కేసీఆర్ కి కొత్త పేరు...అక్కడే ఉండాలంటూ...!

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్ధులను విమర్శించడంతో రాజకీయ దూకుడు బాగా చూపిస్తారు అని అంటారు.;

Update: 2026-01-17 03:15 GMT

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్ధులను విమర్శించడంతో రాజకీయ దూకుడు బాగా చూపిస్తారు అని అంటారు. ఆయన పంచుల మీద పంచులు వేస్తారు. అంతే కాదు తన సెటైర్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఆయన కామెంట్స్ అన్నీ హాట్ గా ఉండడమే కాదు నవ్వులు కూడా పూయిస్తాయి. తాజాగా కేసీఆర్ తెలంగాణా రాజకీయాల మీద మాట్లాడుతూ ప్రత్యర్ధి బీఆర్ఎస్ మీద తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ఆయన కేసీఆర్ రాజకీయ అనుభవం గురించి చెబుతూ అంతలోనే పెద్దాయనకు కొత్త పేరు పెట్టి మరీ విమర్శలు గుప్పించారు.

శుక్రాచార్యులు మాదిరిగా :

పురాణాలలో శుక్రాచార్యులు అని ఒక గురువు ఉండేవారు ఆయన మాదిరిగా కేసీఆర్ వైఖరి ఉందని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. శుక్రాచార్యులు ఎక్కడైనా యాగాలు హోమాలు జరుగుతూంటే తన శిష్యులను పంపించి వాటికి విఘ్నాలు కలిగించే వారు అని రేవంత్ చెప్పారు. ఆ మాదిరిగానే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను అసెంబ్లీకి పంపించి అన్ని విధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని దెప్పి పొడిచారు.

ఫాంహౌస్‌లోనే ఉండండి :

తెలంగాణా అభివృద్ధికి కేసీఆర్ తన రాజకీయ అనుభవం మొత్తం ఉపయోగించి సలహాలు సూచనలు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఆయన ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఆ మీదట ముఖ్యమంత్రిగా పదేళ్ళ పాటు పాలించారని, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారని గుర్తు చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నవాళ్లు ఇలాగే వ్యవహరిస్తారా అని కేసీఆర్ ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీకు చేతనైతే ఆశీర్వదించండి , లేకపోతే ఫాంహౌస్‌ లోనే ఉండండి అని రేవంత్ చెప్పడం విశేషం.

అప్పులే ఉరితాళ్ళుగా :

ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులే ప్రస్తుతం తెలంగాణాకు ఉరి తాళ్ళుగా మారాయని ఆయన అన్నారు. అయినా సరే సమస్యలను తాము ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామని అన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుంటే దానిని కూడా అడ్డుకుంటున్నారని, రియల్ ఎస్టేట్ కోసమని విమర్శిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని సమస్యలు ఒకేసారి తీర్చడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన అంటూ తాము ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్లమని స్పష్టం చేశారు. అంతా ప్రజల కోసమే ఖర్చు చేస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు మంచివాళ్లను గెలిపించాలని ఆయన కోరారు. పని చేసేవాళ్లను గెలిపిస్తేనే ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

పదేళ్ళు మేమే :

అంతే కాకుండా రేవంత్ రెడ్డి మరో కీలక వ్యాఖ్య చేశారు. 2034 దాకా అంటే మరో పదేళ్ళ వరకూ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అభివృద్ధి చేసి చూపించేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆయన అన్నారు. మొత్తానికి కేసీఆర్ పూర్తి ధీమాతో మాట్లాడటం కాదు ప్రత్యర్థుల మీద రాజకీయంగా ఘాటు విమర్శలు చేశారు అని చెప్పాల్సి ఉంది.

Tags:    

Similar News