మొన్న కంచన్.. నేడు శీతల్.. మోడల్స్ పై ఏంటీ దారుణం?
హర్యానాలోని సోనిపట్ జిల్లాలో హర్యాన్వీ మోడల్ శీతల్ దారుణ హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.;
హర్యానాలోని సోనిపట్ జిల్లాలో హర్యాన్వీ మోడల్ శీతల్ దారుణ హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన ఆమె మృతదేహం కండా గ్రామం సమీపంలోని కాలువలో తేలుతూ కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శీతల్ హర్యాన్వీ మ్యూజిక్ ఇండస్ట్రీకి చెందిన మోడల్. ఆమె అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం ఆమె మృతదేహం కాలువలో లభ్యమైంది. ప్రాథమిక అంచనా ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులు శీతల్ గొంతు కోసి హత్య చేసి, మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
- నిందితుల కోసం గాలింపు
ఈ హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. శీతల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని, నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
- మరో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హత్యతో ఆందోళనలు
ఇదిలా ఉండగా, ఇటీవల పంజాబ్‌లోని బఠిండాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కంచన్ కుమారి హత్య కూడా సంచలనం సృష్టించింది. ఆదేశ్ యూనివర్సిటీ పార్కింగ్‌లో ఆమె మృతదేహం ఒక కారులో గుర్తించారు. 'కమల్‌కౌర్ భాబీ' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా 3.84 లక్షల మంది ఫాలోవర్లను, 'ఫన్నీ భాబీ టీవీ' అనే యూట్యూబ్ ఛానెల్‌ను 2.36 లక్షల మంది ఫాలోవర్స్ ో కంచన్ నిర్వహించేవారు.
- మహిళల భద్రతపై ప్రశ్నలు
శీతల్ , కంచన్ కుమారి హత్య ఘటనలు దేశంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించాయి. ఒకవైపు గ్లామర్ , సోషల్ మీడియా రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నప్పటికీ, మరోవైపు వారి ప్రాణాలకు పెరుగుతున్న ముప్పు అందరినీ భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ రెండు హత్యలకు గల వాస్తవ కారణాలు పూర్తి విచారణ అనంతరం వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. కాగా, సోషల్ మీడియాలో ఈ ఘటనలపై న్యాయం కోసం నినాదాలు మిన్నంటుతున్నాయి.