బోయింగ్.. ఎయిర్ బస్ లకు పోటీగా భారత్ లో రష్యా విమానాలు

భారత పౌర విమానయానంలో మనకు ఎక్కువగా కనిపించేది రెండు సంస్థలకు చెందిన విమానాలే. అందులో ఒకటి అమెరికాకు చెందిన బోయింగ్.. యూరోప్ కు చెందిన ఎయిర్ బస్ లు మాత్రమే.;

Update: 2026-01-23 06:26 GMT

భారత పౌర విమానయానంలో మనకు ఎక్కువగా కనిపించేది రెండు సంస్థలకు చెందిన విమానాలే. అందులో ఒకటి అమెరికాకు చెందిన బోయింగ్.. యూరోప్ కు చెందిన ఎయిర్ బస్ లు మాత్రమే. తాజాగా ఈ రెండు సంస్థలకు పోటీగా రష్యా మన దేశంలోకి తన విమానాలతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ రెండు సంస్థలకు చెందిన పౌర విమానాలకు పోటీగా రష్యాకు చెందిన ఎస్ జే 100, ఐఎల్ 114, ఎంఎస్ 21, టీయూ 214 విమానాలు భారత్ లో అడుగు పెట్టనున్నాయి.

ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పౌర విమానాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. కొనేందుకు పెద్ద ఎత్తున సంస్థలు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని సరఫరా చేసేందుకు ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుంటున్న పరిస్థితి.ఇలాంటి వేళలో రష్యా తమ పౌర విమానాల్ని భారత్ కు అందజేసేందుకు ముందుకు రావటం కీలక పరిణామంగా మారింది.

నిజానికి పౌర విమానయానంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్నాయి బోయింగ్, ఎయిర్ బస్ లు. వీటి నిర్వహణ.. రిపేర్లు వచ్చినప్పుడు వాటి పరిష్కారం ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఇలాంటి వేళ.. రష్యా మన దేశానికి తన పైర విమనాల్ని మాత్రమే కాదు.. ఇంటీరియర్ విషయంలోనూ సాయం చేసేందుకు సిద్ధమైంది. 1500 కిలోమీటర్ల ప్రాంతీయ ప్రయాణాలకు సరిపోయే సుఖోయ్ జెట్ 100, ఇల్యూషనోప్ 114, మూడు వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఆధునిక ఎంఎస్ 21, ఏకధాటిగా 6500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించే అత్యాధునిక టీయూ 214 విమానాలు ఈ జాబితాలో ఉండటం గమనార్హం.

ఈ విమాన ఇంజిన్లు మొదలుకొని.. ఇతర భాగాలు... ఇంటీరియర్ మొత్తం రష్యా డెవలప్ చేసినవే. బోయింగ్ 757, ఎయిర్ బస్ 321 విమానాలకు పోటీగా రష్యా టీయూ 214 ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. ఎయిర్ బస్, బోయింగ్ లతో పోలిస్తే రష్యా విమానాల నిర్వహణ ఖర్చు చాలా తక్కువని పౌర విమాన రంగ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. రష్యాకు చెందిన ఎస్ జే 100, ఐఎల్ 114 విమానాలు చిన్న రన్ వేలపైనా సులువుగా టేకాఫ్.. ల్యాండింగ్ అవుతాయని చెబుతున్నారు.

రష్యాకు చెందిన పౌర విమానాల్ని మన దేశానికి ఇచ్చేందుకు ఓకే చేసే ఆ దేశం.. వాటిని మన దేశంలో ఉత్పత్తి చేసేందుకు సుముఖత వ్యక్తం చేయటంతో.. రానున్న రోజుల్లో ఈ రంగంలో పెను మార్పులు చోటు చేసుకునే వీలుంది. మన దేశానికి చెందిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో కలిసి ఉమ్మడిగా తయారు చేసేందుకు ఒప్పందం కుదురింది. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. 1988 తర్వాత భారతదేశంలో పూర్తిగా తయారవుతున్న మొట్టమొదటి ప్యాసింజర్ విమానంగా ఎస్ జే 100 నిలుస్తుంది.

ఇదంతా బాగానే ఉంది కానీ.. మరి రష్యాకు చెందిన పౌర విమానాలు భారత పౌర విమానాలుగా ప్రయాణాలు మొదలయ్యేది ఎప్పుడు? అన్నది ప్రశ్న. దీనికి సంబంధించిన అంశాల మీద ఫోకస్ చేస్తే.. రెండు ప్రధాన అంశాలు కనిపిస్తాయి. అందులో మొదటిది రష్యా నుంచి నేరుగా విమానాల్ని కొనుగోలు చేస్తే అవి వచ్చే ఏడాది అంటే 2027 నాటికే అందుబాటులోకి వచ్చే వీలుంది.

అదే భారత్ లోనే తయారు చేసే పౌర విమానం అంటే 2030 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే..రష్యా తన విమానాల్లోని కొన్ని విడిభాగాల్ని తొలగించి.. రష్యా తయారీకి చెందిన భాగాలతో కొత్త వెర్షన్లను సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు పశ్చిమ దేశాలకు చెందిన విడిభాగాల్ని వినియోగిస్తోంది. ఈ కొత్త వెర్షన్ పరీక్షలు పూర్తై.. భారత్ లోని డీజీసీఏ నుండి అనుమతులు పొందేందుకు 2027 చివర వరకు సమయం పడుతుంది.

అదే సమయంలో భారత్ లో హాల్ (హిందూస్థాన్ ఎయిరో నాటిక్స్ లిమిటెడ్ )తో కలిసి విమానాల తయారీకి సంబంధించిన ప్లాంట్ పనులు ప్రారంభించి.. వాటిని పూర్తి చేయటం..రష్యా నుంచి వచ్చిన విడిభాగాలతో భారత్ లో అసెంబ్లింగ్ పూర్తి చేయటం.. అనంతరం వీటిని (ఎస్ జే 100) పలుమార్లు పరీక్షలు నిర్వహించి.. ఫైనల్ అప్రూవల్ ఇస్తారు. అప్పుడు పౌర వినియోగానికి అందుబాటులోకి వస్తుంది. ఇదంతా జరగటానికి 2030 వరకు సమయం పడుతుంది.

Tags:    

Similar News