ధూమపాన ప్రియులకు భారీ షాక్.. దెబ్బకు దిగి రావాల్సిందేనా?
ఐటీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో సిగరెట్ ప్రియుల బడ్జెట్ తలకిందులైంది. ఇప్పటివరకు రూ. 170 కి లభించే 10 సిగరెట్ల గోల్డ్ ఫ్లేక్ ప్యాక్ ధర ఇప్పుడు ఏకంగా రూ. 240 కి చేరింది.;
సిగరెట్ అలవాటు ఉన్నవారికి ఫిబ్రవరి నెల గట్టి షాక్‌తో మొదలైంది. కేంద్ర బడ్జెట్ 2026లో పెంచిన ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్‌టీ ప్రభావంతో ఐటీసీ సంస్థ తన ప్రముఖ బ్రాండ్ల ధరలను ఏకంగా 19% నుండి 41% వరకు పెంచింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త పన్నులు అమలులోకి రావడంతో గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ వంటి బ్రాండ్ల రేట్లు చుక్కలనంటుతున్నాయి. ధరల దెబ్బకు ధూమపాన ప్రియుల జేబులకు చిల్లు పడటం ఖాయమనిపిస్తోంది. వివరాలు చూద్దాం..
గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ రేట్లు పైపైకి.. ప్యాకెట్‌పై రూ. 70 వరకు పెంపు:
ఐటీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో సిగరెట్ ప్రియుల బడ్జెట్ తలకిందులైంది. ఇప్పటివరకు రూ. 170 కి లభించే 10 సిగరెట్ల గోల్డ్ ఫ్లేక్ ప్యాక్ ధర ఇప్పుడు ఏకంగా రూ. 240 కి చేరింది. అలాగే, ప్రీమియం విభాగంలో ఉండే క్లాసిక్ 20 పీస్ ప్యాక్ ధర రూ. 340 నుండి రూ. 480 కి పెరిగింది. అంటే ఒక్కో ప్యాకెట్‌పై దాదాపు రూ. 70 నుండి రూ. 140 వరకు భారం పడింది. సాధారణ వినియోగదారులు ఎక్కువగా కొనే సూపర్‌స్టార్ వాల్యూ ప్యాక్ ధర కూడా రూ. 59 నుండి రూ. 70 కి పెరగడం గమనార్హం. ప్రతి స్టిక్ పైన సగటున రూ. 2 నుండి రూ. 11 వరకు అదనపు భారం పడటంతో రిటైల్ షాపుల దగ్గర ఈ ధరల మార్పుపై పెద్ద చర్చ జరుగుతోంది.
పన్నుల పోటు.. సిగరెట్ పొడవును బట్టి బాదుడు:
ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ప్రభుత్వం మార్చిన పన్నుల విధానమే. ఫిబ్రవరి 2026 నుంచి సిగరెట్లపై జీఎస్‌టీని 28% నుండి 40% కి పెంచారు. దీనికి అదనంగా సిగరెట్ పొడవును బట్టి ఎక్సైజ్ డ్యూటీని కూడా భారీగా సవరించారు. 65 మిమీ లోపు ఉండే సిగరెట్లపై తక్కువగా, 75 మిమీ కంటే ఎక్కువ పొడవు ఉండే ప్రీమియం సిగరెట్లపై అత్యధికంగా పన్ను విధిస్తున్నారు. పొగాకు వినియోగాన్ని తగ్గించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ 'హెల్త్ సెస్' మరియు ఎక్సైజ్ డ్యూటీలను పెంచినట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో ఐటీసీ వంటి కంపెనీలు తమ లాభాలను కాపాడుకోవడానికి ఈ భారాన్ని వినియోగదారులపైకి నెట్టేశాయి.
జేబు ఖాళీ.. ఆరోగ్యం భద్రం:
ధరలు పెరగడం వల్ల ధూమపానం చేసేవారి సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. "ముట్టుకుంటే మూతి కాలుతుంది" అన్న చందాన ఇప్పుడు సిగరెట్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. ఒకప్పుడు చిల్లర డబ్బులతో అయిపోయే పని, ఇప్పుడు పదుల రూపాయల్లోకి చేరింది. ఈ భారీ ధరల పెంపు వల్లనైనా కొందరు ఈ వ్యసనానికి దూరమవుతారేమో చూడాలి. ఏది ఏమైనా, ఐటీసీ ఇచ్చిన ఈ 'ధరల షాక్' మాత్రం స్మోకర్లకు చేదు వార్త అనే చెప్పాలి. చూడాలి ఇలా అయిన స్మోకర్స్ సిగరెట్ వాడటం తగ్గిస్తారని ఆశిద్దాం..