు మున్సిపాలిటీలో వందల కోట్లు టీడీఆర్ నిధులు స్కామ్ చేశాడు. ఈ పిచ్చి నా.. కొ.. త్వరలో జైలుకు వెళ్లి చిప్ప కూడా తింటాడు’ అని ఒక సందర్భంలో మరో సందర్భంలో.. ‘ఎర్రిపప్పకారుమూరి.. నీ నాలుక కోసేస్తాం. కాళ్లు చేతులు నరికే్సతాం. అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చో’ అంటూ ఇష్టారాజ్యంగా చేసిన వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నారు.

కారుమూరితో పాటు వైసీపీ సీనియర్ నేతలు కొడాలి నాని.. పేర్ని నాని.. అనిల్ కుమార్ యాదవ్.. అంబటి రాంబాబు.. సిదిరి అప్పలరాజు పైనా విరుచుకుపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉండి.. ఈ తరహా భాషను ఉపయోగించటాన్ని తప్పు పడుతున్నారు. ఎదుటోళ్ల తీరును తప్పు పట్టే వేళలో.. వర్మ తన భాష గురించి జాగ్రత్తలు తీసుకోవాలి కదా? అలాంటివి మర్చిపోయినప్పుడు కూటమి పెద్దలైనా నోరు అదుపులో ఉంచుకోవాలని చెప్పలి కదా?

Tags:    

Similar News