చట్టసభల్లో సీట్ల పెంపు.. కేంద్రం వర్సెస్ రేవంత్? ఎవరు కరెక్టు?
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కీలక బిల్లును చట్టసభలో ప్రవేశ పెట్టేందుకు మోడీ సర్కారు రంగం సిద్ధం చేయటం తెలిసిందే.;
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కీలక బిల్లును చట్టసభలో ప్రవేశ పెట్టేందుకు మోడీ సర్కారు రంగం సిద్ధం చేయటం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన బిల్లును ఎంపీలకు అందజేయటం ద్వారా.. తాను త్వరగానే ఈ అంశాన్ని చట్టం చేయాలన్న ఆలోచనలో ఉన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఎంపీలకు అందించిన బిల్లులో నియోజకవర్గాల పునర్విభజన ఎలా చేయనున్నారన్న స్పష్టతను ఇవ్వకపోవటంతో.. పలు వాదనలు వినిపిస్తున్నాయి. అనధికారికంగా వెల్లడించిన వివరాల్ని చూసినప్పుడు.. జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న లోక్ సభ స్థానాలకు సగాన్ని పెంచకునేలా బిల్లు ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేయటం తెలిసిందే. అంటే.. ఒక రాష్ట్రంలో 50 లోక్ సభ స్థానాలు ఉంటే.. కొత్తగా ప్రవేశ పెట్టనున్న బిల్లులో మరో 25 స్థానాలు పెరిగేలా ఉంటాయన్న వాదనను ఎన్డీయే ప్రభుత్వం చెబుతోంది.
అందుకు భిన్నంగా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. కుటుంబ నియంత్రణను సమర్థంగా అనుసరించిన రాష్ట్రాలు దారుణంగా దెబ్బ తింటాయి. అదే జరిగితే.. దక్షిణాది రాష్ట్రాలకు దారుణంగా నష్టపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం ఏ విధానాన్ని అనుసరిస్తుందన్న దానిపై స్పష్టత లేనప్పటికీ.. ఇప్పటివరకు జరిగిన పరిణామాల్ని చూసినప్పుడు యాభై శాతం నియోజకవర్గాల పెంపు వైపే మొగ్గు చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ ను తెర మీదకు తీసుకొచ్చారు. నిజానికి.. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ మాదిరి ఇంత వివరంగా స్పందించింది లేదు.
దీంతో.. కేంద్రం చెబుతున్నట్లు 50 శాతం నియోజకవర్గాల పెంపు ఫార్ములా కరెక్టా? లేదంటే రేవంత్ చెబుతున్న హైబ్రిడ్ మోడల్ సరైనదా? అన్నది చర్చ. అదే సమయంలో ఈ రెండింటిలోనూ లోపాల్ని సరిచేసి.. అత్యుత్తమ మార్గం అంటూ ఏదైనా ఉందా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటప్పుడు అంశాల్ని సాపేక్షంగా సమీక్షించటం ద్వారా.. ఈ అంశానికి సంబంధించి అత్యుత్తమ పరిష్కారం ఏముందన్న చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
కేంద్రం తెర మీదకు తీసుకొచ్చిన చట్టసభల సీట్ల పెంపు అంశంలో యాభై శాతం పెంచే విధానాన్ని అనధికారికంగా చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ విధానంలోని లోపాల్నిచూస్తే.. ప్రతి రాష్ట్రంలోనూ సీట్లను 50 శాతం మేర జనాభా ప్రాతిపదికన పెంచటం. అదే జరిగితే.. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పార్లమెంటులో తగ్గుతుంది. అదే సమయంలో రాజకీయ వ్యత్యాసాలు పెరుగుతాయి.
ఒక ఉదాహరణతో ఈ సమస్య తీవ్రతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లో సీట్ల సంఖ్య 80 నుంచి 120కు పెరుగుతాయి. అదే సమయంలో తెలంగాణలో ఇప్పుడున్న 17 స్థానాలకు పెరిగే స్థానాల్ని కలిపితే.. పాతిక నుంచి ఇరవై ఆరు సీట్ల వరకు మాత్రమే పెరుగుతాయి. దీంతో.. ఉత్తరభారతం రాజకీయంగా మరింత శక్తివంతంగా మారుతుంది. అదే సమయంలో దక్షిణాది ప్రాధాన్యతకు గండి పడే ప్రమాదం ఉంది. ఇలా చేయటం ద్వారా ఉత్తరాది రాష్ట్రాల సీట్ల సంఖ్యభారీగా పెరిగే.. దక్షిణాది రాష్ట్రాల సంఖ్య పరిమితంగా పెరిగినట్లుగా కనిపిస్తుంది.
