ఒక్క ప్రకటన.. రిలయన్స్ కు రూ.లక్ష కోట్లు నష్టం

ఈ పతనానికి ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నది. రష్యా నుంచి రిలయన్స్ ఆయిల్ దిగుమతులు చేసుకుంటోంది అన్న వార్తలు. ఈ కథనాలపై రిలయన్స్ స్పష్టంగా స్పందిస్తూ వాటిని ఖండించింది.;

Update: 2026-01-06 16:42 GMT

భారత స్టాక్ మార్కెట్‌ షేక్ అయిపోయింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్.ఐ.ఎల్) కు సంబంధించిన ఒక ప్రకటన ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపదను భారీగా తగ్గించింది. రిలయన్స్ షేరు విలువ ఇంట్రాడే ట్రేడింగ్‌లో గరిష్ఠంగా 5 శాతం వరకు పడిపోయింది. ఫలితంగా కేవలం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లు దాదాపు రూ.1 లక్ష కోట్ల మార్కెట్ విలువను కోల్పోయారు.

2024 జూన్ తర్వాత అతిపెద్ద పతనం

2024 జూన్ తర్వాత రిలయన్స్ షేర్లలో ఇదే అతిపెద్ద పతనం కావడం గమనార్హం. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దాంతో షేరు ధర ఇంట్రాడేలో రూ.1,496 వద్ద కనిష్ఠాన్ని తాకింది.

రష్యా ఆయిల్ వార్తలే కారణమా?

ఈ పతనానికి ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నది. రష్యా నుంచి రిలయన్స్ ఆయిల్ దిగుమతులు చేసుకుంటోంది అన్న వార్తలు. ఈ కథనాలపై రిలయన్స్ స్పష్టంగా స్పందిస్తూ వాటిని ఖండించింది. అయినప్పటికీ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, చమురు వాణిజ్యంపై ఉన్న ఆంక్షల భయాలు ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచాయి.

మార్కెట్‌పై విస్తృత ప్రభావం

రిలయన్స్ పతనం కేవలం ఒక కంపెనీకే పరిమితం కాలేదు. దేశీయ స్టాక్ మార్కెట్‌పై కూడా దాని ప్రభావం పడింది. హెవీవెయిట్ స్టాక్ కావడంతో రిలయన్స్ షేరు పడిపోవడం వల్ల సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఎనర్జీ, రిఫైనింగ్ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు పెరిగాయి.

ఇన్వెస్టర్లలో ఆందోళన

మార్కెట్ నిపుణుల మాటల్లో రిలయన్స్ వంటి బ్లూచిప్ స్టాక్‌లో ఈ స్థాయి పతనం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని తాత్కాలికంగా దెబ్బతీసింది. అయితే కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఆతురపడాల్సిన అవసరం లేదని వారు సూచిస్తున్నారు. ఇది కేవలం వార్తల వల్ల కలిగిన తాత్కాలిక స్పందన మాత్రమేనని, కంపెనీ ప్రాథమిక రంగాలు బలంగానే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారీ పతనాలు వచ్చినప్పుడు నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని.. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు కంగారుపడి అమ్మేయవద్దని సూచిస్తున్నారు.

రిలయన్స్ నుంచి వచ్చే తదుపరి స్పష్టీకరణలు, అంతర్జాతీయ చమురు మార్కెట్ పరిస్థితులు, గ్లోబల్ జియోపాలిటికల్ పరిణామాలే ఇకపై షేరు గమనాన్ని నిర్ణయించనున్నాయి. తాత్కాలిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో కంపెనీ పనితీరు కీలకంగా మారనుంది.

Tags:    

Similar News