తిరుమల లడ్డూ ప్రసాదంపై సిట్ సంచలన నివేదిక.. త్వరలో మరిన్ని అరెస్టులు!

పామాయిల్ తో నెయ్యి తయారు చేసిన సంస్థ.. రంగు కోసం బీటా కెరోటిన్ అనే రసాయనాన్ని కలిపేదని, వాసన కోసం కొన్ని ఎసెన్స్ వాడిందని సిట్ అధికారులు గుర్తించారు.;

Update: 2025-11-10 14:11 GMT

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే అంశంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు కీలక విషయాలను గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ పర్యవేక్షణలో కేసును విచారిస్తున్న సిట్ పోలీసులు అనేక షాకింగ్ అంశాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. ప్రధానంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన ఉత్తరాఖండ్ కు చెందిన కాంట్రాక్టు సంస్థ భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ఐదేళ్లలో ఒక్కసారి కూడా పాలు, లేదా వెన్న కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో లేనట్లు సమాచారం. పూర్తిగా రసాయినాలతో తయారు చేసిన నెయ్యినే టీటీడీకి సరఫరా చేశారని సిట్ ఆధారాలు సంపాదించినట్లు చెబుతున్నారు.

కోట్లాది మంది భక్తులు అత్యంత విశ్వాసంతో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి విషయంలో భోలేబాబా డెయిరీ కనీస ప్రమాణాలు పట్టించుకోలేదని సిట్ విచారణలో గుర్తించింది. నెయ్యి నాణ్యత లేదని టీటీడీ అధికారులు గుర్తించి వెనక్కి పంపిన లారీలను కూడా మళ్లీ ఆలయానికి పంపిన ఉదంతాలు ఉన్నాయని సిట్ అధికారులు తమ విచారణలో కనుగొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2019-24 మధ్య ఐదేళ్లపాటు భోలేబాబా డెయిరీ అధికారికంగా కాంట్రాక్టు దక్కించుకుని టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. రూ.250 కోట్ల విలువైన 68 లక్షల లీటర్లను సమకూర్చింది. అయితే ఈ సమయంలో ఆ సంస్థ ఒక్క లీటర్ పాలు లేదా వెన్న కొనుగోలు చేసిన దాఖలు లేవని, అందుకు సంబంధించిన ఒక్క పత్రమూ ఆ సంస్థ రికార్డుల్లో లభ్యం కాలేదని సిట్ తన నివేదికలో పొందుపరిచింది.

పామాయిల్ తో నెయ్యి తయారు చేసిన సంస్థ.. రంగు కోసం బీటా కెరోటిన్ అనే రసాయనాన్ని కలిపేదని, వాసన కోసం కొన్ని ఎసెన్స్ వాడిందని సిట్ అధికారులు గుర్తించారు. స్వచ్ఛత పరీక్షలలో ఇబ్బందులు తలెత్తకుండా రసాయనాలతోనే మేనేజ్ చేసేవారని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇక 2022లో ఈ సంస్థను బ్లాక్ చేయగా, నకిలీ పత్రాలు, నకిలీ బిల్లులతో ఇతర కంపెనీల ద్వారా అదే సంస్థ టీటీడీకి నెయ్యి పంపినట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకసారి నాణ్యత లేదని టీటీడీ అధికారులు నెయ్యితో వచ్చిన నాలుగు ట్యాంకర్లను తిరస్కరిస్తే, లేబుళ్లను మార్చి కొత్త పేర్లతో అదే టాంకర్లను తిరిగి తిరుమలకు పంపారని సిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడైందని అంటున్నారు.

సుప్రీం ఆదేశాలతో దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసులు నెయ్యి కల్తీ చేసేందుకు అవసరమైన రసాయనాలను సమకూర్చిన ఢిల్లీకి చెందిన వ్యాపారిని తాజాగా అరెస్టు చేశారు. దీంతో భోలేబాబా డెయిరీ చేసిన మొత్తం మోసం బయటపడిందని అంటున్నారు. దీన్ని దేశంలోనే అతిపెద్ద ఆహారకల్తీ నేరంగా పరిగణిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ మోసం వెలుగు చూడగా, గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు నకిలీ నెయ్యితోనే లడ్డూ ప్రసాదం తయారు చేశారనే సంచలన విషయం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేరానికి పాల్పడిన ముఠాలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా, త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News