అంతరిక్షంలో ’శుభాం’శు.. మనుషుల మేలు కోరి అరుదైన రీసెర్చిలు

రావడం ఆలస్యం కావొచ్చేమో కానీ.. రావడం మాత్రం పక్కా అన్నట్లుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి చేరారు భారత వ్యోమగామి శుభాంకు శుక్లా.;

Update: 2025-07-07 05:15 GMT
అంతరిక్షంలో ’శుభాం’శు.. మనుషుల మేలు కోరి అరుదైన రీసెర్చిలు

రావడం ఆలస్యం కావొచ్చేమో కానీ.. రావడం మాత్రం పక్కా అన్నట్లుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి చేరారు భారత వ్యోమగామి శుభాంకు శుక్లా. పలుసార్లు వాయిదా పడినప్పటికీ పది రోజుల కిందట శుభాంశు ఐఎస్ఎస్ లోకి అడుగుపెట్టారు. యాక్సియయ్ -4 మిషన్ లో మే నెలలో అనుకున్న ఆయన ప్రయాణం కాస్త.. జూన్ 26కు గమ్యం చేరింది. మరి పదిరోజుల నుంచి ఆయన అక్కడ ఏం చేస్తున్నారు...?

శనివారం అందిన సమాచారం ప్రకారం ఐఎస్ఎస్ లో శుభాంశు పలు ప్రయోగాలు చేశారు. అంతరిక్షం అంటే భార రహిత స్థితి అని తెలుసు. ఇలాంటి స్థితిలో ఎముకలు ప్రతిస్పందన ఎలా ఉంటుంది..? అనే దానిపై ఆయన పరిశోధనలు నిర్వహించారు. ఇది ఆస్టియోపొరోసిస్ వ్యాధికి మెరుగైన చికిత్సలు అందించేందుకు వీలు కల్పిస్తుంది. ఈ వ్యాధి ఎముకలు బలహీనంగా, పెలుసుగా మారేది. తద్వారా ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ వస్తుందని అంటారు కానీ.. కొందరిలో తొందరగానే సంభవిస్తుంది.

శుభాంశు చేసిన మరో ప్రయోగం.. ఐఎస్ఎస్ పై రేడియో ధార్మికత తీవ్రతను విశ్లేషించేది. ఇప్పటికే వ్యక్తులు సైతం అంతరిక్ష యాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. భవిష్యత్ లో ఇది మరింత పెరుగుతంది. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ రోజుల ప్రయోగానికి వెళ్లి నెలల తరబడి అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సంగతి తెలిసిందే. శుభాంశు పాల్గొన్న ప్రయోగం.. మున్ముందు సుదీర్ఘ అంతరిక్ష యాత్రలు చేసే వ్యోమగాములకు మెరుగైన రక్షణ కల్పించేందుకు ఉపయోగపడుతుంది.

ఇక మరో పరిశోధన.. సూక్ష్మ ఆల్గేపైన నిర్వహించారు. మైక్రో స్కోప్ తో మాత్రమే చూడగలిగే ఈ ఆల్గేలు ఏక కణ జీవులు. గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. నీటిలో పెరిగే, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారోత్పత్తి చేసే ఈ ఆల్గేలు పర్యావరణానికి చాలా ఉపయోగకరం. జీవ ఇంధనం, ఆహారం, ఇతర ఉత్పత్తుల తయారీకి వీటిని ఉపయోగిస్తారు.

ఇక టార్టిగేడ్లు.. ఇది భూమిపై పెరిగే చాలా విచిత్రమైన 8 కాళ్ల జీవి. దీనిని ప్రయోగాల కోసం శుభాంశు తనతో పాటు తీసుకెళ్లారు. వీటిని నీటి ఎలుగుబంట్లు లేదా నాచు పందిపిల్లలు అని పిలుస్తారు. డైనోసార్ల కంటే 400 మిలియన్ సంవత్సరాల ముందటి చరిత్ర ఉన్న జలచర సూక్ష్మజీవి. డైనోసార్లు అంతరించిపోయినా.. ఎన్నో విపత్తులను తట్టుకుని ఉనికిని కొనసాగిస్తున్నాయి టార్టిగేడ్లు. ఇక అంతరిక్షంలోని కఠిన వాతావరణంలో వీటి మనుగడ ఎలా? పునరుత్పత్తి ఎలా? వాటిని అవి ఎలా బాగు చేసుకుంటాయి? అనే జీవ రహస్యాలను తెలుసుకోనున్నారు శుభాంశు. తద్వారా అంతరిక్ష వైద్యం, జన్యుశాస్త్రం, బయో మెటీరియల్స్, క్రయోప్రిజర్వేషన్ లో విప్లవాత్మక మార్పులు తేగలరని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

మానవాళికి ఉపయోగపడే ప్రయోగాల్లో పాల్గొంటున్న శుభాంశు శుక్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్. గ్రూప్ కెప్టెన్. ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ లో మరో ముగ్గురితో కలిసి అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి.

Tags:    

Similar News