బాబు గ్రాఫ్ పడిపోయింది...రేణుకమ్మ సంచలన సర్వే
ఏపీలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి తమది సుపరిపాలన అంటోంది.;
ఏపీలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి తమది సుపరిపాలన అంటోంది. అయితే విపక్ష వైసీపీ జనాల్లో వ్యతిరేకత వచ్చిందని చెబుతోంది. సరే విపక్షం ఎటూ అదే మాట అంటుంది అనుకుంటే తెలంగాణాకు చెందిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఏపీలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం.
తాజాగా ఆమె ఒక యూట్యూబ్ చానల్ లో మట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో పాలన మీద మీరు ఎన్ని మార్కులు వేస్తారు అని యాంకర్ ప్రశ్నించగా రేణుకా చౌదరి బాబు పాలన మీద తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఎంతో అనుభవం ఉన్నవారు అనుకుని ఎన్నో ఆశలతో ప్రజలు అధికారం కట్టబెట్టారు అని అయితే ఆయన పూర్తి నిరాశను మిగిల్చారు అని వ్యాఖ్యానించారు.
బాబు పాలన ఏమీ బాగు లేదని కుండబద్దలు కొట్టారు. ప్రజలు ఎంతో ఆశించారు కానీ ఆ దిశగా సాగడం లేదని ఆమె అనడం విశేషం. బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ఏపీనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను సైతం తీవ్రంగా దెబ్బ తీస్తున్నారు అని ద్వజమెత్తారు.
బీజేపీ వారు చెప్పింది చేయడమే బాబు పనిగా ఉందని అన్నారు. చెప్పడానికి సారీ అంటూనే చంద్రబాబు గ్రాఫ్ దారుణంగా పడిపోయింది అని అన్నారు. బాబు ఆయన వ్యవహార శైలి కూడా గతంతో పోలిస్తే ఇపుడు వేరేగా ఉందని అన్నారు. ఏపీలో బాబు ఏదో ఉద్ధరిస్తారు అనుకుంటే ఏమీ చేయలేకపోతున్నారు అని రేణుక చెప్పారు.
అనూహ్యంగానే బాబు గ్రాఫ్ పడిపోయిందని అది కూడా చాలా త్వరగా పడిపోయింది అన్నారు. మరి రేణుక చేసిన ఈ కామెంట్ల వెనక ఉన్న విషయాలు ఏమిటి అందులో వాస్తవాలు ఎంతవరకూ ఉన్నాయన్నది చూస్తే కనుక అమరావతి రైతులకు మద్దతుగా ఆమె గతంలో నిలిచారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఏపీకి వచ్చి మరీ అమరావతి టూ అరసవల్లి రైతుల పాదయాత్రను ఆమె ప్రారంభించారు.
ఆనాడు వైసీపీ ప్రభుత్వానికి కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అంతే కాకుండా అమరావతి రైతులకు తాను అండగా ఉంటాను అని అనేక సార్లు చెబుతూ వచ్చారు. ఇక రేణుక అమరావతి రాజధాని రైతుల విషయంలో ఏమైనా అసంతృప్తిగా ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. బాబు ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం తీసుకున్న 33 వేల ఎకరాలలో వారికి ఈ రోజుకూ ఏమీ పెద్దగా చేయకుండా మరో 44 వేల ఎకరాల సేకరణ చేపట్టడం పట్ల వారంతా గుస్సాగా ఉన్నారు.
వారే కాదు ఒక బలమైన సామాజిక వర్గం కూడా ఈ విషయంలో ఆగ్రహంగా ఉంది అని అంటున్నారు. అంతా అమరావతి అయితే ఇక మాకు ఉన్న ప్రత్యేకత ప్రాధాన్యత ఏమి ఉంటుందని వారు అంటున్నారు. ఈ విషయంలోనే బాబు సర్కార్ తీరు పట్ల విమర్శలు వస్తున్నాయని అంటున్నారు. అంతే కాకుండా కేంద్రంలో బీజేపీ పాలనా విధానాలకు చంద్రబాబు మద్దతుగా నిలవడమే కాకుండా గట్టిగా బలపరచడం వల్ల ఫ్యూచర్ లో టీడీపీ పూర్తిగా కార్నర్ అవుతుంది అన్న చర్చ కూడా ఒక సామాజిక వర్గంలో సాగుతోంది అని అంటున్నారు.
అదే విధంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా మునుపటి మాదిరిగా ఆ సామాజిక వర్గం ప్రయోజనాలు ఏవీ పెద్దగా నెరవేరడం లేదు అని అంటున్నారు ఇక కూటమి పాలన సైతం బాబు మార్క్ కి భిన్నంగా సాగుతోందని అంటున్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అప్పులు చేయడం ద్వారా కూడా భవిష్యత్తులో చిక్కులు వస్తాయని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే పోలవరం ఎత్తు తగ్గించడం వంటివి కూడా చర్చకు వస్తున్నాయని చెబుతున్నారు.
ఏది ఏమైనా కూటమి పాలనలో బాబు ముద్ర లేకపోవడంతోనే ఒక కీలక సామాజిక వర్గంలో అసంతృప్తి మొదలైంది అంటున్నారు. మరి రేణుక ఆ విధంగా ఆలోచించి ఈ కామెంట్స్ చేశారా లేక నిజంగా జనంలో కూడా అంతటి అసంతృప్తి ఉందా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఫైర్ బ్రాండ్ గా ఉన్న రేణుకకు ఏపీలో జగన్ కానీ బాబు కానీ నచ్చడం లేదు అన్నది తాజా మాటగా ఉంది.