ప్రజలే నిర్ణయించాలి.. రుషికొండపై పబ్లిక్ ఓపీనియన్ కు ప్రత్యేక వెబ్ సైట్
ఈ నేపథ్యంలో వాటిని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.;
విశాఖలోని రుషికొండపై రూ.450 కోట్లతో నిర్మించిన అత్యంత విలాసవంతమైన భవనాలను ఎలా వినియోగించాలో తేల్చుకోలేని కూటమి ప్రభుత్వం.. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని భావించింది. గత ప్రభుత్వం ఎంతో రహస్యంగా నిర్మించిన రుషికొండ భవనాల నిర్వహణే భారంగా మారిందని కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. పర్యాటక శాఖ పరిధిలో నిర్మించిన ఈ భవనాలు టూరిజం అభివృద్ధికి కూడా ఉపయోగపడే అవకాశం లేదని కూటమి మంత్రులు తేల్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలోని రుషికొండపై పున్నమి రిసార్ట్ ను తొలగించి వాటి స్థానంలో అత్యంత విలాసమైన నాలుగు భవనాలను నిర్మించారు. ఈ భవన నిర్మాణాల సమయంలోనే తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. పర్యావరణ అనుమతులు లేకుండా, కొండను తొలచి భవనాలను నిర్మిస్తున్నారని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించాయి. ప్రతిపక్ష నేతలుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఆయా భవనాలను సందర్శించి ప్రభుత్వ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శలు గుప్పించారు. అయితే ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అప్పటి ప్రభుత్వంలో ఉన్న వైసీపీ మొండిగా భవన నిర్మాణాలు పూర్తిచేసింది.
అత్యంత వివాదాస్పదంగా మారిన రుషికొండపై భవనాలు నిర్మాణం పూర్తయిన వెంటనే ఎన్నికలు రావడం, వాటి ప్రారంభం వాయిదా పడింది. అప్పట్లో విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని ప్రకటించిన మాజీ సీఎం జగన్మోహనరెడ్డి తన క్యాంపు కార్యాలయం కోసమే ఆ భవనాలు నిర్మించారని ప్రచారం జరిగింది. అయితే కోర్టు వివాదాల వల్ల ఆ విషయాన్ని వైసీపీ బహిరంగంగా ప్రకటించలేకపోయింది. ఇక అధికారం చేతులు మారిన తర్వాత రుషికొండ నిర్మాణాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వైసీపీని మరింత డామేజీ చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది. అంతేకాకుండా రూ.450 కోట్లు పెట్టి ఎందుకూ పనికిరాని భవనాలను నిర్మించారని ప్రచారం చేసింది. మరోవైపు భవనాలను ఎలా వినియోగించాలనే అంశాలపై సూచనలు సలహాలు ఇవ్వాలని మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో నాలుగు నెలల తర్వాత ఇటీవల సమావేశమైన మంత్రుల కమిటీ భవనాల వినియోగంపై చర్చించింది. ఇదే సమయంలో ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించి ప్రత్యేక వెబ్ సైట్ సిద్దం చేసింది. రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రజలు తమ సలహాలు, సూచనలను rushikonda@aptdc.in అనే వెబ్ సైట్ లో నమోదు చేయొచ్చని వెల్లడించింది. ఈ నెల 17 లోగా సూచనలు పంపాలని నిర్దేశించింది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక అంశాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ఇదేవిధంగా ఓపీనియన్ పోల్ నిర్వహించగా, తాజాగా రుషికొండపైన అదే పంథాలో ప్రభుత్వం ముందుకెళుతోందని అంటున్నారు.