పుట్టిన నేలలో విగ్రహంగా సిరివెన్నెల
అనకాపల్లికే ఖ్యాతి తెచ్చిన మేటి కవి సిరివెన్నెల అని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రశంసించారు.;
రాజు జీవించి ఉన్నపుడే గౌరవించబడతారు అని అంటారు. అదే కవి ప్రజల నాలుకల మీద శాశ్వతంగా జీవిస్తారు అని చెబుతారు. అలా సిరివెన్నెల సీతారామశాస్త్రి తన జీవితానికి శాశ్వతత్వాన్ని సాధించారు. ఆయన అక్షర శిల్పిగా ఎన్నో సినీ గేయాలు రచించారు. వేలాదిగా అవి ప్రజల హృదయాలలో చేరి ఎప్పటికీ అక్కడ నిక్షిప్తం అయి ఉన్నాయి. ఆయన గతించి మూడేళ్ళకు పై దాటింది. ఆయన అక్షర చిరంజీవిగా కొలువుంటున్న వేళ ఆయన కాంస్య విగ్రహం ఆయన పుట్టిన చోట నడయాడిన నేల మీద ఏర్పాటు కావడం ఆయన అభిమానులనే కాదు సాహిత్య ప్రేమికులందరికీ ఎంతో ఆనందకరమైన విషయంగా ఉంది.
ఆర్భాటంగా ఆవిష్కరణ :
సిరివెన్నెల సీతారామశాస్త్రి విగ్రహాన్ని సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనకాపల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనదైన అక్షర సంపదతో తన గీతాలతో సిరివెన్నెల చిరంజీవిగా నిలిచారని కొనియాడారు. సిరివెన్నెల ఆలోచనలు ఎప్పటికీ ప్రేరణ కలిగిస్తూనే ఉంటాయని అన్నారు. ఆయన లాంటి మహానుభావుల వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలపాలని అన్నారు.
ప్రతీ ఏటా పురస్కారాలు :
అనకాపల్లికే ఖ్యాతి తెచ్చిన మేటి కవి సిరివెన్నెల అని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రశంసించారు. ఆయన పేరిట ప్రతీ ఏటా సిరివెన్నెల సీతారామశాస్త్రి కళాపీఠం ద్వారా సాహిత్య రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా పురస్కారం అందిస్తామని వెల్లడించారు. తెలుగు సినిమా సాహిత్యంలో సిరివెన్నెల ముద్ర బలమైనది అని మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు ఆయన రాసిన వేలాది పాటలలో మానవత్వం విలువలతో పాటు దేశ భక్తి కూడా కనిపిస్తుందని అన్నరు.
శ్రీశ్రీ తర్వాత :
ఇదిలా ఉంటే విశాఖలో మహా కవుల విగ్రహాలు చూస్తే అరుదుగా ఉంటాయి. శ్రీశ్రీ విగ్రహం విశాఖ సాగర తీరంలో మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. ఆ తరువాత మళ్ళీ సిరివెన్నెలకే ఆ గౌరవం దక్కింది అని చెప్పాల్సి ఉంది. పైగా పుట్టిన చోట తన కవితలకు పదును పెట్టిన చోట సొంత గడ్డ మీద విగ్రహ రూపంలో కొలువు తీరడం అంటే అది కేవలం సిరివెన్నెలకే దక్కిన అరుదైన భాగ్యంగా సాహితీ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏపీ ప్రభుత్వం అలాగే తానా సంస్థ, సిరివెన్నెల కళా పీఠంగా చెబుతున్నారు. అంతా కలిసి చేసిన ఈ కార్యక్రమం నిజంగా కవులకు అందించిన ఎంతో మర్యాదగా చెబుతున్నారు. సినీ గీతాలకు విలువ తగ్గిన రోజులలో సిరివెన్నెల రంగ ప్రవేశం చేసి ఎన్నో గీతాలకు ప్రాణ ప్రతిష్ట చేయడమే కాకుండా సామాన్యుడికి సైతం వాటి ద్వారా ఆలోచనలు రేకెత్తించారు అని అంతా ప్రశంసిస్తున్నారు. మొత్తానికి నిన్నటి దాకా మనిషిగా మనలో ఒకరిగా తిరిగిన సిరివెన్నెల ఇపుడు విగ్రహ రూపంలో నిగ్రహంగా నిలిచి అందరినీ పలకరిస్తారు అని అనకాపల్లి వాసులు అయితే మురిసిపోతున్నారు.