టెన్త్ మార్కు లిస్టు కోసం స్కూల్ కు వెళితే.. క్లాస్ రూంలో రేప్

విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతం ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో చోటు చేసుకుంది.

Update: 2024-05-23 06:30 GMT

విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతం ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వైనం గురించి వింటే నోట మాట రాదంతే. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల నేపథ్యంలో స్కూల్ లో మార్కుల లిస్టు తీసుకునేందుకు 15 ఏళ్ల బాలిక స్కూల్ కు వెళ్లింది. అయితే.. అక్కడ టీచర్లు ఎవరూ అందుబాటులో లేకపోవటంతో తిరిగి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది.

అక్కడే మాటు వేసిన ఆమె క్లాస్ మేట్ (15) ఆమెను బలవంతంగా క్లాస్ రూంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఈ దారుణాన్ని అక్కడే ఉన్న నలుగురు తమ ఫోన్ లో వీడియో తీశారు. ఆ తర్వాత నుంచి ఆ బాలికకు సదరు వీడియో చూపిస్తూ తమ కోరికను తీర్చాలంటూ వేధింపులకు గురి చేయటం షురూ చేశారు.

దీంతో హడలిపోయిన ఆ బాలిక.. ఇంట్లో విషయాన్ని చెప్పింది. ఆ వీడియోను డిలీట్ చేయాలని ఆమె తల్లిదండ్రులు కోరితే.. తమకు రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు ఎంత ప్రాధేయ పడినా కనికరించలేదు. అక్కడితో ఆగని వారు వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోను షేర్ చేయటం మొదలుపెట్టారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో.. అత్యాచారానికి పాల్పడిన బాలుడ్ని అదుపులోకి తీసుకొని జువైనల్ హోంకు తరలించారు.

ఇక.. దారుణ ఘటనను అడ్డుకోవాల్సింది పోయి.. అరాచకంగా వీడియో తీసి బెదిరింపులకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నలుగురిలో ఇద్దరు 22 ఏళ్ల వయసున్న వారు కాగా.. మరొకరు 20, ఇంకొకరు 19 ఏళ్లుగా పోలీసులు గుర్తించారు. వీరందరిని అరెస్టు చేసి.. కోర్టు ఎదుట హాజరుపర్చగా వారిని రెండు వారాలు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

Tags:    

Similar News