తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ లేఖ.. విషయం ఏంటంటే!
సుదీర్ఘకాలం తర్వాత.. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ తాజాగా ప్రత్యేక సందేశం పంపించారు.;
సుదీర్ఘకాలం తర్వాత.. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ తాజాగా ప్రత్యేక సందేశం పంపించారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆమె లేఖ రాశారు. ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశించి సోనియా గాంధీ ఈ లేఖను రాశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
రాష్ట్రం అభివృద్ది చెందాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు సోనియాగాంధీ తెలిపారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహించే సదస్సులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో పాలు పంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. మూడంచల వ్యూహంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. పట్టణ, నగర అభివృద్దితో పాటు.. గ్రామీణప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగు పరచడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ సదస్సు ద్వారా.. రాష్ట్ర ప్రగతి, ప్రజల నైపుణ్యాలు, మానవ వనరుల శక్తి వంటివి ప్రపంచ దేశాలకు తెలుస్తాయని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. సాంకేతిక నైపుణ్యాలు, అంతర్జాతీయ ప్రతిభ వంటివి తెలంగాణ అభివృద్ధికి, ప్రజల చైతన్యానికి కూడా దోహదపడనున్నాయన్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ద్వారా.. రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిబద్ధత.. కృషి ఫలిస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. సదస్సుకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని సూచించారు. ఇది దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు.
సదస్సుకు రానట్టే!
కాగా.. తెలంగాణ రైజింగ్ సదస్సుకు రావాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధాని మోడీ సహా సోనియాగాంధీ వంటి కీలకనేతలను ఆహ్వానించారు. అయితే.. మోడీ వచ్చే అవకాశాలులేవని తెలుస్తోంది. ఇక, సోనియాగాంధీ కూడా.. వచ్చే అవకా శం తక్కువేనని.. అందుకే ఆమె లేఖ రాశారని చెబుతున్నారు. మరోవైపు.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సదస్సుకు వచ్చే అంశంపై రాహుల్ గాంధీ కూడా ఆలోచన చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. రాహుల్ వస్తారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.