రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేయలేకపోతున్నారా ?
కాంగ్రెస్ అనే మహా సముద్రంలో రేవంత్ రెడ్డి తన శక్తి కొద్దీ ఈదుతున్నారు. కానీ అది మహా సముద్రం.;
కాంగ్రెస్ అనే మహా సముద్రంలో రేవంత్ రెడ్డి తన శక్తి కొద్దీ ఈదుతున్నారు. కానీ అది మహా సముద్రం. గజ ఈతగాళ్ళు ఎంతో మంది ఈది అలసిపోయిన చరిత్ర కళ్ళ ముందు ఉంది. కాంగ్రెస్ లో పుట్టి పెరిగి ఎన్నో పదవులు చేసిన వారు కూడా అక్కడ గజ ఈత నేర్చుకున్నా తడబడుతూంటారు. కాంగ్రెస్ అంటేనే వర్గాల మయం. కాంగ్రెస్ అంటే కురు వృద్ధుల సమ్మేళనం. కాంగ్రెస్ అంటేనే పూర్తి స్వేచ్చా స్వాతంత్రాలతో వర్ధిల్లే పార్టీ. అక్కడ ఎవరికి వారే బాస్ అన్నట్లుగా ఉంటుంది. అలాంటి కాంగ్రెస్ తో గట్టిగా దశాబ్దం కూడా రాజకీయ బంధం లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అంటే కచ్చితంగా లక్ అని చెప్పుకోవాల్సిందే.
సీనియర్లతో సవాలే :
తెలంగాణ కాంగ్రెస్ లో ఎంత మంది సీనియర్లు ఉన్నారో చెప్పనవసరం లేదు. ఇక జిల్లాలు ప్రాంతాలు రీజియన్ల వారీగా రాజకీయాలు గ్రూపులు, గొడవలు ఓపెన్ గా డిబేట్లు ఇలా ఎన్నో కాంగ్రెస్ పార్టీతోనే ఉండే విషయాలు. ఇవన్నీ కాంగ్రెస్ కి ఉన్న కవచ కుండలాలలాంటి లక్షణాలు. వీటితో కలుపుకునే కాంగ్రెస్ ని చూడాలి. వేరుగా చూడాల్సిన అవసరం లేదు. అలా చూడడం కూడా కష్టసాధ్యమైన విషయంగానే ఉంటుంది. వారితో ఎంతటి మేరు నగధీరుడికైనా మరెంతటి ధీరోదాత్త నాయకుడికైనా సవాలే అని విశ్లేషిస్తారు.
వైఎస్సార్ సైతం అలా :
కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి ఎదిగిన వారు వైఎస్సార్. ఆయనది అచ్చంగా ముప్పయ్యేళ్ళ రాజకీయ బంధం కాంగ్రెస్ పార్టీతో. అయినా ఆయన సీఎం గా ఉండగా ఆయన వల్ల కూడా తెలంగాణా సీనియర్లను ఎదుర్కోవడం అనుకున్నత సులువుగా కాలేదని అంటారు. ఆయన సైతం ఎన్నో రకాలుగా తట్టుకోవాల్సి వచ్చింది అని చెబుతారు. ఇక ఉమ్మడి ఏపీ రెండుగా కావడానికి కూడా తెలంగాణ కాంగ్రెస్ కురు వృద్ధులు సీనియర్లు కారణం అని కూడా అంతా చెప్పుకుంటారు. అలాగే వినికిడిగా ఉంది.
రేవంత్ కి కత్తి మీద సాముగా :
రేవంత్ రెడ్డి మంచి మాటకారి కావచ్చు. ఆయన మార్క్ వ్యూహాలు ఆయనకు ఉండొచ్చు. ఆయనకు ప్రజాకర్షణ శక్తి ఉండొచ్చు. కానీ అవన్నీ కాంగ్రెస్ పార్టీని నడపడానికి పూర్తిగా సరిపోవని అంటున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని నడపడం ఆయన వల్ల పెద్దగా కావడం లేదు అని అంటున్నారు. మంత్రులు సీనియర్లు ఉన్నారు. పార్టీలో సీనియర్లు ఉన్నారు. అంతే కాదు ఎమ్మెల్యేలలో సీనియర్లు ఉన్నారు. ఇలా అంతా కలసి ఉన్న అతి పెద్ద పార్టీ సమూహంగా కాంగ్రెస్ ఉంది. దాంతో రేవంత్ రెడ్డి మాట చెల్లుతుందా అన్నదే చర్చగా ఉంది.
అన్ని విధాలుగా హ్యాండిల్ చేయాలి :
కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా హ్యాండిల్ చేయాలి. ఎక్కడ తేడా వచ్చినా అసలు కే ఎసరు వస్తుంది. మొత్తం వ్యవహారం ఇబ్బందిలో పడుతుంది. అయితే రేవంత్ రెడ్డి తీరు చూస్తే ఆయన జిల్లాల పర్యటనలు పెద్దగా చేయడం లేదు. జిల్లాలలోకి వెళ్ళడమే లేదు అని అంటున్నారు అంతే కాదు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయలేకపోతున్నారు అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని సైతం హ్యాండిల్ చేయాలి. అయితే ఆ విషయంలో రేవంత్ రెడ్డి ఎంత మేరకు సక్సెస్ అయ్యారు అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇంకో వైపు చూస్తే రేవంత్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న వారు అంతా సీనియర్ మినిస్టర్లే. వారు ఆయన చెప్పినట్లుగా వింటున్నారా అంటే డౌటే అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే ఆదాయాలు ఖజనాకు తగ్గిపోయాయి. ప్రపంచం అంతా రియల్ ఎస్టేట్ రంగం బాగా దెబ్బ తిని ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కునారిల్లింది. దాంతో హైదరాబాద్ వంటి విశ్వనగరం ఉన్నా ఆదాయం అయితే రావడం లేదు అని అంటున్నారు. తన మాటకారితనంతో ఎప్పటికపుడు ప్రత్యర్ధులను ఎండగడుతూ ఉంటారు రేవంత్ రెడ్డి. అయితే ఒకప్పటి మాదిరిగా ఆయన పంచులు పేలడం లేదు అని అంటున్నారు. అంతే కాదు ఆయన వద్ద పంచులు కూడా బొత్తిగా రొటీన్ అయిపోయాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే రేవంత్ రెడ్డి ఏణ్ణర్ధం పాలనలో ఎంత ముందుకు వెళ్ళారు తాను అనుకున్న విధంగా పాలన చేస్తున్నారా అంటే జవాబు మాత్రం పెద్దగా రావడం లేదు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఎదుట బిగ్ టాస్క్ ఉంది. మరి ఆయన రానున్న రోజులలో ఎలా సాధించి ముందుకు వెళ్తారో అన్నది చూడాల్సి ఉంది.