సౌత్ ఫేస్ విజయ్ : మార్చింది అధికారం మాత్రమే కాదు !
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా వెండితెర దళపతి పదవీ బాధ్యతలు స్వీకరించి ఈ నెల 17 కి వారం పూర్తి అవుతుంది.
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా వెండితెర దళపతి పదవీ బాధ్యతలు స్వీకరించి ఈ నెల 17 కి వారం పూర్తి అవుతుంది. ఈ వారం రోజులలోనే తనదైన మార్క్ ని విజయ్ పాలనలో చూపించాలని చూస్తున్నారు. సింప్లిసిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టేట్మెంట్స్ లేవు, మీడియా ముందు మీటింగులు లేవు, అసలు పెద్దగా శబ్దం చేయకుండా మౌనమే తన భాషగా విజయ్ పనిచేసుకుని పోతున్నారు. ఇదిలా ఉంటే విజయ్ చుట్టూ ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన కేవలం తమిళనాడుకే పరిమితం కారని సౌత్ ఫేస్ గా ఆయన ఉంటారని అంటున్నారు. ఆయన తమిళనాడులో గెలిచింది కేవలం ఒక ఎన్నిక కాదని ఆయన మార్చింది అధికారం కాదని ఏకంగా రాజకీయమే అని అంటున్నారు. అది దేశ రాజకీయ మూలాలనే తొందరలో ప్రశ్నించే తీరుగా సాగుతుందని కూడా అంటున్నారు.
రెండే శిబిరాలుగా చీలి :
ఈ దేశం గత మూడున్నర దశాబ్దాలుగా లెఫ్ట్ అండ్ రైట్ వింగ్ పాలిటిక్స్ గా సాగుతోంది. ఆ విధంగా ఒక స్పష్టమైన విభజనని తీసుకుని రావడంతో బీజేపీ విజయం సాధించింది. 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేత దాని కంటే ముందు అయోధ్య రధ యాత్ర అద్వానీ చేపట్టడం వంటివి దేశ రాజకీయ సామాజిక సిద్ధాంతపరమైన వాతావరణంలో తీవ్రమైన మార్పులను తీసుకుని వచ్చాయి. హిందూత్వ అన్నది ఒక బలమైన ఫిలాసఫీగా బీజేపీ భావిస్తూ దానిని ముందుకు తెచ్చి అనేక ఎన్నికల్లో విజయాలు సాధించింది. ఈ రోజున కేంద్రంలో మూడు సార్లు బీజేపీ వరుసగా అధికారంలో ఉంది. అంతకు ముందు ఆరున్నరేళ్ళ పాటు వాజ్ పేయి కూడా బీజేపీ తరఫున ప్రధానిగా పాలించారు. దాంతో ఈ దేశంలో యాంటీ బీజేపీ శిబిరంలో ఇతర పార్టీలు ఉంటూ వచ్చాయి.
న్యూట్రల్ స్టాండ్ తో :
ఈ క్రమంలోనే హిందూత్వని అభిమానించే వారు ఆగ్రహించిన వారుగా పార్టీలు విడిపోయాయి. 1990 ముందు వరకూ న్యూట్రల్ వింగ్ ఉండేది. జనతాదళ్, లోక్ దళ్, సోషలిస్టు పార్టీలు అన్నీ ఆ కోవలోకి చెందినవే. కానీ కాలక్రమంలో అవి అటూ ఇటూ సర్దుకున్నాయి. దాంతో ఇపుడు ప్రజలు రెండే శిబిరాలను రెండే సిద్ధాంతాలను ఎంచుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. కానీ తమిళనాడు ఎన్నికలో టీవీకే కొత్త భావజాలాన్ని సృష్టించి రంగంలోకి దిగింది. హిందూత్వను విమర్శించకుండానే తన కాంపెయిన్ మొత్తం సాగించింది. అదే సమయంలో ఇతర మతాలను భుజాల మీదకు తెచ్చి వెనకేసుకుని రాలేదు. మత రహితం మా విధానం కుల రహితం మా సిద్ధాంతం అని టీవీకే చాటి చెప్పింది. అంతే కాదు రాజ్యాంగం ఏమి చెప్పిందో దానినే తాము పాటిస్తామని కూడా పేర్కొంది. కుల మత రహితమైన పాలన తమ కర్తవ్యం అని కూడా స్పష్టం చేసింది. ఆ విధంగా విజయ్ కొత్త రాజకీయ ప్రయోగమే చేశారు. ఇప్పటిదాకా దేశంలోని అనేకమైన రాజకీయ పార్టీలు కులాన్ని మతాన్ని నమ్ముకుని రాజకీయం చేసి విజయం సాధించాయి. కానీ తొలిసారి విజయ్ తన పొలిటికల్ ఫిలాసఫీ వీటికి భిన్నం అని గట్టిగా చెప్పారు. దాంతోనే తమిళనాడు ఎన్నికలు జాతీయ స్థాయిలో అతి పెద్ద చర్చకు తెర తీశాయని చెప్పాల్సి ఉంది.
తొలి అడుగు మాత్రమే :
ఇక తమిళనాడులో టీవీకే నూతన సిధ్ధాంతీకరణకు జనాల మద్దతు లభించింది. దానికి కారణం జెన్ జీ సునామీ. వారికి ఈ తరహా భావజాలం మీద నమ్మకం లేదు. వారు వీటిని ఓల్డ్ ట్రెండ్ గా చూస్తారు. దాంతో విజయ్ పార్టీని ఇట్టే ఆకట్టుకున్నారు. దేశం నిండా ఇపుడు జెన్ జీ ఫోర్స్ ఉంది. వారిని విజయ్ ఆకట్టుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. తమిళనాడులో తొలి అడుగు వేసిన విజయ్ తన సిద్ధాంత భూమిక వ్యాప్తికి తన రాజకీయ కార్యక్షేత్రాన్ని తమిళనాడు వెలుపలకు కూడా విస్తరిస్తారా అన్న చర్చ సాగుతోంది. విజయ్ ని ఇపుడు సౌత్ ఫేస్ గా జాతీయ మీడియా అభివర్ణిస్తోంది. విజయ్ ఒక్క ఎన్నికతో గెలిచి వెనక్కి వెళ్ళే నాయకుడు కాదని ఆయన కొన్ని తరాలను ప్రభావితం చేసే నేతగానే అభివర్ణిసూ జాతీయ స్థాయిలో ఫోకస్ చేస్తున్నారు. చూడాలి మరి తదుపరి విజయ్ అడుగులు ఎలా ఉండబోతున్నాయో.