మనిషి అంతమయ్యే చిట్ట చివరి రోజు వస్తుందా?
ఇప్పుడు కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోంది. ఇది మనిషిని బానిసగా మార్చేస్తుందనడంలో సందేహం లేదు.;
ఇప్పుడు కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోంది. ఇది మనిషిని బానిసగా మార్చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుత వ్యవస్థలో చాలా మార్పులకు ఈ ఏఐ కారణం అవుతోంది. అదంతా సరే కానీ.. ఒకవేళ మనిషే AI లా మారితే పరిస్థితేంటి? దానికి ఆస్కారం ఉందా? ఇది వినడానికే వింతగా ఆశ్చర్యకరంగా ఉన్నా కానీ.. దానికి ఆస్కారం లేకపోలేదని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే మానవ మెదడును కూడా కృత్రిమంగా మార్చేసే సైన్స్ అభివృద్ధి చెందడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. ఒక ఎలుక మెదడుపై చేసిన ప్రయోగంలో అసలు మెదడుకు వృద్ధాప్యం అన్నదే లేదని తేలడంతో ఇప్పుడు మానవ మెదడుపైనా ప్రయోగాలు మొదలయ్యాయి. భవిష్యత్ లో మనిషి మెదడును న్యూరాలింక్ వ్యవస్థకు అనుసంధానించి ఒక కృత్రిమ మేధస్సు పరికరంలా ఆపరేట్ చేస్తారనే అంచనాలేర్పడుతున్నాయి.
మానవ మెదడు సామర్థ్యాన్ని సాంకేతికంగా పెంచుకుంటూ పోతే భవిష్యత్తులో మనిషికి - కృత్రిమ మేధకు మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోయే అవకాశం ఉంది. నరాల అనుసంధాన ప్రక్రియలు (న్యూరల్ లింక్స్) జన్యుపరమైన మార్పుల ద్వారా మెదడును యంత్రాల వేగంతో సమానంగా పనిచేయించడం సాధ్యమైతే.. మనిషి ఒక రకమైన బయో-డిజిటల్ జీవిగా రూపాంతరం చెందుతాడు. ఈ క్రమంలో మనిషి కేవలం జీవశాస్త్ర పరంగానే కాకుండా.. గణన సామర్థ్యం పరంగా కూడా అత్యున్నత స్థాయికి చేరుకుంటాడు.
అయితే ఈ పరిణామం మానవత్వం అనే దానిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మనిషికి సహజంగా ఉండే తప్పులు చేసే గుణం...భావోద్వేగాల తీవ్రత.. పరిమితమైన జ్ఞాపకశక్తి వంటివి మాయమై.. ఒక ఖచ్చితత్వంతో కూడిన యంత్రంలా మారినప్పుడు.. కరుణ, సానుభూతి వంటి గుణాల విలువ తగ్గిపోయే ప్రమాదం ఉంది. మేధస్సు ఎంత పెరిగినా ఆత్మ - అనుభూతి లేని తెలివితేటలు మనిషిని కేవలం ఒక డేటా ప్రాసెసర్‌గా మార్చివేస్తాయి.
చివరికి ఈ పరివర్తన సమాజంలో ఒక కొత్త రకమైన విభజనకు దారితీయవచ్చు. సాంకేతికతను అందిపుచ్చుకున్న వారు అత్యంత శక్తివంతులుగా మారితే.. సహజసిద్ధంగా ఉండాలనుకునే వారు వెనుకబడిపోతారు. ఫలితంగా మానవత్వం అనేది కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోయి `మానవత్వం 2.0`అనే ఒక కృత్రిమ - యాంత్రిక ప్రపంచం ఆవిర్భవించవచ్చు. ప్రకృతి ఇచ్చిన మేధస్సుకు.. మనం సృష్టించుకునే కృత్రిమ సామర్థ్యానికి మధ్య సమతుల్యం పాటించకపోతే మనిషి తన ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది. సైన్స్ పురోగతి చెందుతూనే ఉంటుంది. భవిష్యత్ లో అది చాలా పరిణామాలకు దారి తీయవచ్చు.