'జనసేన-జాతీయ జనసేన'.. తేడా కొట్టేస్తోంది గురూ!
ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు బరిలో నిలిచారు. తన పార్టీని ఆయన 'జాతీయ జనసేన'గా పేర్కొన్నారు. దీనినే ప్రచారంలో జోరుగా వినిపిస్తున్నారు.
మనుషులను పోలిన మనుషులు ఉంటారని అంటారు.కానీ, అరుదుగానే కనిపిస్తారు.కానీ, ఎన్నికల వేళలో మాత్రం ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు రాజకీయ పార్టీలు వేసే ఎత్తులు మాత్రం దీనికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉంటాయి. పేర్లను పోరిన పేర్లతో అభ్యర్థులు పోటీ చేయడం రివాజుగా మారింది. ఉదాహరణకు.. నరసాపురం ఎన్నికల్లో కనుమూరి రఘురామకృష్ణరాజు పోటీ చేయగా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఓ వ్యక్తి పేరు ఇదే తరహాలో ఉంది. కనుబూరి రఘురామకృష్ణ. దీంతో అభ్యర్థుల పేర్లు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.
ఇలా అనేక పేర్లు గత ఎన్నికల్లో కనిపించాయి. ఇక, ఎన్నికల గుర్తులు కూడా పార్టీలకు అభ్యర్థులకు చుక్కలు చూపిస్తుంటాయి. ఇప్పటికే బీఆర్ ఎస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో కారును పోలినట్టుగా ఉన్న రోడ్ రోలర్ గుర్తును కాన్సిల్ చేయాలంటూ ఎన్నికల సంఘానికి రిక్వెస్ట్ చేసింది. ఇలా..అనేక చిత్ర విచిత్ర సంగతలు తెరమీదికి వస్తున్నాయి. ఇలాంటి వాటిలో తాజాగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీకి కూడా పెద్ద తలనొప్పే వచ్చి పడింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ బీజేపీతో పొత్తుతో 8 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో కూకట్‌పల్లి స్థానాన్ని కీలకంగా భావిస్తున్నారు. ఇక్కడ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రేమ్‌కుమార్‌నురంగంలోకి దింపారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు బరిలో నిలిచారు. తన పార్టీని ఆయన 'జాతీయ జనసేన'గా పేర్కొన్నారు. దీనినే ప్రచారంలో జోరుగా వినిపిస్తున్నారు.
అంతేకాదు.. జనసేన గుర్తు గాజు గ్లాసు అయితే.. ఈయన గుర్తు బకెట్. రెండూ కూడా.. సిమిలరే కావడంతో జనసేన అభ్యర్థికి చెమటలు పడుతున్నాయి. సెటిలర్ల ఓటుపై గంపెడాశలు పెట్టుకున్న ప్రేమ్ కుమార్.. ఈ జాతీయ జనసేన, బకెట్ గుర్తులు.. ప్రేమ్‌కుమార్‌కు కంటిపై కునుకలేకుండా చేస్తున్నాయి. ఎన్నికల వేళ ఓటర్లు ఏమాత్రం కన్ఫ్యూజ్ అయినా తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.