శివాజీకి బదులు సెయింట్ మేరీ.. సీఎం సిద్దూ కొత్త రచ్చ
ఇప్పుడున్న వివాదాలు సరిపోవన్నట్లు కొత్త రచ్చల్ని నెత్తిన వేసుకోవటంలో కాంగ్రెస్ నేతలకు ఉండే టాలెంట్ మరే పార్టీ నేతల్లోనూ కనిపించదు.;
ఇప్పుడున్న వివాదాలు సరిపోవన్నట్లు కొత్త రచ్చల్ని నెత్తిన వేసుకోవటంలో కాంగ్రెస్ నేతలకు ఉండే టాలెంట్ మరే పార్టీ నేతల్లోనూ కనిపించదు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా కొత్త రచ్చకు శ్రీకారం చుట్టారా? అంటే అదీ లేదు. తాము తీసుకునే నిర్ణయాలతో లాభం కంటే నష్టమే ఎక్కువ కలగటమే కాదు.. సర్కారు బండి సాఫీగా నడవకుండా తామే బ్రేకులు వేసుకోవటం కనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి పనే చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి.. సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ద రామయ్య.
సెయింట్ మేరీ బాసిలికా వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను బెంగళూరులోని శివాజీనగర్ మెట్రోస్టేషన్ పేరును సెయింట్ మేరీగా మార్చాలని ఆర్టిబిషన్ పీటర్ మచడోకు కోరారు. ఇలా అడిగిన సందర్భంలో.. ఒకవేళ నిజంగానే సిద్దూకు ఆయన కోరికను మన్నించాలని భావిస్తే.. ఒక స్టేషన్ కు ఆ పేరు పెడతామని చెబితే సరిపోయేది. అలా చేస్తే.. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎందుకు అవుతారు. బిషప్ అడిగినట్లుగా శివాజీనగర్ మెట్రో స్టేషన్ పేరును మారుస్తామంటూ హామీ ఇచ్చేశారు.
ఆ వెంటనే కొత్త రచ్చ మొదలైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు కర్ణాటక బీజేపీ నేతలంతా ఒంటి కాలిపై విరుచుకుపడటం షురూ చేశారు. బుజ్జగింపు రాజకీయాల కోసం మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తుందని మండిపడ్డారు. హిందువులను టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి సిద్దూ నిర్ణయాలు ఉంటున్నాయని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. సిద్దూ తాజా హామీతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారు పెరగటంతో పాటు.. మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుంది. ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు లాభం రాకున్నా ఫర్లేదు.. నష్టం కలగకూడదన్న కనీస ఆలోచన ముఖ్యమంత్రి సిద్దూ ఎందుకు చేయట్లేదన్నది ఒక ప్రశ్నగా మారింది.
ఇదొక్కటే కాదు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హిందువులు తమ మతాన్ని వదిలి వేరొక మతంలోకి ప్రవేశించటంపైనా వ్యాఖ్యలు చేశారు. ‘హిందూ కమ్యూనిటీలో సమానత్వం ఉంటే ఎవరైనా ఎందుకు వేరే మతంలోకి మారతారు? సమానత్వమే ఉంటే అంటరానితనం ఇంకా ఎందుకు మిగిలి ఉంది? అంటరానితనాన్ని మనం క్రియేట్ చేశామా?’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపైనా పలువురు ముఖ్యమంత్రి మీద మండిపడుతున్నారు. కులం మతం పేరుతో ప్రజల్ని విభజించేందుకు ముఖ్యమంత్రి సిద్దూ ప్రయత్నిస్తున్నారని.. ‘అసమానత్వంపై ముస్లింలను సిద్ధరామయ్య ప్రశ్నించగలరా?’ అని బీజేపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కదిలించి కంప నెత్తిన వేసుకోవటం అంటే ఇదేనంటూ కర్ణాటక సీఎం తీరును తప్పు పడుతున్నారు.