రూల్ అడిగితే గుడ్డు మీద ఈకలు పీకినట్లే.. ఎందుకంటే?

మంచికి పోతే చెడు ఎదురైందన్నట్లుగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఉదంతమే ఒకటి తెలంగాణకు చెందిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ విషయంలో చోటు చేసుకుంది.;

Update: 2025-09-16 04:23 GMT

మంచికి పోతే చెడు ఎదురైందన్నట్లుగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఉదంతమే ఒకటి తెలంగాణకు చెందిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ విషయంలో చోటు చేసుకుంది. చేసింది మంచి పనే అయినా.. విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కారణం..తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటమే. మేడారం మహాజాతర దగ్గరకు వస్తున్న నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల అంశంపై ఫోకస్ చేసిన మంత్రి సీతక్క.. ఆ ప్రాంతాల్లో స్వయంగా పర్యటించాలని డిసైడ్ చేశారు.

అనుకున్నట్లే ఆమె బయలుదేరారు. మంత్రిగారి కాన్వాయ్ కొంత దూరం వెళ్లిన తర్వాత.. ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి వేళలో.. అక్కడి నుంచి బుల్లెట్ బండి మీద ఆమె ప్రయాణించారు. ఈ సందర్భంగా బుల్లెట్ బండిని ములుగు జిల్లా ఎస్పీ నడిపించగా.. ఆమె వెనుక కూర్చొని ప్రయాణించారు. ఒక మంత్రి సాదాసీదాగా బుల్లెట్ వాహనం మీద ప్రయాణించటం.. దాన్ని జిల్లా ఎస్పీ స్వయంగా నడపటం ఆసక్తికరంగా మారింది. పని విషయంలో వారి కమిట్ మెంట్ ను పలువురు అభినందించారు.

ఇదంతా బాగానే ఉందనుకున్న వేళ.. గుడ్డు మీద ఈకలు పీకే ప్రోగ్రాం ఒకటి వాట్సాప్.. సోషల్ మీడియా వేదికగా మొదలైంది. కర్నాటకలో డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న డీకే శివకుమార్ ఇదే తరహాలో టూవీలర్ మీద ప్రయాణించిన సమయంలో హెల్మెట్ పెట్టుకున్నారని.. కానీ.. మంత్రి సీతక్కను బుల్లెట్ మీద తీసుకెళ్లిన సందర్భంలో జిల్లా ఎస్పీ మాత్రం హెల్మెట్ పెట్టుకోలేదంటూ వేలెత్తి చూపిస్తూ విమర్శలు మొదలు పెట్టారు. ఈ వాదన విన్నోళ్లు కొందరు విసుక్కుంటున్నారు. గుడ్డు మీద ఈకలు పీకినట్లుగా.. ఈ లొల్లేంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు.

నిజమే.. ఇలా ఆగ్రహం వ్యక్తం చేసేటోళ్లు మాటలో న్యాయం ఉందనే చెప్పాలి. ఎందుకంటే.. వేలెత్తి చూపించేటోళ్లు.. విమర్శించటమే తప్పించి.. వాస్తవంగా ఏం జరిగింది? ఎలా జరిగింది? ఏ సందర్భంలో జరిగింది? అన్నది పట్టించుకోరు. విమర్శించటమే పనిగా పెట్టుకుంటారు. ఇలాంటోళ్లతో ఇదే పెద్ద చిక్కు. మంత్రి సీతక్క బుల్లెట్ ఎక్కిన సందర్భంలో దాన్ని నడిపిన ములుగు ఎస్పీ హెల్మెట్ పెట్టుకోకపోవటాన్ని తప్పుగా చూపిస్తునోళ్లు.. అసలు విషయాన్ని వదిలేశారు. అదేమంటే.. బుల్లెట్ మీద ఎక్కాలన్నది ముందస్తు ప్లాన్ కాదు.

మంత్రిగారి కాన్వాయ్ ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో.. అప్పటికప్పుడు.. అక్కడున్న వారి బుల్లెట్ తీసుకొని బయలుదేరారు. మహానగరాల్లో.. నగరాల్లో.. పట్టణాల్లో టూవీలర్లు నడిపేటోళ్లు హెల్మెట్ పెట్టుకుంటారు. ఊళ్లలో తిరిగే వారు.. పెట్టుకోరన్నది తెలిసిందే. అలాంటప్పుడు మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో తిరిగేవాళ్లు హెల్మెట్ వాడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది వాస్తవం. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి.. జిల్లా ఎస్పీని ఏదోలా విమర్శించాలన్న ఉద్దేశంతో చేసే విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్ని సందర్భాల్లోనూ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తే ఎలా ఉంటుందో తెలిసిందే. అవసరానికి తగ్గట్లు.. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాల్ని గౌరవించటం ముఖ్యం. అది మానేసి.. ఏదోలా లోపాన్ని హైలెట్ చేయాలన్న వైఖరి ఏ మాత్రం మంచిది కాదన్నది మర్చిపోకూడదు.

Tags:    

Similar News