బిగ్ బ్రేకింగ్.. లోకేశ్ కు ప్రమోషన్! టీడీపీలో కీలక మార్పులు
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్ ను నియమించారు.;
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్ ను నియమించారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఎప్పటి నుంచో లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత మహానాడు అనంతరం తెరపైకి వచ్చిన డిమాండ్ ఈ ఏడాది మహానాడుకు ముందు అమలులోకి తేవడం గమనార్హం. పార్టీ కమిటీలను ప్రకటించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేశ్ ను పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా కోరుకున్నట్లు మంత్రి నారా లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. టీడీపీలో ఈ పదవి ఇంతకు ముందు ఎన్నడూ లేదు. కేవలం నారా లోకేశ్ కోసం మాత్రమే ఈ పదవిని సృష్టించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన లోకేశ్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని టీడీపీ నేతలు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. గత మహానాడు వేదికపై ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని తీర్మానం కూడా చేశారు. అయితే పార్టీ సంస్థాగత నియమావళి మార్చాల్సిన పరిస్థితి ఉండటంతో ఇంతకాలం ఆలస్యమైందని అంటున్నారు.
ఇక మంత్రి నారా లోకేశ్ కు ప్రమోషన్ ఇవ్వడంతోపాటు పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ, ఏపీ రాష్ట్ర కమిటీలను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన కిలారు రాజేశ్ లను ఎంపిక చేశారు. ప్రధాన కార్యదర్శులుగా ఎంపికైన ముగ్గురిలో రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ఆ పదవిలో కొనసాగుతున్నారు.
ఇక పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి అయిన పొలిట్ బ్యూరోలో మొత్తం 29 మందికి స్థానం కల్పించారు. సీనియర్లకు పెద్దపీట వేస్తూనే పార్టీలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇద్దరు నేతలకు నేరుగా పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి చెందిన క్లస్టర్ ఇంచార్జి గుత్తికొండ ధనుంజయ్, విజయనగరం జిల్లా గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవికి పొలిట్ బ్యూరోకు ఎంపిక చేయడం విశేషంగా చెబుతున్నారు.
అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావుకు రెండోసారి అవకాశం ఇచ్చారు. 2024 ఎన్నికల అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న పల్లా శ్రీనివాసరావుకు రెండో సారి రెన్యువల్ చేశారు. ఈ నియామకంతో బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు ఉత్తరాంధ్రకు ప్రాధాన్యమిచ్చినట్లు చెబుతున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్రకు చెందిన పలువురు నేతలకు పొలిట్ బ్యూరోతోపాటు జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించింది. అంతేకాకుండా సామాజిక, ప్రాంతీయ సమీకరణలతో భారీ కసరత్తు అనంతరం పార్టీ కమిటీలను టీడీపీ ప్రకటించింది.