ఇద్దరు ఒప్పుకుంటే ‘మావిడాకులు’.. ఒక్కరు ఒప్పుకున్నా ‘మా విడాకులు’!

‘ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు చాలు.. కానీ, పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి’ అనేది చాలా ఫేమస్ వాక్యం.;

Update: 2025-11-18 04:02 GMT

'మావిడాకులు' ఎంత శుభ సందర్భానికి సూచికో.. 'మా విడాకులు' అంత నిశబ్ధానికీ, కొంతమంది జీవితాల్లో ఊహించని శూన్యానికీ సూచిక! ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇద్దరూ ఒప్పుకుంటేనే ప్రేమైనా, పెళ్లైనా! కానీ.. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు ఒప్పుకున్నా చాలు విడాకులకు వెళ్లొచ్చు! వివాహానికి ఇరువురి అంగీకారం అడిగే ఈ కుటుంబం, చట్టం, సమాజం.. విడిపోవడానికి మాత్రం ఒకరి అనుమతి, అంగీకారం చాలని అంటుంది.. అదేమిటో..!?

అవును... మావిడాకులు విషయంలో "మా"కు "విడాకులకు" మధ్య గ్యాప్ ఉండదు.. కానీ, "మా విడాకుల" విషయంలో ఆ గ్యాపే ప్రధానం! అది ఒక అక్షరానికి, ఒక పదానికి మధ్య గ్యాప్ మాత్రమే కాదు.. రెండు జీవితాల మధ్య ఊహించని గ్యాప్, మళ్లీ కలవనంత గ్యాప్.. పరిస్థితులు ఏమైనా, కారణం ఎవరైనా! అందుకే... విడాకులు అనేది చాలా మంది తమ జీవితంలో వినకూడని, తమ వరకూ రాకూడని పదం అని భావిస్తుంటారు.

ఒకప్పుడు వివాహం మాత్రమే తప్ప విడాకులు అనే పదం వినిపించేది కాదు.. కాలక్రమేనా అప్పుడప్పుడూ వినిపించేది.. ఇప్పుడు అది అత్యంతం సహజమైపోయింది అని చెప్పినా అతిశయోక్తి కాదేమో! భారతీయ సంస్కృతిలో వివాహానికి ఉన్న విలువ తెలియకా.. లేక, పాశ్చాత్య సంస్కృతి అనే సాకులో కానిచ్చేయాలనా.. అదీ గాక వైవాహిక జీవితంపై అవగాహన లేకనా.. చెప్పడం తెలిసినా కష్టం!

‘ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు చాలు.. కానీ, పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి’ అనేది చాలా ఫేమస్ వాక్యం. అంతకంటే పెద్ద విషయం ఏమిటంటే... విడిపోతే రెండు కుటుంబాలు, రెండు జీవితాలే కాదు.. పిల్లలుంటే వారి భవిష్యత్తు సైతం చాలా సందర్భాల్లో బాధించబడుతుంది! కొన్ని సందర్భాల్లో శారీరంకంగానో, మానసికంగానో బలైపోతుంది!

వివాహ జీవితం, దాంపత్య జీవితం అంటే.. అజ్ఞానంతోనో, అవగాహనా రాహిత్యంతోనో చాలా మంది ఊహించుకునేది, ఆర్థికంగా బేరీజు వేసుకునేది కాదు.. నమ్మకం ఉన్నా లేకున్నా అది (దేవుడి) స్క్రిప్ట్! అయితే చాలా మంది తాము చూసిందే లోకం, తమకు తెలిసిందే జ్ఞానం అనే ఆలోచనతో ఆ స్క్రిప్ట్ మార్చేస్తూ ఉంటారు. తర్వాత రిజల్ట్ వచ్చాక వారిలో వారు (ఆ దేవుడితో) మాట్లాడుకుంటుంటారు.

ఈ ఉపోద్గాతం ఎందుకంటే... ఇటీవల కాలంలో విడాకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రధానంగా యువతలో ఈ తరహా వ్యవహారలు ఎక్కువైపోతున్నాయి. వీరి సొంత ఆలోచనో.. లేక, పక్కవారి జ్ఞాన గులికల ప్రభావమో తెలియదు కానీ... ఈ కల్చర్ హైదరాబాద్ లో మరీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో తాజా ఘణాంకాలు షాకింగ్ గా ఉన్నాయి!

ఇందులో భాగంగా... హైదరాబాద్ లో విడాకుల కేసులు పెరిగిపోతున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా... ప్రతినెలా సుమారు 250 విడాకుల కేసులు ఫ్యామిలీ కోర్టు తలుపు తడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి! ప్రధానంగా 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న జంటలు చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుంటున్నారనే విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది!

ఈ క్రమంలో కొన్ని యువ జంటలు సహనం, సర్ధుబాటు, అర్ధం చేసుకోవడం వంటి విషయాలను పక్కన పెట్టి "అండర్ స్టాడింగ్ కుదరడం లేదు!" అనే (తమకు కూడా పూర్తిగా తెలియని!) ఒక కారణం చూపించి విడాకుల వెంట పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. పలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

‘అమెరికాలో అంతేనమ్మా.. తలుపుకి గొళ్లెం పెట్టలేదని, పొయ్యిమీద కాఫీ పెట్టలేదని, కుక్కకు గొలుసు కట్టలేదని.. దేనికైనా విడాకులు ఇచ్చేస్తారు’ అనేది ఒక తెలుగు సినిమాలో డైలాగ్... ఈ వ్యవహారం ఇలానే సాగితే... ఈ డైలాగ్ చివరలో "అమెరికాలో అంతేనమ్మా" అనే పదం తీసేసి "హైదరాబాద్ లో ఇంతేనమ్మా" అనే రోజు త్వరలోనే వచ్చినా అతిశయోక్తి కాదేమో! "జీవితం చాలా విలువైంది!"

Tags:    

Similar News