భార్యతో వలపుల వల.. కట్ చేస్తే బెదిరింపులు.. ఘరానా దంపతులు..

ఇటీవలి కాలంలో వెలుగుచూస్తున్న నేర కథనాలు ఒకదాన్ని మించి మరొకటి భయానకంగా మారుతున్నాయి.;

Update: 2026-01-15 07:19 GMT

ఇటీవలి కాలంలో వెలుగుచూస్తున్న నేర కథనాలు ఒకదాన్ని మించి మరొకటి భయానకంగా మారుతున్నాయి. “ఇలా కూడా చేస్తారా?” అని ఆశ్చర్యపోయేలోపే… అదే మన చుట్టూ, మన మధ్యే జరుగుతోందన్న నిజం షాక్‌కు గురి చేస్తోంది. విలువలు క్రమంగా క్షీణిస్తున్న ఈ కాలంలో, డబ్బే లక్ష్యంగా మానవ సంబంధాలను, గౌరవాన్ని, గోప్యతను పాతాళానికి నెట్టేసే దుర్మార్గాలు కూడా అదే వేగంతో పెరుగుతున్నాయి. కరీంనగర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అందుకు బలమైన ఉదాహరణ.

సోషల్ మీడియాను వేదికగా చేసుకొని, భార్యను వలగా ఉపయోగించి, భర్త కెమెరాతో బ్లాక్‌మెయిల్ చేసిన ఈ దంపతుల కథ వింటే ఒళ్లు గగుర్పొడవాల్సిందే. పురుషులను ఆకర్షించేలా భార్య ముందుకొచ్చి, వారి నమ్మకాన్ని పొందుతుంది. ఆ నమ్మకాన్ని ద్రోహంగా మార్చి, వారి వ్యక్తిగత క్షణాలను హైడెఫినిషన్ వీడియోలుగా రికార్డు చేస్తాడు భర్త. ఆ తర్వాత మొదలవుతుంది అసలు దందా — బెదిరింపులు, బ్లాక్‌మెయిల్, లక్షల రూపాయల వసూళ్లు. ఈ దారుణం కరీంనగర్‌లో చోటు చేసుకుంది.

ఈ నేరం వెనుక నేపథ్యం ఇదేనా?

ఈ కథ వెనుక ఉన్న నేపథ్యం కూడా ఆలోచింపజేసేదే. మంచిర్యాల జిల్లా వెంకటరావుపేటకు చెందిన ఒక వ్యక్తి కరీంనగర్‌కు వచ్చి మార్బుల్ వ్యాపారం ప్రారంభించాడు. అదే ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలతో కుటుంబ జీవితం సాగుతుండగా, వ్యాపారంలో నష్టాలు వెంటాడాయి. ఆర్థిక భారాన్ని తట్టుకోలేక ఇంటీరియర్ వ్యాపారం మొదలుపెట్టాడు. దానికి బ్యాంకు రుణం తీసుకుని అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేశాడు. కానీ పరిస్థితి మెరుగుపడలేదు. ఈఎంఐలు కట్టలేని స్థితికి చేరుకోవడంతో, ఆర్థిక సంక్షోభమే అతడిని నేర మార్గంలోకి నెట్టిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భార్యాభర్తలు కలిసి ఒక క్రూరమైన ప్లాన్ వేశారు. సోషల్ మీడియా వేదికగా భార్య ఆకర్షణీయమైన ప్రొఫైల్‌తో యువకులు, వ్యాపారులను టార్గెట్ చేసేది. పరిచయం పెంచుకొని, ఫోన్ కాల్స్ ద్వారా దగ్గరవుతుంది. ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కు ఆహ్వానిస్తుంది. అయితే ఆ గదిలో కనిపించని కన్ను ఒకటి ఉంటుంది.. భర్త చేతిలోని కెమెరా. మొత్తం వ్యవహారాన్ని రహస్యంగా వీడియోగా రికార్డు చేస్తాడు.

వందల మంది నుంచి లక్షల రూపాయలు..

తరువాత అసలు ఆట మొదలవుతుంది. బాధితుడికి ఒక చిన్న శాంపిల్ వీడియో పంపి గుండెలు గడగడలాడిస్తారు. కుటుంబానికి, స్నేహితులకు, సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేస్తామని బెదిరిస్తారు. పరువు పోతుందన్న భయంతో బాధితులు లక్షల రూపాయలు చెల్లించేవారు. పోలీసులు గుర్తించిన సమాచారం ప్రకారం.. ఈ విధంగా మూడేళ్లలో దాదాపు వంద మందిని ఈ దంపతులు బ్లాక్‌మెయిల్ చేసినట్లు తేలింది. ఈ దుర్మార్గం నుంచి బయటపడేందుకు కారణమైన ఘటన ఏడాది క్రితం జరిగింది. కరీంనగర్‌కు చెందిన ఒక వ్యాపారి ఈ వలలో చిక్కుకున్నాడు. తొలుత రూ. 13 లక్షల వరకు విడతలుగా చెల్లించాడు. అయినా ఆగకుండా మరో రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. చివరికి బెదిరింపులు తీవ్రరూపం దాల్చడంతో, అతడు ఇంట్లో నిజం చెప్పేశాడు. కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులను ఆశ్రయించడంతో ఈ దంపతుల బండారం బయటపడింది.

చివరికి ఛేధించిన పోలీసులు..

పోలీసులు రంగంలోకి దిగి, దంపతులను అదుపులోకి తీసుకొని విచారించగా.. వారి నేరాల పరిమాణం తెలిసి షాక్ తిన్నారు. వంద మందికిపైగా బాధితులు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియా ఎంత ఉపయోగకరమో.. అంతే ప్రమాదకరం కూడా అని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఈ కథ మనకు ఒక హెచ్చరిక చేస్తుంది. గోప్యత, ఆన్‌లైన్ పరిచయాల విషయంలో అప్రమత్తత అత్యంత అవసరం. ఒక క్షణపు తప్పు, జీవితాంతం వెంటాడే భయంగా మారవచ్చు. డబ్బు కోసం మానవత్వాన్ని చంపేసే నేరాలకు కఠిన శిక్ష తప్పనిసరి. అలాగే, సమాజం కూడా ఇలాంటి మాయ వలల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక క్రైం స్టోరీ కాదు.. మారుతున్న కాలంలో మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్పే చేదు పాఠం.

Tags:    

Similar News