జగన్ కి రెండంటే రెండు ప్రశ్నలు !

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాస్వామ్యం గురించి పెద్ద మాటలు మాట్లాడుతున్నారని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేస్తున్నారు.;

Update: 2025-08-14 17:51 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాస్వామ్యం గురించి పెద్ద మాటలు మాట్లాడుతున్నారని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేస్తున్నారు. జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వినడానికే అదోలా ఉందని ఆయన అన్నారు. తాను రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నాను అని అంతకంటే ఎక్కువ విమర్శలు చేస్తే బాగుండని ఆయన అంటూనే జగన్ వైఖరి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని మండిపడ్డారు.

అసెంబ్లీకి రాకుండానే :

జగన్ ప్రజాస్వామ్యం గురించి మీడియా ముందు ఎన్నో చెబుతున్నారు కానీ ఆయన అసెంబ్లీకి రావడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు. అసెంబ్లీకి ఆయన ఇచ్చే విలువ ఇదేనా అని నిలదీశారు. జగన్ అసెంబ్లీకి రాకుండా వ్యవస్థలను గౌరవించకుండా ప్రజాస్వామ్యం అని బయట చెబితే అది అసహ్యంగా ఉందని అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఆయన సభకు రావాలని అనుకుంటే రావచ్చు. ఆయనకు ప్రతిపక్షానికి ఎంత అవకాశం ఉంటుందో అంత ఇస్తామని ఆయ్యన్న మరోమారు స్పష్టం చేశారు.

సంఖ్యాబలం ఆధారంగానే :

అసెంబ్లీలో చర్చకు అయినా ప్రశ్నలు అడగడం అయినా ఏదైనా ఆయా పార్టీల సంఖ్యాబలం ఆధారంగానే అవకాశాలు ఉంటాయని స్పీకర్ అయ్యన్న చెప్పుకొచ్చారు. జగన్ పార్టీకి ప్రశ్నోత్తరాల సమయంలో రెండు ప్రశ్నలకు అవకాశం ఇస్తామని ఆయన అన్నారు. మొత్తం పది ప్రశ్నలు దాకా ప్రతీ రోజూ క్వశ్చన్ హవర్ లో అడిగే వీలు ఉంటుందని అందులో వైసీపీకి రెండు ప్రశ్నలు ఇస్తామని అయ్యన్న వివరించారు. ఒక వేళ వారు కనుక సభకు రాకపోతే ఆ రెండు ప్రశ్నల సమయాన్ని మరో పార్టీకి కేటాయిస్తామని చెప్పారు. అందువల్ల జగన్ సభకు రాకుండా పూర్తిగా దూరంగానే ఉంటామని చెబితే సభ తన పద్ధతిలో చేయాల్సింది చేస్తుంది అని అయ్యన్నపాత్రుడు అన్నారు.

అయిదేళ్ళలో 78 రోజులే :

ప్రజాస్వామ్యం గురించి ఎన్నో చెబుతున్న జగన్ తాను సీఎం గా ఉన్న అయిదేళ్ళ పాలనలో కేవలం 78 రోజులు మాత్రమే సభను నడిపారు అని అయ్యన్న విమర్శించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించడం అన్నది ముఖ్యమని కానీ శాసన సభనే నడపకుండా వైసీపీ వారు ఏమి చేశారో తనకు అయితే అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. ఇక తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది కాలంలో 31 రోజుల పాటు సభను నడిపామని చెప్పారు. ఇది చాలదని ఏడాదికి అరవై రోజులు అయినా సభను నడపాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు ఈ సంగతి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియచేశామని అన్నారు.

సెప్టెంబర్ లో అసెంబ్లీ :

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 17 తరువాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని అయ్యన్నపాత్రుడు చెప్పారు. అయితే ఇది తాత్కాలికంగా ఒక డేట్ గా తాను చెబుతున్నాను అని మంత్రివర్గం సమావేశం అయి తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. మొత్తం మీద జగన్ సభకు వస్తారో రారో చెప్పాలని అయ్యన్న డిమాండ్ చేస్తున్నారు. వస్తే రెండంటే రెండు ప్రశ్నలకు అవకాశం ఇస్తామని అంటున్నారు. మరి ఇది వైసీపీకి ఏ మాత్రం సంతృప్తికరంగా ఉంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News