మరి.. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానంలోని లోపాల్ని చూస్తే.. సీట్ల పెంపులో 50 శాతం జనాభా ప్రాతిపదిక.. మిగిలిన 50 శాతం రాష్ట్రాల స్థూల ఉత్పత్తి లేదంటే ఆర్థిక పని తీరు ఆధారంగా చేయాలని ఆయన చెబుతున్నారు. ఆర్థిక పని తీరునే ప్రాతిపదికగా తీసుకుంటే బిహార్.. ఒడిశా వంటి వెనుకబడిన రాష్ట్రాలకు రాజకీయంగా మరింత బలహీనపడతాయి. ఇది రాష్ట్రాల మధ్య మరిన్నివిభేదాలకు దారి తీసే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి.. ఒక ఓటు ప్రాతిపదికన ప్రతినిధుల సంఖ్య ఉండాలే కానీ.. ఆర్థిక కారకాలను తెర మీదకు తీసుకొస్తే.. ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉంటుంది.
ఇలాంటప్పుడు ఏ విధానాన్ని అనుసరించటం అత్యుత్తం? అన్నది ప్రశ్నగా మారుతుంది. పలు రంగాల మేధావుల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంటే.. జనాభాకు యాభై శాతం.. మిగిలి యాభై శాతాన్ని మానవాభివృద్ధి సూచిక, ఆర్థిక క్రమశిక్షణ, జనాభా నియంత్రణ పని తీరు అంశాల్ని వెయిటేజీగా తీసుకుంటే..జనాభానియంత్రణ పాటించిన రాష్ట్రాలకు అన్యాయం జరగదు. అదే సమయంలో వెనుకబడిన రాష్ట్రాలకు కూడా తగిన ప్రాతినిధ్యం లభిస్తుంది. ఇక్కడే మరో ఆసక్తికర ప్రతిపాదన తెర మీదకు వస్తోంది.
అదేమంటే.. అమెరికా మోడల్.అమెరికా సెనెట్ తరహాలో ప్రతి రాష్ట్రానికి అది చిన్న రాష్ట్రమైనా.. పెద్ద రాష్ట్రమైనా.. నిర్ణీత సంఖ్యలో సమాన సీట్లు కేటాయించటం.దీంతో లోక్ సభలో అధిక సీట్లు ఉన్న రాష్ట్రాలు జాతీయ నిర్ణయాలను వన్ సైడెడ్ గా శాసించే వీలు ఉండదు. సీట్ల పెంపును ఒకేసారి కాకుండా.. 2 - 3 దశాబ్దాల పాటు విడతల వారీ ప్రక్రియగా అమలు చేస్తే.. రాజకీయఅసమానలు అకస్మాత్తుగా పెరగకుండా చూడొచ్చు. కానీ.. వాస్తవంలో ఈ అవకాశం తక్కువ. ఎందుకంటే.. కేంద్రంలో బలమైన ప్రభుత్వంఅధికారంలో ఉన్నప్పుడే మార్పులు చేసే వీలు ఉంటుంది.
అందుకే లోక్ సభలో జనాభా ప్రాతిపదిక మార్పులు చేసినా.. రాజ్యసభలో మాత్రం అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉండేలా సంస్కరణలు తీసుకొచ్చి.. రాజ్యసభలకు ప్రాతినిధ్యం వహించే వారంతా.. తప్పనిసరిగా ఆయా రాష్ట్రాలకు చెందిన వారే ఉండేలా మార్పు చేయటం.. ప్రస్తుతం బిల్లుల ఆమోదంలో రాజ్యసభ పాత్ర కొంతమేర మాత్రమే కట్టడి చేయగలదు. అందుకు భిన్నంగా లోక్ సభ తరహాలో..రాజ్యసభకు మరిన్ని అధికారాలు కట్టబెట్టటం ద్వారా రాష్ట్రాల మద్య సమతుల్యతను కాపాడే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ కొంత క్లిష్టంగా కనిపించినప్పటికీ.. ఉత్తరాది వర్సెస్ దక్షిణాది లాంటి వాదనలకుచెక్ చెప్పే వీలుంది. ఈ తరహాలోనే అత్యుత్తమ విధానానికి తుది రూపు ఇచ్చేందుకు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి.. దాని సూచనలకు తగినట్లుగా చట్టం చేయటం మరో చక్కటి మార్గంగా మారుతుంది. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో మోడీ సర్కారు అంత పెద్ద మనసుతో వ్యవహరించే అవకాశం దాదాపు ఉండదనే చెప్పాలి.