ఓయూ పర్యటన వేళ సీఎం రేవంత్ లవ్ స్టోరీ 2 చెప్పిన ప్రొఫెసర్

ఒకట్రెండు నెలల క్రితం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన ఆయన.. అక్కడి సమస్యల గురించి మాట్లాడటమే కాదు.. త్వరలోనే తాను మళ్లీ విశ్వవిద్యాలయానికి వస్తానని.. నిధులు కేటాయిస్తానని చెప్పటం తెలిసిందే;

Update: 2025-12-11 04:17 GMT

చెప్పిన మాటను చెప్పినట్లే ఫాలో అవుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకట్రెండు నెలల క్రితం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన ఆయన.. అక్కడి సమస్యల గురించి మాట్లాడటమే కాదు.. త్వరలోనే తాను మళ్లీ విశ్వవిద్యాలయానికి వస్తానని.. నిధులు కేటాయిస్తానని చెప్పటం తెలిసిందే. ఆ మాటలకు తగ్గట్లే తాజాగా ఉస్మానియా వర్సిటీకి రూ.వెయ్యి కోట్ల నిధుల్ని కేటాయిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుతో వెళ్లిన సీఎం రేవంత్.. అక్కడి వారి మనసుల్ని దోచుకున్నారు. అంతేకాదు.. ఓయూ మీద వరాల వర్షం కురిపించారు.

ఉస్మానియా వర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఓకే చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ పోస్టులు భర్తీ విషయంలో మంత్రులు.. ఎంపీలు.. ఎవరి ఒత్తిళ్లకు.. సిఫార్సులను ఫాలో కావొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే మంచినీళ్లు ఇవ్వండి.. మర్యాదలు చేయండి.. భోజనం పెట్టండి.. అంతే తప్పించి వారి రికమెండేషన్లను పరిగణలోకి తీసుకోమని స్పష్టంగా చెప్పండన్న రేవంత్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

తాను ఓయూకు రూ.వెయ్యి కోట్లు కేటాయించి ప్రభుత్వ ఉత్తర్వుతో క్యాంపస్ కు వచ్చినట్లుగా పేర్కొన్న ముఖ్యమంత్రి.. ఇంగ్లిషు భాషలో మాట్లాడితేనే గౌరవం ఉంటుందని.. ఎదుటోళ్లు గౌరవిస్తారన్నది ఉత్త అపోహే అని స్పష్టం చేశారు. చైనా.. జపాన్.. జర్మనీలో ఇంగ్లిషులో మాట్లాడరని.. చైనా గంటలసేపు తన వస్తువుల్ని నిలిపేస్తే అమెరికా చతికిలబడుతుందన్నారు. తనకు ఇంగ్లిషు అంతగా రాదన్న సీఎం రేవంత్.. భాష రాకపోవటం నామోషీ కాదని.. భాష కేవలం కమ్యూనికేషన్ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. ఈ సభలో మాట్లాడిన ఓయూ ప్రొఫెసర్ కాశీం ముఖ్యమంత్రి రేవంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ మళ్లీ ప్రేమలో పడ్డారంటూ.. ‘‘30 ఏళ్ల క్రితం గీతమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల నుంచి విద్య (చదువు) అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జీవితాంతం విద్య అనే అమ్మాయి ప్రేమలో ఉండాలని కోరుకుంటున్నా. 1965లో దేశ ప్రధాని ఇందిరాగాంధీ ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఎక్కారు. ఆ తర్వాత వచ్చింది సీఎం రేవంతే’’ అంటూ చేసిన వ్యాఖ్యలు సీఎంతో సహా అందరిని నవ్వేలా చేశాయి.

Tags:    

Similar News