మెగా ఎలక్ట్రిక్ కారు.. సీఎం రేవంత్ స్వయంగా నడిపారు
ఈ కారును ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తానే స్వయంగా డ్రైవింగ్ సీటులో కూర్చోగా.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తన పక్కన కూర్చోబెట్టుకున్నారు.;
‘ఒలెక్ట్రా’ అన్నంతనే అందరికి అర్థం కాకపోవచ్చు. కానీ.. మెగా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అన్న పేరు చదివినంతనే.. మన తెలుగోడు మెగా క్రిష్ణారెడ్డికి చెందిన కంపెనీనే కదా అన్నది ఇట్టే గుర్తుకు వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టులతో పాటు.. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులతో అందరి చూపు తన మీద పడేలా చేస్తున్న మెగా సంస్థ.. తాజాగా మరో బిగ్ సర్ ప్రైజ్ కు తెర తీసింది.
సైలెంట్ గా తన ఎలక్ట్రిక్ కారును సరైన సమయంలో.. సరైన వేదిక మీద ఆవిష్కరించటం ద్వారా వావ్ అనేలా చేయటమే కాదు.. తెలుగోడికి చెందిన తొలి ఎలక్ట్రిక్ కారు ఎలా ఉంది? అన్న ఆసక్తిని కలిగించేలా చేసిందని చెప్పాలి. తెలంగాణలోని రేవంత్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ సందర్భంగా సోమవారం రాత్రి ప్యూచర్ సిటీ ప్రాంగణంలో మెగా సంస్థకుచెందిన ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించారు.
ఈ కారును ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తానే స్వయంగా డ్రైవింగ్ సీటులో కూర్చోగా.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. స్టీరింగ్ అందుకొని ఈ ఎలక్ట్రిక్ కారును కొంచెం దూరం నడిపించారు. ఈ కారులోనే మెగా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ క్రిష్ణారెడ్డి వెనుక సీటులో కూర్చున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణతో మెగా సంస్థకు చెందిన ఒలెక్ట్రా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తుందన్న విషయంపై మరింత క్లారిటీని తీసుకొచ్చిందని చెప్పాలి. ఈ కారుకు సంబంధించిన మిగిలిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.