శ్రీదేవి పోటీ అక్కడి నుంచేనట!

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కేఎస్‌ జవహర్‌ను కొవ్వూరు నుంచే పోటీ చేయించి తిరువూరులో ఉండవల్లి శ్రీదేవిని పోటీ చేయించవచ్చని ప్రచారం జరుగుతోంది.

Update: 2023-08-19 02:30 GMT

గుంటూరు జిల్లా తాడికొండ నుంచి వైసీపీ తరఫున ఉండవల్లి శ్రీదేవి 2019లో తొలిసారి గెలిచారు. అయితే ఆ తర్వాత కొద్ది కాలానికే సొంత పార్టీ నేతలే ఆమెపై అసమ్మతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా శ్రీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్న తాడికొండ సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ను వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ నిర్ణయంపై అప్పట్లో ఉండవల్లి శ్రీదేవి భగ్గుమన్నారు. రాష్ట్రం మొత్తం మీద తన ఒక్క నియోజకవర్గంలోనే అదనపు సమన్వయకర్త పేరిట ఇంకో వ్యక్తిని నియమించడం ఏమిటని నిలదీశారు. ఈ పరిణామాల తర్వాత జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి టీడీపీ అభ్యర్థికి ఓటేశారని వైసీపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

వైసీపీ తనను బహిష్కరించాక రాజధాని అమరావతి ప్రాంతం నెలవై ఉన్న తన తాడికొండ నియోజకవర్గంలో శ్రీదేవి అసలు పర్యటించలేదు. ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితం నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర తాడికొండలో జరిగిన సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి అందులో పాల్గొన్నారు. అమరావతి రైతులకు క్షమాపణ కూడా చెప్పారు. తాను టీడీపీలో చేరుతున్నానని తెలిపారు.

అయితే ఉండవల్లి శ్రీదేవికి వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి అవకాశం ఉండదని తెలుస్తోంది. తాడికొండలో ఆమెకు అనుకూల పరిస్థితులు లేవని టీడీపీ సర్వేల్లో తేలిందని అంటున్నారు. అందువల్ల శ్రీదేవిని ఎన్టీఆర్‌ జిల్లాలోని తిరువూరు నుంచి పోటీ చేయించవచ్చని తెలుస్తోంది. తాడికొండలో టీడీపీ తరఫున ప్రస్తుత ఇంచార్జి తెనాలి శ్రావణ్‌ కుమార్‌ పోటీ చేస్తారని టాక్‌ వినిపిస్తోంది.

Read more!

తనకు తాడికొండ సీటు ఇస్తే భారీగా ఖర్చు పెడతానని శ్రీదేవి టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పారని తెలుస్తోంది. అయితే ఆమెపై నియోజకవర్గంలో భారీ వ్యతిరేకత ఉండటం, ఓడిపోతే రాజధాని ప్రాంతంలో టీడీపీ అభ్యర్థి ఓడిపోయారని.. అమరావతి రాజధానికి ప్రజలు అనుకూలంగా లేరని వైసీపీ ప్రచారం చేసే ప్రమాదం ఉండటంతో శ్రీదేవికి తాడికొండ నుంచి పోటీ చేయడానికి సీటు నిరాకరించినట్టు తెలుస్తోంది.

మధ్యేమార్గంగా ఆమెను తిరువూరు నుంచి పోటీ చేయించాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. తిరువూరు నుంచి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణనిధి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది.

గత ఎన్నికల్లో తిరువూరు నుంచి టీడీపీ తరఫున అప్పటి మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన కేఎస్‌ జవహర్‌ పోటీ చేశారు. 2009, 2014 ఎన్నికల్లో తిరువూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నల్లగట్ల స్వామిదాసు ఇక్కడి నుంచి పరాజయం పాలయ్యారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కేఎస్‌ జవహర్‌ను కొవ్వూరు నుంచే పోటీ చేయించి తిరువూరులో ఉండవల్లి శ్రీదేవిని పోటీ చేయించవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల చంద్రబాబు తిరువూరులో పర్యటించినప్పుడు శ్యావల దేవదత్‌ ను తిరువూరు టీడీపీ ఇంచార్జిగా ప్రకటించారు. దీంతో ఆయన తానే అభ్యర్థినని పనిచేసుకుంటున్నారు. మరి నియోజకవర్గానికి స్థానికురాలు కాని ఉండవల్లి శ్రీదేవి వస్తే విజయం సాధించగలరా అనేది వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News