అంతరిక్షం నుండి హైదరాబాద్ ఎలా ఉందో చూసారా.. వీడియో వైరల్!
అంతరిక్షంలో అడుగుపెట్టిన రెండో భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా రీసెంట్ గానే తన యాత్ర ముగించుకొని ఇండియాకి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో జరిగిన గగన్ యాత్ర అభినందన సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;
టెక్నాలజీ రోజు రోజుకి బాగా పెరిగిపోతోంది. భూమి నుండి అంతరిక్షంలోకి కూడా ప్రయాణిస్తున్నారు. అలా ఇప్పటికే ఎంతోమంది అంతరిక్షంలో ప్రయాణం చేసి వారి అనుభూతులను పంచుకున్నారు. అలా తాజాగా అంతరిక్షానికి వెళ్లి వచ్చిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకాదు స్పేస్ నుండి హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో సిటీలు ఎలా కనిపిస్తాయో కూడా దానికి సంబంధించిన వీడియో ప్లే చేశారు. మరి అంతరిక్షం వెళ్లి వచ్చిన శుభాన్షు శుక్లా అనుభూతులు ఏంటో ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
అంతరిక్షంలో అడుగుపెట్టిన రెండో భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా రీసెంట్ గానే తన యాత్ర ముగించుకొని ఇండియాకి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో జరిగిన గగన్ యాత్ర అభినందన సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. "నేను అంతరిక్ష కేంద్రం నుండి భారతదేశం ఎలా ఉంటుందో ఆ వీడియో తీశాను. వీడియో ఎన్నిసార్లు చూసినా నాకు అలసట రావడం లేదు.ఈ వీడియోలు, దృశ్యాలు నాకు ఎప్పటికీ గుర్తిండి పోతాయి.. మరీ ముఖ్యంగా రాత్రిపూట హిందూ మహాసముద్రం మీద వెళుతున్నప్పుడు ఇండియా మొత్తం ఒక ప్రత్యేకమైన షేప్ లో రాత్రి సమయంలో వెలిగే నగరాల్లోని కాంతులు ఒక అద్భుతమైన దృశ్యంగా కనిపిస్తాయి. ఇది ఎంత అద్భుతమైన దృశ్యమో చూస్తే గానీ అర్థం కాదు.. అంతరిక్షం లోకి వెళ్లిన ఎవరైనా సరే ఈ దృశ్యాన్ని అనుభూతి పొందవచ్చు.
అంతరిక్షం నుండి భూమిని చూడడం ఒక విలక్షణమైన అనుభూతి.. అయితే అంతరిక్షంలోకి వెళ్లిన సమయంలో భూమిని తలకిందులుగా చూస్తాం. అలా చూసినప్పుడు ఆక్సిజన్ కారణంగా అది పచ్చని కాంతితో అద్భుతంగా మెరిసిపోతుంది. నేను అంతరిక్షం నుండి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు ఎలా ఉంటాయో వీడియో తీశాను" అంటూ వీడియోలు,ఫోటోలతో సహా చాలా స్పష్టంగా స్పేస్ నుండి బెంగళూరు, హైదరాబాద్ లకి సంబంధించిన ఫోటోలు చూపించారు. అంతరిక్షంలో 16 సార్లు సూర్యోదయాన్ని చూసే అవకాశం ఉంటుందని, ఇలాంటి దృశ్యాన్ని చూసి నేను ఎప్పుడూ కూడా అలసిపోలేదని చెప్పుకొచ్చారు. అంతరిక్షయాన పరిశోధన రంగంలో శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం అనేది ఒక మైలు రాయి అని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే శుభాన్షు శుక్లా ఈ మిషన్ లో పైలట్ గా ముఖ్యపాత్ర పోషించారు. భారతీయ పరిశోధకులు రూపొందించిన శాస్త్రీయ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన శుభాన్షు పేరు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు.అంతేకాదు ఈ ప్రయోగాలు గగన్ యాన్ మిషన్ వంటి ఫ్యూచర్లో జరగబోయే అంతరిక్ష కార్యక్రమాలకు ఎంతో బాగా సహాయపడతాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత దేశ ప్రజలు కలలు కనడం ఆశలు పెట్టుకోవడం మాత్రమే కాదు అంతరిక్షం లోకి వెళ్లాలనే కల కూడా కనాలని శుభాన్షు చెప్పారు. ఈ అంతరిక్ష ప్రయాణం యువతలో టెక్నాలజీ, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుతుందని శుభాన్షు శుక్లా చెప్పుకొచ్చారు. అంతరిక్ష రంగంలో అన్ని దేశాలు పురోగమణం సాధిస్తున్న వేళ భారతదేశం నుండి రెండో వ్యోమగామిగా శుభాన్షు శుక్లా అంతరిక్షానికి వెళ్లి తన అనుభవాలను భారతీయులతో పంచుకోవడం గర్వకారణం అని చెప్పుకోవచ్చు.. శుభాన్షు శుక్లా ఎంతోమంది యువతకి ఆదర్శంగా నిలుస్తారు.