సౌదీ బ‌స్సు ద‌హ‌నం దుర్ఘ‌ట‌న‌లో బ‌తికిన ఆ ఒక్క‌రు ఎవ‌రు?

హైద‌రాబాద్ కు చెందిన 46 మంది సోమ‌వారం మ‌క్కా నుంచి మ‌దీనాకు బ‌స్సులో వెళ్తుండ‌గా ఎదురుగా వ‌స్తున్న ఆయిల్ ట్యాంక‌ర్ ఢీకొట్టింది.;

Update: 2025-11-17 17:06 GMT

ఈ ఏడాది జూన్ లో అహ్మ‌దాబాద్ విమానాశ్ర‌యం నుంచి బ‌య‌ల్దేరిన కాసేప‌టికే ఎయిర్ ఇండియా విమానం కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే. ఆ దుర్ఘ‌ట‌న‌లో విమానంలోని 241 మంది ప్రాణాలు కోల్పోగా ఒకే ఒక్క‌డు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. అత‌డి పేరు విశ్వాస్ కుమార్ ర‌మేష్‌. ఆస్ప‌త్రిలో చికిత్స అనంతరం అత‌డు బ్రిట‌న్ వెళ్లిపోయాడు. ఇప్పుడు అక్క‌డే ఉంటున్నాడు. ఆరు నెలల త‌ర్వాత త‌న ప‌రిస్థితిని వివ‌రిస్తూ ఇటీవ‌ల మీడియాకు వివ‌రాలు తెలిపాడు.

అప్ప‌ట్లో విమాన ప్ర‌మాదం లాగానే.. తాజాగా సౌదీఅరేబియా బ‌స్సు ద‌హ‌నం దుర్ఘ‌ట‌న‌లో ఒకే ఒక్క వ్య‌క్తి ప్రాణాల‌తో మిగిలాడు. 45 మంది స‌జీవ ద‌హ‌నం అయిన ఈ ఘోర ప్ర‌మాదంలో బ‌తికి బ‌ట్ట‌క‌ట్టింది ఎవ‌రా? అనే చ‌ర్చ మొద‌లైంది. అందులోనూ మ‌ర‌ణించిన‌వారంతా హైద‌రాబాద్ కు చెందిన‌వారు కావ‌డంతో.. బ‌తికి ఉన్న ఆ ఒక్క‌రు ఎవ‌రు? అని తెలుసుకోవాల‌నే కుతూహ‌లం పెర‌గింది.

అంత ఘోరంలోనూ బ‌తికి బ‌య‌ట‌ప‌డి..

హైద‌రాబాద్ కు చెందిన 46 మంది సోమ‌వారం మ‌క్కా నుంచి మ‌దీనాకు బ‌స్సులో వెళ్తుండ‌గా ఎదురుగా వ‌స్తున్న ఆయిల్ ట్యాంక‌ర్ ఢీకొట్టింది. అర్థ‌రాత్రి వేళ జ‌ర‌గ‌డంతో ప్ర‌యాణికులు త‌ప్పించుకునే అవ‌కాశం లేక‌పోయింది. దీంతో 45 మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఒక్క‌రే గాయాల‌తో త‌ప్పించుకున్న‌రు. ఈ నెల 9న హైద‌రాబాద్ నుంచి జెడ్డాకు వెళ్లిన టీమ్ లో మొత్తం 54 మంది ఉన్నారు. న‌లుగురు ఆదివార‌మే మ‌దీనాకు కారులో వెళ్లిపోయారు. మ‌రో న‌లుగురు మ‌క్కాలో ఉన్నారు. 45 మంది ప్ర‌మాదంలో స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు.

-ఇక ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన ఆ ఒక్క‌రు ఎవ‌రు అంటే? హైద‌రాబాద్ కు చెందిన మొహ‌మ్మ‌ద్ అబ్దుల్ షోయబ్ గా తేలింది. ఆయ‌న‌ను దుర్ఘ‌ట‌న ప్ర‌దేశం నుంచి చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 45 మంది మృతదేహాలను మార్చురీలో ఉంచారు. సౌదీ అరేబియాలోని జ‌ర్మ‌న్ ఆస్ప‌త్రిలో షోయ‌బ్ చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

-కాగా, అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదంలో విశ్వాస్ కుమార్ సీటు నంబ‌రు 11ఏలో కూర్చోవ‌డంతో ప్రాణాల‌తో గ‌ట్టెక్కాడు. మ‌రి సౌదీ బ‌స్సు దుర్ఘ‌ట‌న‌లో షోయ‌బ్ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? అనేది తెలియాల్సి ఉంది. మ‌రోవైపు ఈ ఘోర ప్రమాదంపై ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మ‌రిన్ని వివ‌రాల కోసం రియాద్ లోని భార‌త రాయ‌బార కార్యాల‌యంతో ట‌చ్ లో ఉన్నారు.

Tags:    

Similar News