చాట్ జీపీటీ ఎఫెక్ట్... ఓ జంటకు ఇది మామూలు చేదు అనుభవం కాదు!

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో.. మేరీ కాల్డాస్ విమానాశ్రయంలో ఆమె ప్రియుడు అలెజాండ్రో సిడ్ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తుండగా ఏడుస్తున్నట్లు చూడవచ్చు.;

Update: 2025-08-18 06:55 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు సలహా కోసం చాట్‌ బాట్‌ లను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చాట్ జీపీటీని నమ్మి కొత్త సమస్యలు కొని తెచ్చుకున్న స్పానిష్ ఇన్‌ ఫ్లుయెన్సర్ జంట.. తమ అనుభవాలను కన్నీటితో పంచుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అవును... ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు సలహా కోసం చాట్‌ బాట్‌ లను ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఓ స్పానిష్ ఇన్‌ ఫ్లుయెన్సర్ జంట ప్రయాణ సలహా కోరిన తర్వాత తమ విమానాన్ని కోల్పోయింది. ఈ అనుభవం తర్వాత తన పరిస్థితిని వీడియో రూపంలో పంచుకుంది. ఈ సందర్భంగా... రోజువారీ పనులు, సలహాలకు ఏఐ-ఆధారిత చాట్‌ బాట్‌ లపై ఆధారపడోద్దని సలహా ఇచ్చారు.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో.. మేరీ కాల్డాస్ విమానాశ్రయంలో ఆమె ప్రియుడు అలెజాండ్రో సిడ్ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తుండగా ఏడుస్తున్నట్లు చూడవచ్చు. ఈ సమయంలో వీసా అవసరం లేదని ఏఐ తమకు చెప్పిందని, ప్యూర్టో రికోను సందర్శించడానికి ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈ.ఎస్.టీ.యే) అవసరమని హెచ్చరించడంలో విఫలమైందని ఆమె అన్నారు.

తీరా విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, ఈ.ఎస్.టీ.యే లేకుండా విమానం ఎక్కలేమని ఎయిర్‌ లైన్ సిబ్బంది వారికి చెప్పారు. ఈ సందర్భంగా ఆ జంట తమ ఆగ్రహాన్ని కన్నీటితో వ్యక్తం చేసింది.

కాగా... ఏఐ చాట్‌ బాట్‌ లను ఉపయోగించడం వల్ల దెబ్బ తినడం, తీవ్ర ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఇదే మొదటిసారి కాదు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ జర్నల్స్‌ లో ప్రచురితమైన ఒక కేసు నివేదిక ప్రకారం.. టేబుల్ సాల్ట్ ప్రతికూల ఆరోగ్య ప్రభావాల గురించి చదివిన తర్వాత, తన ఆహారం నుండి ఉప్పును ఎలా తొలగించాలో చాట్ జీపీటీని అడిగిన తర్వాత 60 ఏళ్ల వ్యక్తి ఆసుపత్రి పాలయ్యాడు.

ఇందులో భాగంగా... అతను చాట్ జీపీటీని సంప్రదించిన తర్వాత సోడియం క్లోరైడ్‌ (ఉప్పు) ను సోడియం బ్రోమైడ్‌ తో భర్తీ చేశాడు. వాస్తవానికి ఇది 1900ల ప్రారంభంలో మందులలో సాధారణంగా ఉపయోగించే పదార్థం కాగా.. ఇప్పుడు పెద్ద పరిమాణంలో విషపూరితమైనదిగా గుర్తించబడిందని నివేదిక తెలిపింది. సో... బీ కేర్ ఫుల్ విత్ దిస్ అన్నమాట!

Tags:    

Similar News