విజయన్‌కు ఇచ్చి పడేసిన రేవంత్.. విషయం ఇదీ!
కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా అక్కడ ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి.. కేరళ సీఎం విజయన్‌పై ఇటీవల తీవ్ర విమర్శలు గుప్పించారు.;
కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా అక్కడ ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి.. కేరళ సీఎం విజయన్‌పై ఇటీవల తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా.. విజయన్ కూడా ఘాటు వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డిని కార్నర్ చేశారు. ``మాదగ్గర నేర్చుకుని.. మాకే పాఠాలు చెబుతారా?`` అంటూ తెలంగాణ సర్కారుపై విజయన్ విరుచుకుపడ్డారు. అంతేకాదు..పేదరికం, మద్యం, వెనుకబాటు తనం, అప్పులు.. అవినీతి ఇలా అన్నింటిలోనూ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ముందుందని దుయ్యబట్టారు.
అయితే.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి విజయన్‌ను ఘాటు సమాధానం ఇస్తూ..సుదీర్ఘలేఖను సంధించారు. దీనిలో పలు విషయాలు ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల నుంచి అక్షరాస్యత, ప్రాజెక్టులు, అవినీతి, అక్రమాలు.. ఇలా అన్ని విషయాలను వెల్లడించారు. దీనిలో గణాంకాలు కూడా పేర్కొనడం గమనార్హం. అదేసమ యంలో ఆర్థిక వృద్ధి విషయంలో తెలంగాణ ఏవిధంగా ముందుకు సాగుతోంది? అనే వివరాలు పేర్కొన్నారు.
తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ అభివృద్ధి, మూసీప్రక్షాళన, పేదలకు ఇళ్లు(విజయన్.. పేదలకు గూడు చేస్తున్నారన్న విమర్శలకు స్పందన), రైతు భరోసా(రైతుల ఆత్మహత్యల విమర్శలపై స్పందన) వంటి అంశాలను వివరించారు. ``విజయన్‌పై అపార గౌరవం ఉంది.`` అంటూనే సూటిగా సుత్తిలేకుండా లేఖలో విరుచుకుపడ్డారు.
రేవంత్ లేఖలో ముఖ్యాంశాలు..
1) 2024-25 లో తెలంగాణ రాష్ట్ర తలసరి వృద్ధి 10.1 శాతంగా ఉంది. ఇది జాతీయ జీడీపీ 9.9 శాతం కంటే ఎక్కువ. దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉంది.
2) తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదే 20,617 కోట్ల రూపాయల మేర రైతు రుణాలను మాఫీ చేశాం. 25.36 లక్షల మంది రైతులను రుణ విముక్తుల్ని చేశాం.
3) రైతు భరోసాను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. ప్రతి ఏటా ఎకరాకు 12 వేల రూపాయలు ఇస్తున్నాం. రెండేళ్లలో 69 లక్షల. 70 వేల మంది రైతులకు 25,279 కోట్ల రూపాయలు అందించాం.
4) రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
5) రైతులకు 5 లక్షల రూపాయల మేరకు బీమా కల్పిస్తున్నాం. 14 లక్షల 91 వేల మందికి లబ్ధి కలుగుతోంది.
6) రైజింగ్ తెలంగాణలో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.
7) మూసీ ప్రక్షాళనతో నష్టపోతున్న పేదలకు వేరే చోట ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నాం.
8) అవినీతికి తావులేని వాట్సాప్ పాలనను ప్రారంభించాం(ఇటీవలే ప్రారంభించారు).
9) ప్రాజెక్టుల నిర్మాణానికి.. పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నాం.